- నెలలో నాలుగు రోజులు పాల్గొనాలి
- సాధించిన ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
- రుషికొండపై మీ అభిప్రాయాలు చెప్పండి
- వైసీపీ కుట్రలను మరింతగా తిప్పికొట్టాలి
- మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
అమరావతి (చైతన్య రథం): ఏపీ క్యాబినెట్ భేటీ అనంతరం మంత్రులతో సీఎం చంద్రబాబు సుదీర్ఘంగా మాట్లాడారు. మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాల్లో ‘పల్లె నిద్ర’ చేయాలని దిశానిర్దేశం చేశారు. నెలలో నాలుగు రోజులపాటు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు. ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకు చెప్పాలన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో నాలుగోవంతు కూడా పొరుగు రాష్ట్రాల్లో అమలు కావడం లేదని చెప్పారు. ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు మంత్రులకు సూచించారు. మరోవైపు రుషికొండ ప్యాలెస్‌పై మంత్రులతో సీఎం చర్చించారు. జగన్ హయాంలో నిర్మించిన భవనాలను ఏం చేయాలన్న దానిపై చర్చించారు. మొదట మంత్రులంతా ఆ ప్యాలెస్‌ను సందర్శించాలన్నారు.
తర్వాత ఏం చేద్దామనే అంశంపై అభిప్రాయాలు చెప్పాలని మంత్రులకు చంద్రబాబు సూచించారు. పాస్టర్ ప్రవీణ్ మృతి వ్యవహారంలో ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా వైకాపా వ్యవహరిస్తోందని సీఎం మండిపడ్డారు. సీసీ కెమెరాల్లో ఒక్కో అంశం బయటకు వస్తోందని చెప్పారు. ‘‘ప్రవీణ్ మృతి కేసు ఛేదనలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అప్రమత్తంగా లేకుంటే బాబాయ్ గొడ్డలి, కోడికత్తి తరహాలో అన్నీ మనపైనే వేస్తారు. చేసిన మంచి చెప్పుకోవడానికి ఇబ్బందులు పడుతుంటే.. లేని నిందలు వేసేందుకు కుట్ర చేస్తున్నారు. సోషల్ మీడియా పోస్టులను వక్రీకరించి చెడు సందేశాలు వ్యాప్తి చేస్తున్నారు. అన్నింటిపై అప్రమత్తంగా ఉంటూ కుట్రలను తిప్పికొడదాం’’ అని చంద్రబాబు మంత్రులకు దిశా నిర్దేశం చేశారు.