- సురక్షిత ప్రసవాల కోసం మరింత మెరుగైన వైద్య సౌకర్యాలు
- 2030 నాటికి ప్రసూతి మరణాల రేటును 70 కన్నా తగ్గించాలన్నదే లక్ష్యం
- ఎక్స్‌లో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్
అమరావతి (చైతన్యరథం): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పలు కార్యక్రమాల ద్వారా ఏపీలో ప్రసూతి మరణాలను తగ్గించటంలో గణనీయమైన ప్రగతి సాధించగలిగామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రసూతి మరణాలను తగ్గించడంతో పాటు మహిళలకు సురక్షితమైన మాతృత్వంతో పాటు ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందించడంలో ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంతో పాటు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తున్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యల కారణంగా 2014-16 మధ్యకాలంలో లక్ష శిశు జననాలకు నమోదైన 130 ప్రసూతి మరణాల రేటు (ఎంఎంఆర్) 2018-20 నాటికి 97కి తగ్గిందన్నారు. 2030 నాటికి ప్రసూతి మరణాల రేటు లక్షకు 70 కన్నా తగ్గించాలన్న సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యసాధనకు కృషి చేస్తున్నామన్నారు. అదే విధంగా సంస్థాగత ప్రసవాలు 79 శాతం (2015-16లో) నుండి 89 శాతానికి (2019-21లో) పెరిగాయని, మొదటి త్రైమాసికంలో గర్భస్థ శిశు సంరక్షణా కేంద్రాల్ని (ఎఎన్‌సి) ఆశ్రయించే వారి శాతం 59 నుండి 70కి పెరిగిందని మంత్రి వివరించారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జననీ సురక్ష యోజన, ప్రధానమంత్రి మాతృ వందన యోజన, జననీ శిశు సురక్షా కార్యక్రమం, సురక్షిత మాతృత్వ ఆశ్వాసన్, ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ వంటి పథకాలు సమగ్ర ప్రసూతి నిర్వహణ, మాతా శిశు సంరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్నాయన్నారు. లక్ష్య లేబర్ రూమ్ మరియు ఆపరేషన్ థియేటర్ సంరక్షణ వంటి కార్యక్రమాలు ప్రసూతి సౌకర్యాల నాణ్యతను మరింత మెరుగుపరుస్తున్నాయన్నారు. అంతేకాక అధిక-ప్రమాదకర గర్భాలకు సురక్షిత ప్రసవాలను నిర్వహించడానికి ప్రసూతి విభాగాలను బలోపేతం చేశారన్నారు. మాతా, శిశు ప్రాణాలను కాపాడేందుకు మధ్యప్రదేశ్‌లో దస్తక్ అభియాన్, తమిళనాడులో అత్యవసర ప్రసూతి సంరక్షణ వంటి వినూత్న కార్యక్రమాలు అమలులో వున్నాయని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక పాలనలో భారతదేశం 2030 నాటికి ప్రసూతి మరణాల రేటును 70 కన్నా తక్కువ స్థాయికి తేవాలన్న లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తోందని, సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాలను సాధిస్తోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు.