- ఏపీకి బ్రాండ్ సీఎం చంద్రబాబు
- కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలి
- మంగళగిరితో పోటీపడతామనే ఎమ్మెల్యే వాసు సవాల్‌ను స్వీకరిస్తున్నా
- కష్టంలో తోడుగా ఉన్న ఆదిరెడ్డి కుటుంబానికి అండగా ఉంటాం
- రాజమండ్రి సిటీ నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతలతో సమన్వయ సమావేశంలో మంత్రి లోకేష్
రాజమహేంద్రవరం (చైతన్యరథం): ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది.. కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలని టీడీపీ నేతలు, కార్యకర్తలకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపు ఇచ్చారు. రాజమహేంద్రవరంలోని చెరుకూరి వీర్రాజు సుబ్బలక్ష్మి కన్వెన్షన్ సెంటర్‌లో శుక్రవారం జరిగిన రాజమండ్రి సిటీ నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతలతో సమన్వయ సమావేశంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలకు కార్యకర్తలు ఉంటారు.. కానీ తెలుగుదేశం పార్టీకి మాత్రం కుటుంబ సభ్యులు ఉంటారన్నారు. కార్యకర్తలను చూస్తే కుటుంబ సభ్యులను చూసినట్లుగా ఉంటుంది. హైదరాబాద్‌లో, మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో కుటుంబ సభ్యులకు మాదిరిగా కార్యకర్తలకు అధినేత చంద్రబాబు భోజన వసతి ఏర్పాటు చేశారు. కార్యకర్తే మా అధినేత. నాయకులు వస్తారు, వెళ్తారు. టీడీపీకి కార్యకర్తలే బలం. అంజిరెడ్డి తాత, మంజుల, తోట చంద్రయ్యలే నాకు స్ఫూర్తి. ఫ్యాక్షన్ దాడిలో చనిపోయిన తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాం. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కేసులు పెట్టించుకున్నాం. టీడీపీ కార్యకర్తలు, నేతలపై నమోదు చేసిన అక్రమ కేసులు ఎత్తివేయాలని కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో చెప్పా. 175 స్థానాల్లో 164 స్థానాలు కైవసం చేసుకున్నాం. వై నాట్ 175 అన్నవారు టీం 11కే పరిమితమయ్యారని మంత్రి లోకేష్ గుర్తు చేశారు.
ఏపీకి బ్రాండ్ చంద్రబాబు
అహంకారం వద్దు. కష్టపడి పనిచేయాలి. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రూ.4వేల వృద్ధాప్య పెన్షన్ చెల్లిస్తున్నాం. వికలాంగులకు రూ.6వేలు, మంచానికే పరిమితమైన వారికి రూ.15వేలు చెల్లిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ. తల్లికి వందనం పథకం కింద ఎంత మంది పిల్లలుంటే అంతమందికీ సాయం అందించాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నాం. ఇచ్చిన ప్రతి హామీ కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది. 150 రోజుల్లో డీఎస్సీ ప్రక్రియ పూర్తిచేసి 16వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశాం. 6వేల మందిని కానిస్టేబుళ్లుగా నియమించాం. ఎప్పుడూ లేనివిధంగా పెట్టుబడులు వస్తున్నాయి. ఏపీకి బ్రాండ్ సీఎం చంద్రబాబునాయుడు. జూనియర్లు, సీనియర్లను సమానంగా గౌరవిస్తాం. పనిచేసే వారినే ప్రోత్సహిస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.
బెదిరింపులే జగన్ రెడ్డి నైజం
బాగా పనిచేసిన వారిని నామినేటెడ్, పార్టీ పదవులతో పైకి తీసుకువెళతాం. పార్టీ శాశ్వతం. టీడీపీని భూస్థాపితం చేస్తామని కొంతమంది ప్రగల్బాలు పలికారు. తెలుగుజాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది. రాష్ట్రంలో ఒక సైకో ఉన్నాడు. అరెస్ట్ చేస్తానంటున్నాడు. 53 రోజులు మా నాయకుడిని ఇదే రాజమండ్రి జైలులో బంధించి ఏం సాధించారు? మీరు అరెస్ట్ చేస్తే మేం భయపడాలా? నీ కంటే ముందు చాలా మంది పెద్దపెద్ద మాటలు మాట్లాడారు. వారందరి పరిస్థితి ఏమైందో ఆలోచించాలి. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని ఎవరినీ కూటమి ప్రభుత్వం వదిలిపెట్టదు. పార్టీ నేతలు అలక వీడాలి. సమస్యలు ఏమైనా ఉంటే కలిసికట్టుగా పరిష్కరించుకోవాలని మంత్రి లోకేష్ హితవు పలికారు.
చరిత్ర సృష్టించాలన్నా, తిరిగి రాయాలన్నా టీడీపీతోనే సాధ్యం
కుప్పం, హిందూపురం నియోజకవర్గాలు టీడీపీ కంచుకోటలు. ఆ చరిత్ర మనం తిరగరాయాలి. కంచుకోట అంటే మంగళగిరి, రాజమండ్రి అనే విధంగా చరిత్ర తిరగరాయాలి. చరిత్ర సృష్టించాలన్నా, తిరిగి రాయాలన్నా టీడీపీతోనే సాధ్యం. 2019లో ఇక్కడ నుంచి భవానీని గెలిపించారు. కష్టకాలంలో వారు మాకు అండగా నిలబడ్డారు. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించినట్లుగానే భవానీని కూడా అవమానించారు. ఎన్నో ఇబ్బందులు పెట్టారు. అయినా జై తెలుగుదేశం నినాదానికి ఆదిరెడ్డి కుటుంబం కట్టుబడి ఉందని మంత్రి లోకేష్ చెప్పారు.
ఎమ్మెల్యే సవాల్‌ను స్వీకరిస్తున్నా
పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను తూచా తప్పకుండా అమలుచేయాలి. ఆయా కార్యక్రమాలను మై టీడీపీ యాప్ ద్వారా నమోదు చేయాలి. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో నేతలు పాల్గొనాలి. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలి. వారితో మమేకం కావాలి. మంగళగిరితో పోటీ పడతామని స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. ఈ సవాల్‌ను నేను స్వీకరిస్తున్నా. ప్రజలతో ఆత్మీయంగా ఉంటూ వారితో మమేకం కావాలి. ప్రేమతో వారి మనసులను గెలుచుకోవాలని మంత్రి లోకేష్ అన్నారు.
అండగా ఆదిరెడ్డి కుటుంబం
53 రోజుల పాటు చంద్రబాబుని జైలులో అక్రమంగా బంధిస్తే ఆదిరెడ్డి కుటుంబం మాకు అండగా నిలిచింది. దీనిని జీవితాంతం గుర్తుపెట్టుకుంటా. అందరికీ రుణపడి ఉంటా. అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసును నా కుటుంబ సభ్యుడిలా భావిస్తా. కూటమి పార్టీల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తారు. అలాంటి కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలి. కూటమి మధ్య నో క్రాస్ ఫైర్, నో మిస్ ఫైర్, నో విడాకుల్. వచ్చే 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం ఉంటుంది. రాష్ట్రాన్ని అభివృద్ధి పథాన నిలుపుతాం. నాడు, నేడు, ఎప్పుడూ ఆదిరెడ్డి కుటుంబం ఏవిధంగా మాకు అండగా నిలబడిరదో, అదే విధంగా తెలుగుదేశం పార్టీ కూడా ఆదిరెడ్డి కుటుంబానికి అండగా నిలబడుతుందని మంత్రి లోకేష్ చెప్పారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రుడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, జోనల్ కోఆర్డినేటర్ సుజయ్ కృష్ణ రంగారావు, నియోజకవర్గ పరిశీలకులు బి.వెంకటకృష్ణ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.













