- సూపర్ సిక్స్ హామీలను సూపర్ హిట్ చేశాం
- ప్రజల ఆకాంక్షల మేరకు సంక్షేమ పథకాలు
- 2025కి మించి 2026లో చేసి చూపిస్తాం
- గడపనా అభివృద్ధి ప్రతిబింబింపచేస్తాం
- ఇది ట్రైలర్..కత్తులు దూస్తే తోలు తీస్తాం
- ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర
- ఉత్తమ కార్యకర్తలకు అవార్డుల ప్రదానం
మచిలీపట్నం (చైతన్యరథం): సంక్షేమాభివృద్ధి విషయంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఆటంకాలు ఎదురైనా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని గనులు భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నం టీడీపీ కార్యాలయంలో కార్యకర్తలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఉత్తమ కార్య కర్తలకు అవార్డులు అందజేశారు. ప్రజల ఆకాంక్షలకు అధిక ప్రాధాన్యమిస్తూ డబుల్ ఇంజన్ సర్కార్ బుల్లెట్ స్పీడ్గా పనిచేస్తుం దని అన్నారు. 2025 సంవత్సరంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ధికి మించి 2026 సంవత్సరంలో చేయబోతున్నాం. రాష్ట్రంలో సంక్షేమాన్ని సువర్ణాక్షరాలతో లెక్కించేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. దేశంలో సంక్షేమానికి శ్రీకారం చుట్టింది అన్న ఎన్టీఆర్. రూ.2కే కిలో బియ్యం, పక్కా ఇల్లు వంటి పథకాలు తీసుకొచ్చిన ఘనత టీడీపీది. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం లో సుమారు 64 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నాం. పెన్షన్ కోసమే ఇప్పటివరకు 50 వేల కోట్లు పంపిణీ చేశాం. తల్లికి వందనం 67 లక్షల మందికి అందించాం.
ఉచిత గ్యాస్ పథకంలో ఇప్పటి వరకు 2 కోట్ల సిలిండర్లు అందించాం. విద్య ఉద్యోగ ఉపాధి కోసం వెళ్ళే మహిళలకు ఉచితంగా బస్సు సదుపాయం కల్పిస్తున్నాం. అన్నదాత సుఖీభవ పథకంతో కేంద్రం ఇచ్చే రూ.6 వేలకు రాష్ట్ర ప్రభుత్వం 14 వేలు కలిపి అందిస్తోంది. రైతులు పంట అమ్మిన 24 గంటల్లో వారి ఖాతాలో నిధులు జమ చేస్తు న్నాం. మరి రైతులకు కాకుండా మామిడి పత్తి మిర్చి పొగాకు వంటి వాణిజ పంటలకు కూడా అండగా నిలుస్తున్నాం. తుపాన్లతో నష్టపోయిన వారికి తక్షణమే ఆర్థిక సాయం అందించాం. గత ఐదేళ్లు సాగునీటి కాలువల్లో చారెడు మట్టి తీసిన పాపాన పోలేదు. కూటమి అధికారంలోకి రాగానే అన్ని కాలువల్లో మట్టి తొలగించి వంటలను కాపాడుకున్నామని వివరించారు.
రాష్ట్ర అభివృద్ధే తొలి అజెండా
రాష్ట్ర అభివృద్ధి తొలి అజెండాగా అడుగులు వేస్తున్నాం. పీపీపీ విధానంలో ఆస్పత్రుల అభివృద్ధి చేస్తుంటే జగన్రెడ్డి విషం చిమ్ము తున్నాడు. ప్రజలపై భారం పడకుండా ఆస్పత్రుల నిర్మాణం పూర్తి చేసి పేదలకు మెరుగైన వైద్యం, నాణ్యమైన వైద్య విద్య అందించా లనుకుంటే అడ్డుకోవాలని చూస్తున్నాడు. యోగాను రుషికొండకు కొట్టిన బోడి గుండును పోల్చడం జగన్రెడ్డి లాంటి వింత వ్యక్తులకే సాధ్యం. ప్రపంచానికి ఆదర్శంగా యోగా నిర్వహిస్తుంటే.. దాన్ని తన విలాసం కోసం కట్టుకున్న పాలస్ ఖర్చుతో పోల్చడం సిగ్గు చేటు, యోగా డే కోసం ఖర్చు చేసిన ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వం అందించిన విషయం కూడా తెలియకపోవడం సిగ్గు చేటని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను సమానం గా అభివృద్ధి చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతు న్నామని తెలిపారు. విశాఖలో పెట్టుబడుల సదస్సుతో 15 లక్షల కోట్ల పెట్టుబడిలను ఆకర్షించాం. 20 లక్షల మందికి ఉద్యోగులు కల్పించాలా సన్నాహాలు చేస్తున్నాం. సుమారు 26 పాలసీలు తీసుకొచ్చి పారిశ్రామిక ప్రగతికి తోడ్పాటు అందిస్తున్నాం. గతంలో పరిశ్రమలను తరిమేస్తే.. నేడు స్పీడ్ అప్ డూయింగ్తో తిరిగి రప్పిస్తున్నాం. క్వాంటం కంప్యూటింగ్కు ఏపీని కేంద్రంగా చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. గూగుల్ డేటా సెంటర్ రాకతో రిలయన్స్, అదాని, టీసీఎస్ డేటా సెంటర్లు కూడా ఏర్పాటుకు ముందుకొచ్చాయి.
పోర్టులు, ఎయిర్ పోర్టులను అభివృద్ధి చేస్తున్నాం. విజన్ 2047 సాకారం లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి చిత్తశుద్ధితో పని చేస్తున్నాం. పోలవరం పనులు వచ్చే ఏడాదికి పూర్తి చేస్తామని తెలిపారు. అమరావతి అభివృద్ధిని వేగవంతం చేశాం. ఎన్టీఆర్ వైద్య సేవలో భాగంగా 1500 వైద్య సేవలు అందిస్తున్నాం. అవి కాకుండా ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి అవసరమైన మేరకు ఆర్థిక సాయం అందిస్తున్నాం.. మెగా డీఎస్సీతో 16,800 మంది ఉపాధ్యాయులను నియమించాం. స్కూళ్లలో సన్నబియ్యంతో మధ్యా హ్న భోజనం అమలు చేస్తున్నాం. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభి వృద్ధి దిశగా నడిపించేందుకు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవా లని ఎవరైనా ప్రయత్నిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఇప్పటివరకు కూటమి ప్రభుత్వ ట్రైలర్ చూశారు. ఇకపై ఎవరైనా రప్పా రప్పా అంటూ కత్తులు దూసినా… రక్తాభిషేకాలతో ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేయాలని ప్రయత్నించినా తోలు తీస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు వీరంకి వెంకట గురు మూర్తి, ఉపాధ్యక్షులు గోప్ సత్యనారాయణ, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ తదితరులు పాల్గొన్నారు.












