- రాష్ట్రానికి వైసీపీనే అసలు విపత్తు
- విపత్కర పరిస్థితుల్లోనూ విషం చిమ్ముతున్నారు
- క్రమశిక్షణే టీడీపీ బలం…
- ఉల్లంఘించినవారిపై చర్య తప్పదు
- టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి, (చైతన్య రథం): మొంథా తుఫానువల్ల ఎవరికీ ఏ ఇబ్బందీ రాకుండా ప్రభుత్వ యంత్రాంగం, కూటమి పార్టీలు కలిసి పనిచేశాయని, దీనివల్ల ప్రాణ, ఆస్తినష్టం నివారించగలిగామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజలనుంచి వినతులు స్వీకరించారు. అనంతరం పార్టీ విభాగాలతో సమావేశమయ్యారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… ప్రభుత్వ యంత్రాంగం, మంత్రులు, ప్రజాప్రతినిధులు సమర్థవంతంగా పనిచేసి తుఫాను సమయంలో ప్రజలకు అండగా నిలిచారన్నారు. తుఫాన్ ముప్పు ఉంటుందని సమాచారం అందగానే అందరినీ అలెర్ట్ చేశామన్నారు. వరద సమయంలో పార్టీశ్రేణులు చూపిన సేవాభావం అభినందనీయమని, వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజలకు అందించిన సాయం ప్రశంసనీయమని తెలిపారు. తుఫాను బాధితులకు అండగా నిలిచిన పార్టీనేతల పనితీరును, క్షేత్రస్థాయిలో ఉండి పనిచేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలను సీఎం చంద్రబాబు అభినందించారు. విపత్తు సమయంలో ప్రజల ప్రాణాలను, ఆస్తులను కాపాడటంలో ప్రభుత్వం ముందుంటే.. దుష్ప్రచారంలో వైసీపీ నేతలు ముందున్నారని విమర్శించారు. తుఫాన్‌వల్ల రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరగలేదని వైసీపీ బాధపడుతున్నట్లుందని ఎద్దేవా చేశారు. బాధితులకు అండగా నిలవకుండా రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్న వైసీపీ తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. వైసీపీ చేసే ఫేక్ ప్రచారానాలను పార్టీ శ్రేణులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
పరకామణి కేసులో నిందుతులను వైసీపీ కాపాడే ప్రయత్నం
‘‘ప్రపంచవ్యాప్తంగా భక్తుల మనోభావాలతో ముడిపడివున్న టీటీడీలో కూడా వైసీపీ నేతలు అవినీతికి పాల్పడి రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీశారు. కల్తీ నెయ్యి వ్యవహారం భక్తుల మనోభావాలను దెబ్బతీసింది. తిరుమల పవిత్రతను మంటగలిపారు. పరకామణి వ్యవహారంలో వైసీపీ నేతలు నిందితులను కాపాడే విధంగా వ్యవహరించటం సిగ్గుచేటు. వైసీపీ నేతలు టీటీడీపై తప్పుడు ప్రచారం చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు’’ అని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు
‘‘క్రమశిక్షణే తెలుగుదేశం పార్టీ బలం. దాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత. పార్టీ సిద్ధాంతాలు, క్రమశిక్షణను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇకనుంచి వారానికి ఒకరోజు తప్పనిసరిగా కేంద్ర పార్టీ కార్యాలయానికి వచ్చి పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటాను’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు. వరద సహాయ కార్యక్రమాల్లో పాల్గొనని నాయకుల వివరాలను సీఎం చంద్రబాబు తీసుకున్నారు. ప్రతి నాయకుడి పనితీరును నమోదు చేస్తున్నామని, వారి వ్యవహారశైలి ఆధారంగానే భవిష్యత్తులో గుర్తింపు ఉంటుందన్నారు. ఈమధ్య కాలంలో తలెత్తిన వివాదాలపై క్రమశిక్షణా కమిటీ ఆయా నేతలతో మాట్లాడి వివరణ తీసుకుని నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ‘‘క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఉపేక్షించేదిలేదు. పార్టీ కోసం పనిచేసిన వారందరికీ పదవులు వస్తాయి. కష్టపడి పని చేసినవారికి పార్టీలో గుర్తింపు ఉంటుంది. నాయకులు పార్టీ పట్ల నిబద్ధతతో నడుచుకోవాలి’’ అని సీఎం హెచ్చరించారు.












