- శ్రామికశక్తి పరివర్తన సవాళ్లు ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కావు
- వేగవంతమైన ట్రాన్సఫర్మేషన్ కోసం సింగపూర్‌తో కలసి పనిచేస్తాం
- బలమైన విద్యా పర్యావరణ వ్యవస్థకు సహకరించాలి
- సింగపూర్ విద్యావేత్తల రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి లోకేష్
సింగపూర్ (చైతన్యరథం): టెక్నాలజీ శరవేగంతో అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత పోటీ ప్రపంచంలో నైపుణ్యాభివృద్ధికి ఇకపై సాంప్రదాయ విద్యావిధానం సరిపోదు.. నాల్గవ పారిశ్రామిక విప్లవం సాంకేతిక నైపుణ్యాలను మాత్రమే కాకుండా సామర్థ్యాలను కూడా కోరుతోందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. సింగపూర్‌లో ‘‘నైపుణ్యాల నుంచి సామర్థ్యాలకు శ్రామికశక్తి పరివర్తనను వేగవంతం చేయడం (Skills to Competencies,
Accelerating Workforce Transformation)’’ అనే అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న మంత్రి లోకేష్ మాట్లాడుతూ… డైనమిక్ వాతావరణంలో సంక్లిష్ట సమస్యలను స్వీకరించే, ఆవిష్కరించే, పరిష్కరించే సామర్థ్యం కూడా కలిగి ఉండాలన్నారు. ఏపీ ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రిగా మా రాష్ట్రాన్ని ఆవిష్కరణలకు కేంద్రంగా, శ్రామిక శక్తి పరివర్తనలో అగ్రగామిగా ఉంచేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. మేము యువతను ఉద్యోగాల కోసం మాత్రమే కాకుండా, భవిష్యత్తుకు అవసరమైన నైపుణ్యాలతో వారిని సిద్ధం చేస్తున్నాం. అంతర్జాతీయంగా వస్తున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా ఏపీలోని యూనివర్సిటీల్లో నైపుణ్యాభివృద్ధి కోర్సులను ప్రవేశపెడుతున్నాం, సాంప్రదాయ విద్యావిధానానికి స్వస్తిపలుకుతూ కరిక్యులమ్‌లో సమూల మార్పులు తెస్తున్నాం. రీసెర్చి, ఇన్నొవేషన్, స్టూడెంట్ ఎక్సేంజి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లపై సింగపూర్ వర్సిటీలతో కలసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ట్రాన్సఫర్మేషన్‌ను వేగవంతం చేసే సినర్జీలను తయారుచేయడానికి ఆంధ్రప్రదేశ్, ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థలు కలసి పనిచేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మంత్రి లోకేష్ అన్నారు.
సహకరించండి..
నైపుణ్యాన్ని ఉపయోగించుకోవడం, శ్రామిక శక్తి అభివృద్ధి, ముఖ్యంగా జీవితకాల అభ్యాస రంగంలో ప్రపంచవ్యాప్తంగా సింగపూర్ అగ్రగామిగా ఉంది. నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ (ఎన్‌టీయూ), సింగపూర్ యూనివర్సిటీ ఆఫ్ సోషల్ సైన్సెస్ (ఎన్‌యూఎస్‌ఎస్) వంటి సంస్థలు నిరంతర విద్య, నైపుణ్యాల పెంపుదలకు ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమాలను ప్రారంభించాయి. ఎన్‌టీయూలో అసోసియేట్ ప్రొఫెసర్ సియా సీవ్ కీన్, ఎన్‌యూఎస్‌ఎస్‌లో డాక్టర్ యాప్ మీన్ షెంగ్ అభివృద్ధి చేసిన నమూనాల మాదిరిగానే ఆంధ్రప్రదేశ్‌లో జీవితకాల అభ్యాసంపై దృష్టి సారించే నైపుణ్య విశ్వవిద్యాలయాలను స్థాపించే ప్రక్రియ ప్రారంభించాం. ఏపీలో జీవితకాల అభ్యాసం కోసం బలమైన పర్యావరణ వ్యవస్థను సృష్టించడానికి సింగపూర్‌లోని నిరంతర విద్యావ్యవస్థ నుండి ఉత్తమ పద్ధతులను, అనుసరించదగిన సహకారాన్ని తాము కోరుకుంటున్నామని మంత్రి లోకేష్ తెలిపారు.
సింగపూర్ విద్యా వ్యవస్థ బలాల్లో పరిశ్రమ-విద్యారంగం సహకారం ముఖ్యమైంది. సింగపూర్ మేనేజ్‌మెంట్ యూనివర్సిటీ (ఎస్‌ఎంయూ), సింగపూర్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్ (ఎస్‌యూటీడీ) వంటి సంస్థలు పరిశ్రమ అవసరాలను తమ పాఠ్యాంశాల్లో విజయవంతంగా చేర్చాయి. విద్యార్థులను విద్యాపరంగా నైపుణ్యం కలిగి ఉండటమే కాకుండా పరిశ్రమలకు సిద్ధంగా ఉండేలా తయారుచేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలు సంయుక్తంగా పాఠ్యాంశాలు, ఇంటర్న్‌షిప్‌లు, పరిశోధన ప్రాజెక్టులను రూపొందించేలా ఇండస్ట్రీ-విద్యారంగం కన్సార్టియాను రూపొందించడానికి మేము కృషి చేస్తున్నాం. విద్యారంగం, పరిశ్రమల నడుమ అంతరాన్ని తగ్గించే నమూనాలను అభివృద్ధి చేయడానికి ఎస్‌ఎంయూ, ఎస్‌యూటీడీలతో కలిసి పనిచేయడానికి తాము ఆసక్తిగా ఉన్నామని మంత్రి లోకేష్ చెప్పారు.
ఏఐలో కలిసి పనిచేద్దాం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఇతర ఎమర్జింగ్ టెక్నాలజీల ద్వారా భవిష్యత్ పని విధానం రూపుదిద్దుకుంటోంది. సింగపూర్ ఏఐ పరిశోధన, అప్లికేషన్‌లో ముందంజలో ఉంది. ఎస్‌ఎంయూ ఆధ్వర్యంలోని CARE.AIల్యాబ్ వంటి సంస్థలు ముందంజలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో సాంకేతికత ఆధారిత ఆర్థిక వ్యవస్థ ఏర్పాటుకు మేము ఏఐ, బ్లాక్‌చెయిన్, IoT లలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాం. రాష్ట్రవ్యాప్తంగా ఏఐ పరిశోధన కేంద్రాలు, ఇన్నోవేషన్ హబ్‌లను ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నాం. ఏఐ-కేంద్రీకృత విద్యా కార్యక్రమాలు, పరిశోధన కార్యక్రమాలను అభివృద్ధి చేయడానికి ఎస్‌ఎంయూతో కలిసి పనిచేయడానికి మేము ఆసక్తిగా ఉన్నాం, ఇది మన రెండు ప్రాంతాలకు ప్రయోజనం చేకూరుస్తుందని మంత్రి లోకేష్ వివరించారు.
సింగపూర్‌లోని స్కిల్ ఎస్‌ఎస్‌జీ వెంచర్స్ పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించింది. వియత్నాం, ఇతర ప్రాంతాల్లో వారి పని విధానం శ్రామిక శక్తి పరివర్తనలో నిబద్ధతకు నిదర్శనం. ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ వంటి రంగాలలో యువతలో నైపుణ్యాన్ని పెంచేందుకు నైపుణ్యాభివృద్ధి మిషన్‌ను మేము అమలు చేస్తున్నాం. మా పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను అభివృద్ధి చేయడానికి స్కిల్స్‌ఎస్‌జీ వెంచర్స్ సహకారాన్ని కోరుతున్నామని మంత్రి లోకేష్ తెలిపారు.
గ్లోబల్ ఎడ్యుకేషన్ భాగస్వామ్యాల కోసం..
అంతర్జాతీయీకరణ అనేది నేటి ఆధునిక విద్యలో కీలకమైన అంశం. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ (ఎన్‌యూఎస్) వంటి సంస్థలు విద్యార్థుల అభివృద్ధి, అంతర్జాతీయ సహకారంలో ప్రపంచ ప్రమాణాలను నిర్దేశించాయి. ఆంధ్రప్రదేశ్‌లో, మా విద్యార్థులు అంతర్జాతీయ అనుభవాన్ని పొందేందుకు వీలు కల్పించే గ్లోబల్ ఎడ్యుకేషన్ భాగస్వామ్యాల కోసం మేం ఎదురు చూస్తున్నాం. స్టూడెంట్ ఎక్స్చేంజి కార్యక్రమాలు, ఉమ్మడి పరిశోధన, సహకార ప్రాజెక్టులను సులభతరం చేయడానికి ఎన్‌యూఎస్, ఇతర సింగపూర్ సంస్థలతో భాగస్వామ్యం వహించే మార్గాలను అన్వేషిస్తున్నామని మంత్రి లోకేష్ చెప్పారు.
ఇరు దేశాలకు ప్రయోజనకరం
శ్రామికశక్తి పరివర్తనలో మనం ఎదుర్కొంటున్న సవాళ్లు ఏ ఒక్క ప్రాంతానికి మాత్రమే పరిమితమైనవి కావు, అవి ప్రపంచ స్వభావం కలిగి ఉంటాయి. అందుకు తగ్గట్టుగానే మన పరిష్కారాలు కూడా ఉండాలి. కలిసి పనిచేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్, సింగపూర్ ఇరు ప్రాంతాలకు ప్రయోజనం చేకూర్చే సినర్జీలను తయారుచేయవచ్చు, దీనివల్ల శ్రామికశక్తి పరివర్తనకు ప్రపంచ ఉదాహరణగా కూడా ఏపీ ` సింగపూర్ నిలుస్తాయి. నైపుణ్యాలను సామర్థ్యాలుగా మార్చే విద్య జీవితాంతం ఉపయోగపడుతుంది. శ్రామికశక్తిని భవిష్యత్తుకు సిద్ధం చేయడమేగాకుండా ఉమ్మడి దార్శనికతకు మనం కట్టుబడి ఉందాం. ఈ దిశగా ఫలవంతమైన చర్చలు, సహకారం కోసం తాను ఎదురుచూస్తానని మంత్రి లోకేష్ చెప్పారు. ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లో నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ రిజిస్ట్రార్ ఆర్.రాజారామ్, నన్యాంగ్ టెక్నాలజీ యూనివర్సిటీ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ సియా స్యూ, సింగపూర్ మేనేజ్‌మెంట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ప్రదీప్ రెడ్డి, సింగపూర్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్ చైర్ ప్రొఫెసర్ చైర్ ప్రొఫెసర్ రాజేష్ ఎలర మోహన్, సింగపూర్ యూనివర్సిటీ ఆఫ్ సోషల్ సైన్స్ అసిసోసియేట్ ప్రొఫెసర్ యాప్ మీన్ షెంగ్, స్కిల్ ఎస్‌ఎస్‌జి వెంచర్స్ బిజినెస్ డెవలప్‌మెంట్ డైరెక్టర్స్ చెన్, హాంగ్ సియాంగ్ పాల్గొన్నారు.