- విద్యార్థి దశనుంచే యువత ఆవిష్కరణలపై దృష్టిపెట్టాలి
- ప్రతిఇంటినుంచీ ఓ పారిశ్రామికవేత్త.. చంద్రబాబు ఆశయం
- సవాళ్లను అవకాశాలుగా మలచుకొని ముందుకు సాగుదాం
- ఆవిష్కర్తలకు అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తాం
- రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభోత్సవంలో మంత్రి లోకేష్
మంగళగిరి (చైతన్య రథం): ఆవిష్కరణలకు వనరులు అడ్డంకి కాదు. వినూత్నమైన ఆలోచనలే ముఖ్యం. ప్రతి యువకుడు విద్యార్థి దశనుంచే మెరుపులాంటి ఆలోచనలతో ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ కోరారు. మంగళగిరి సమీపంలో ఎన్‌హెచ్ -16 పక్కన కొత్తగా నిర్మించిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభోత్సవంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… ‘ఇన్నొవేషన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా ఏపీని తీర్చిదిద్దేందుకు దిగ్గజ పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలతో కలసి పనిచేసేందుకు మేంసిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈరోజు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభోత్సవంలో మీ ముందు నిలబడటం నాకు ఎంతో గర్వంగా ఉంది. ఇది కేవలం ఒక భవనం మాత్రమే కాదు. రాష్ట్రంలోని లక్షలాది యువతకు ఆశాకిరణం, విశ్వాస ప్రకటన, ఆంధ్రప్రదేశ్ ఏదైనా సాధించగలదనే వాగ్దానం. ఈ హబ్ భరతమాత ముద్దుబిడ్డ రతన్ టాటాజీ అత్యున్నత నైతిక విలువలు, మహోన్నత వ్యక్తిత్వ స్ఫూర్తితో నెలకొల్పబడిరది. నేడు ఈ హబ్‌ను దివంగత రతన్ టాటాజీ ఆదర్శాలకు అంకితం చేస్తున్నాం. రాజకీయ నాయకుడిగానే మీ అందరికీ తెలిసిన చంద్రబాబు ఒక విజయవంతమైన పారిశ్రామికవేత్త. అయితే హెరిటేజ్ ప్రారంభానికి ముందు ఆయన మూడు కంపెనీలు పెట్టి విఫలమయ్యారు. ఆ తర్వాత చిత్తూరు జిల్లాలో రైతులకు సాయం చేయాలన్న సంకల్పంతో హెరిటేజ్ ప్రారంభించారు. ఆ సంస్థ ఈరోజు 12 రాష్ట్రాలకు విస్తరించి రూ.5వేల కోట్ల వ్యాపారం చేస్తోంది. వైఫల్యాలతో ఆయన తన ప్రయాణాన్ని ఆపలేదు. ఏదైనా సాధించాలంటే పట్టుదల, నిబద్ధత, ఓర్పు ఉండాలి. అప్పుడే మనం అద్భుతమైన ఫలితాలను సాధించగలం’ అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌ను ప్రపంచపటంలో నిలిపిన చంద్రబాబునాయుడు, ఆంధ్రలోనూ ఆ చరిత్రను పునరావృతం ిచేయాలని కోరుకుంటున్నానని లోకేష్ అన్నారు. ప్రతి కుటుంబానికీ ఒక పారిశ్రామికవేత్త ఉండాలన్నది చంద్రబాబు లక్ష్యం. అమరావతిని హైదరాబాద్ స్థాయిలో అభివృద్ధి చేయాలన్న పట్టుదలతో చంద్రబాబు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. చంద్రబాబు సారథ్యంలో రెండోసారి మంత్రిగా పనిచేస్తున్నాను. ఆయనతో కలిసి పనిచేయడం అంత సులువు కాదు. ఉదయం 10గంటలకు టాస్క్ ఇచ్చి, కేవలం 15 నిమిషాల వ్యవధిలో ఆ పని ఎక్కడవరకు పూర్తయిందని అడుగుతారు. ఆంధ్రప్రదేశ్‌లో గత 14 నెలల కూటమి పాలనలో స్నేహపూర్వక పారిశ్రామిక విధానాలను అమలు చేస్తూ పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షించగలిగాం. గత ఐదేళ ్లపాలన తాలూకు అవలక్షణాలను తొలగించి అభివృద్ధి పథంలో ప్రత్యేక గుర్తింపు తేగలిగాం. ఏపీ పెట్టుబడుల టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్‌గా అంగీకరించి, మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
‘రతన్ టాటా కన్నుమూసినపుడు మేం క్యాబినెట్ మీటింగ్‌లో ఉన్నాం. వెంటనే ముంబయి వెళ్లి ఆయనకు నివాళులర్పించి తిరిగి వచ్చేటప్పుడు దేశానికి ఎంతో సేవలందించిన ఆ మహనీయుని పేరిట ఏదోకటి చేయాలని భావించాం. ఆయన ఆశయాలు, ఆలోచనలను ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేశాం. దీనిద్వారా పారిశ్రామికవేత్తలకు పూర్తిస్థాయి మద్దతు ఇచ్చేందుకు పారదర్శకమైన యంత్రాంగాన్ని సిద్ధం చేశాం. ఆవిష్కరణలు అంటే కేవలం ఐటీ ఆధారిత సాంకేతికలు మాత్రమే కాదు. గ్రామాలనుంచి గ్లోబల్ స్థాయివరకు అన్నిరంగాల్లో ఆవిష్కరణలు జరగాలి. యువత వినూత్న ఆలోచనలతో ఆవిష్కరణలు చేస్తే యావత్ ప్రపంచం మీరు తయారుచేసే ఉత్పత్తులను ఆదరిస్తుంది. ఆరోగ్య సంరక్షణ, బయో డిగ్రేడబుల్‌వంటి రంగాల్లో ఔత్సాహికులకు అపారమైన అవకాశాలున్నాయి’ అని లోకేష్ వివరించారు.
‘యువత వినూత్నమైన ఆలోచనలకు పదునుపెడితే వారికి అన్నివిధాలా సహకరించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. విద్యతోపాటు నవీన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకే రతన్ టాటా ఇన్నొవేషన్ హబ్ ఏర్పాటు చేశాం. అమర్ రాజా బ్యాటరీ, గ్రీన్ కో, జిందాల్, అదానీ, టాటా గ్రూప్‌వంటి పరిశ్రమ దిగ్గజాలు మా వద్ద ఉన్నారు. మీ ఆలోచనలను తదుపరి దశకు తీసుకెళ్లడానికి మార్గదర్శకత్వం వహించేందుకు వారు సిద్ధంగా ఉన్నారు. ఔత్సాహికులకు వనరులతోపాటు అన్నివిధాలా అండగా నిలిచేందుకు దిగ్గజ పారిశ్రామికవేత్తలతో ఒక వినూత్నమైన నమూనాను రూపొందించాం. యువత చేపట్టే నవీన ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో చంద్రబాబునాయుడు ఎల్లప్పుడూ ముందుంటారు. గతంలో ప్రతి ఇంటికీ ఒక ఐటీ ఫ్రొఫెషనల్ ఉండాలని ఆయన అన్నారు. ఈరోజు రాష్ట్రంలో ప్రతికుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త తయారుకావాలని కోరుకుంటున్నారు. రాష్ట్రంలో 1.3 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో మీకు అన్నివిధాలా సహాయ, సహకారాలు అందించేందుకు నాలాంటి యువమంత్రులు సిద్ధంగా ఉన్నారని లోకేష్ స్పష్టం చేశారు.
‘ప్రధానమంత్రి నరేంద్రమోడీ జాతీయస్థాయిలో స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా వంటి అద్భుతమైన కార్యక్రమాలను అమలుచేస్తున్నారు. మేకిన్ ఇండియావంటి పథకాల మద్దతు కూడా పొంది మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా ఏపీని తీర్చిదిద్దేందుకు కలసికట్టుగా ముందడుగు వేద్దాం. సవాళ్లను అవకాశాలుగా మలచుకొని ముందుకు సాగుదాం. టాటాగ్రూప్, అమర్ రాజా, గ్రీన్‌కో వంటి సంస్థల తమ ఉత్పత్తులను ప్రపంచానికి ఎగుమతి చేయడంలో ముందున్నారు. దేశీయంగా అనుసరిస్తున్న సులభతర, వేగవంతమైన వ్యాపార విధానాలు ఔత్సాహికులకు సహాయకారిగా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కారు చురుగ్గా పనిచేస్తోంది. ప్రధాని మోదీజీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ భారతదేశ ఆవిష్కరణల కేంద్రంగా తయారవుతుందని నేను హామీ ఇస్తున్నానని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, టీజీ భరత్, టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, భారత్ ఫోర్జ్ చైర్మన్ బాబా కళ్యాణి, అమర్ రాజా గ్రూప్ చైర్మన్ గల్లా జయదేవ్, ఏపీ పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.