- సేవా కార్యక్రమాల్లో ముందుండే ఎన్టీఆర్ ట్రస్ట్‌ను అభినందిస్తున్నాను
- తలసేమియా బాధితులకు అండగా మ్యూజికల్ నిర్వహణ మంచి నిర్ణయం
- మంచి కార్యక్రమాలకు ప్రజల మద్దతు ఎప్పుడూ ఉంటుంది
- ఎన్టీఆర్ లాగే నారా భువనేశ్వరి కూడా పట్టుదల మనిషి
- ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంస
- యుఫోరియా మ్యూజికల్ నైట్‌కు హాజరైన ముఖ్యమంత్రి
విజయవాడ (చైతన్య రథం): ‘సమాజం వల్లే మనం పైకి వచ్చాం. ఆ సమాజానికి సేవ చేయడం మనందరి బాధ్యత. ప్రతి ఒక్కరూ సంపాదనలో కొంతభాగం సేవా కార్యక్రమాలకు వెచ్చించాలి. అవనిగడ్డలో తుపాను వచ్చినా, రాయలసీమలో కష్టమొచ్చినా జోలిపట్టి ఆదుకున్న మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్. సమాజ సేవే ఆయన ఆశయం. అలాంటి ఎన్టీఆర్ ఆశయ సాధనకు కట్టుబడి ఉన్నా’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మహోన్నత ఉద్దేశంతో నిర్వహిస్తోన్న సంగీత విభావరికి హాజరైన ప్రతి ఒక్కరికీ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తరపున ధన్యవాదాలు తెలిపారు. హెరిటేజ్‌నే కాదు, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్‌నూ అంతే సమర్థవతంగా నడిపించే శక్తి నారా భువనేశ్వరికి ఆయన తండ్రి ఎన్టీఆర్ నుంచి వచ్చిందన్నారు.
ఎన్టీఆర్ లాగానే భువనేశ్వరి కూడా పట్టుదల కలిగిన మనిషని ప్రశంసించారు. మంచి కార్యక్రమం జరగాలంటే సమర్థవంతమైన టీం ఉండాలి. ఆ టీమ్‌లో భాగంగానే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సీఈవో రాజేంద్రకుమార్, గోపీ, ఇతర సిబ్బంది సమర్థవంతంగా పనిచేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, నా మిత్రుడు, రాష్ట్రానికి ఏదో చేయాలని తపించే వ్యక్తి పవన్‌కల్యాణ్, నటలోనే కాదు సేవా కార్యక్రమాల్లోనూ తండ్రిని మించిన బిడ్డ, పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ ట్రస్ట్‌కు మొన్నటివరకూ సేవలందించిన నారా లోకేష్, ట్రస్ట్ సభ్యురాలు నారా బ్రాహ్మణి, నందమూరి తమన్, కార్యక్రమానికి వచ్చిన కుటుంబసభ్యులు, ఎన్టీఆర్ ట్రస్ట్ సిబ్బంది, విద్యార్థులు, దాతలందరికీ అభినందనలు. మంచి కార్యక్రమానికి ప్రజలు ఇచ్చిన ఆదరణ మరువలేం. మీరు చూపించే సేవాభావానికి శిరసువంచి సెల్యూట్ చేస్తున్నాను. తలసేమియా వ్యాధితో చిన్నారులు బాధపడుతున్నారు. తలసేమియా బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన ఎన్టీఆర్ ట్రస్ట్‌ను, నారా భువనేశ్వరిని అభినందిస్తున్నాను. మ్యూజికల్ నైట్ నిర్వహణలో నా ప్రమేయం లేదు. నేను ఎవరికీ చెప్పలేదు. కానీ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేశారు అని ముఖ్యమంత్రి అన్నారు.
సమాజం కోసం ఎన్టీఆర్ తపించేవారు
ఎన్టీఆర్ అంటే తెలుగు జాతి పౌరుషం. మంచి పాలన మాత్రమే కాదు సమాజం కోసం ఎన్టీఆర్ నిరంతరం తపించారు. మా అత్తగారు బసవతారకం క్యాన్సర్‌తో చనిపోయారు. ఆనాడు ఆవిడకు చికిత్స అందించేందుకు సరైన ఆస్పత్రులు లేవు. ఇంకెవరూ క్యాన్సర్‌తో చనిపోకూడదని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ప్రారంభించారు. నేను ముఖ్యమంత్రి అయ్యాక ఆస్పత్రిని అభివృద్ధి చేసి నిధులు వచ్చేలా చేశాను. బాలకృష్ట ఆస్పత్రిని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. మా కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నారు. ఫ్యాక్షన్ పాలిటిక్స్‌లో చాలామందిని చంపేశారు. నక్సల్స్ ఉద్యమంలో, యాక్సిడెంట్లలో ఎందరినో కోల్పోయాం. టీడీపీ కుటుంబసభ్యులు అనాథలు కాకూడదని ఎన్టీఆర్ మెమోరియల్ స్కూల్ స్థాపించాం. ఆరోగ్యం, విద్య, విపత్తు సాయం, స్కిల్ డెవలప్‌మెంట్, మహిళా సాధికారతలో ఎన్టీఆర్ ట్రస్ట్ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టింది.
రెడ్డీస్ ల్యాబ్ చైర్మన్ డాక్టర్ రెడ్డి చైర్మన్‌గా నాంది ఫౌండేషన్ ఏర్పాటు చేశాం. ఆయన ఆ ఫౌండేషన్‌ను ఆనంద్ మహేంద్రాకు అప్పగించారు. బసవ తారకం ఆస్పత్రి, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మంచి పేరు సంపాదించాయి. నందమూరి బాలకృష్ణ తల్లిపేరుతో వైద్య సేవలు అందిస్తున్నారు. నారా భువనేశ్వరి తండ్రి పేరుతో ట్రస్ట్ ద్వారా సేవలు అందిస్తున్నారు. ఆ పుణ్య దంపతులకు దక్కిన గౌరవమిది. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి, ఎన్టీఆర్ ట్రస్ట్ శాశ్వతంగా ఉంటాయి. 11.11.11లో స్వర వేద కార్యక్రమం గచ్చిబౌలిలో పెట్టాం. అప్పుడు శివమణి వచ్చాడు. ఇప్పుడు తమన్ యుఫోరియా మ్యూజికల్ నైట్‌కు ముందుకొచ్చారు. ఒక్కరూపాయి కూడా తీసుకోకుండా తలసేమియా బాధితులకు అండగా నిలిచిన తమన్‌ను అభినందిస్తున్నాను. నా మిత్రుడు పవన్‌కల్యాణ్ టికెట్ తీసుకోకుండా రూ.50 లక్షలు విరాళం ఇచ్చారు. మంచి కార్యక్రమానికి ముందుకొచ్చిన ఆయన్ను అభినందిస్తున్నాను. 28 ఏళ్లుగా ఎన్టీఆర్ ట్రస్ట్, 33 ఏళ్లుగా హెరిటేజ్‌ను నా కుటుంబసభ్యులు సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు.
సేవాభావం ప్రతి ఒక్కరిలో రావాలి
సమాజం వల్లే మనం పైకి వచ్చాం. ఆ సమాజానికి సేవ చేయడం మనందరి బాధ్యత. ప్రతి ఒక్కరూ సంపాదనలో కొంతభాగం సేవా కార్యక్రమాలకు వెచ్చించాలి. అవనిగడ్డలో తుపాను వచ్చినా, రాయలసీమలో కష్టమొచ్చినా జోలి పట్టి ఆదుకున్న మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్. ఈ కార్యక్రమానికి రావడం కోసం నేను కూడా టికెట్ తీసుకున్నాను. రూ.లక్ష ఇచ్చాకే నాకు టికెట్ ఇచ్చారు. ప్రజల మద్దతుతో ఎన్టీఆర్ ట్రస్ట్ మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం చంద్రబాబు అన్నారు.