- మీ లక్ష్యాలవెనుక ఎప్పుడూ మేముంటాం
- ఏపీకి ప్రధాని నరేంద్ర మోదీ భరోసా
- అన్ని రంగాల్లో రాష్ట్రానికి మద్దతు
- రాష్ట్ర వికాసానికి ఈ ప్రాజెక్టులే ఊతం
- ప్రధాని మోదీ పర్యటన సూపర్ సక్సెస్
- పూలవాన మధ్య భారీగా సాగిన రోడ్ షో
విశాఖపట్నం (చైతన్య రథం): ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్టుకున్న లక్ష్యాలకు తాము ఎప్పుడూ అండగా ఉంటామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు. ఏపీలో రూ.2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా విశాఖ ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. రాష్ట్ర ప్రజల ఆశలు, ఆశయాల సాధనకు మద్దతుగా నిలుస్తామని మోదీ హామీ ఇచ్చారు. ‘‘ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రేమ, అభిమానానికి కృతజ్ఞతలు. మీ ఆశీర్వాదంతో 60 ఏళ్ల తర్వాత తొలిసారి మేం మూడోసారి అధికారంలోకి వచ్చాం. రాష్ట్రానికి అన్ని రంగాల్లో మద్దతుగా నిలుస్తున్నాం. 2047నాటికి 2.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ రాష్ట్రంతో భుజం భుజం కలిపి నడుస్తాం. ఇవాళ తలపెట్టిన ప్రాజెక్టులు రాష్ట్ర వికాసానికి తోడ్పడతాయి. ఐటీ, టెక్నాలజీకి ఆంధ్రప్రదేశ్ ప్రధాన కేంద్రం కానుంది. ఈ ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధిని సరికొత్త శిఖరాలకు చేరుస్తాయి. 2030లోగా 5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి మా లక్ష్యం. దేశంలో 2 గ్రీన్ హైడ్రోజన్ హబ్‌లు వస్తుంటే.. దానిలో ఒకటి విశాఖకు కేటాయించాం. గ్రీన్ హైడ్రోజన్ హబ్ ద్వారా ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది’’ అని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడిరచారు.
‘‘నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కుకు శంకుస్థాపన చేశాం. కేవలం 3 రాష్ట్రాల్లోనే ఇలాంటి పార్కులు వస్తున్నాయి. చెన్నై- బెంగళూరు పారిశ్రామిక కారిడార్లో క్రిస్ సిటీ భాగం అవుతుంది. ఇప్పటికే శ్రీసిటీ ద్వారా ఏపీలో తయారీరంగం ఊపందుకుంది. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు పునాదిరాయి వేశాం. రాష్ట్ర అభివృద్ధిలో రైల్వే జోన్ కీలకం కానుంది. రైల్వే జోన్ ద్వారా రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ నెరవేరుతుంది. రైల్వే జోన్‌వల్ల వ్యవసాయ, పర్యాటకరంగాలు ఊపందుకుంటాయి.. రాష్ట్రంలో ఇప్పటికే 7 వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. అమృత్ భారత్ కింద ఏపీలోని 70కి పైగా రైల్వేస్టేషన్లు ఆధునికీకరణ చేపట్టాం’’ అని ప్రధాని వివరించారు. బహిరంగ సభకు ముందు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన కల్యాణ్‌తో కలిసి ప్రధాని మోదీ నిర్వహించిన రోడ్ షో అట్టహాసంగా సాగింది. రోడ్లపై బారులు తీరిన ప్రజలు ముగ్గురిపై పూలవాన కురిపిస్తుంటే.. ప్రజలకు అభివాదం చేస్తూ మోదీ ముందుకు కదిలారు. అనంతరం భారీఎత్తున బహిరంగ సభ సాగింది. సభలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు లోకేశ్, అనిత, టీజీ భరత్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు కార్యక్రమంలో పాల్గొన్నారు.