నీటి భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టండి
మాతాశిశు మరణాల రేటును నియంత్రించాలి
భవిష్యత్తులో నైపుణ్యాభివృద్ధిదే కీలక భూమిక
20 లక్షల ఉద్యోగాల హామీ దిశగా పయనిస్తున్నాం
జిల్లా కలెక్టర్లకు చంద్రబాబు దిశానిర్దేశం
అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలో నీటి భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఒక మీటరు భూగర్భ జలం పెరిగితే.. 745 టీఎంసీ నీరు అదనంగా అందుబాటులోకి వచ్చినట్టేనన్నార. అలాగే, మీటరు భూగర్భజలం పెరిగితే కనీసం రూ.5 వేల కోట్లమేర ఆదా అవుతుందని, పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని సీపం చంద్రబాబు కలెక్టర్లకు ఉద్బోధించారు. 5వ జిల్లా కలెక్టర్ల సదస్సు రెండో రోజు స్వర్ణాంధ్ర 2047- పది సూత్రాలపై చర్చ సాగింది. జీరోపావర్టీ, పాపులేషన్ మేనేజ్మెంట్, నైపుణ్యం- ఉపాధి కల్పన, నీటి భద్రత, ఆగ్రిటెక్, లాజిస్టిక్స్, ఇంధన నిర్వహణ, ప్రాడెక్టు పర్ఫెక్షన్, స్వచ్ఛాంధ్ర, డీప్ టెక్ అంశాలపై సదస్సులో లోతుగా చర్చించారు. పీ4 ద్వారా జీరో పావర్టీ లక్ష్యాన్ని సాధించటంతోపాటు ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా ఫ్యామిలీ కార్డు జారీ, ప్రజారోగ్యం తదితర అంశాలపై ప్రజెంటేషన్లు ఇచ్చారు. 38,400 పైచిలుకు మైనర్ ఇరిగేషన్ చెరువులు నింపుతున్నామని ప్రజెంటేషన్‌లో జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ వివరించటంతో.. సీఎం చంద్రబాబు దీనిపై స్పందించారు.
వర్షాకాలం పూర్తయ్యేసరికి భూగర్భ జలాలు 3 మీటర్లుగా ఉండాలని, వర్షాకాల సీజన్ మొదలునాటికి 8 మీటర్లకంటే లోతుకు వెళ్లకూడదని ముఖ్యమంత్రి సూచించారు. చెరువులు, రిజర్వాయర్లలో నీటి నిల్వలపై తనకు వచ్చిన ఫీడ్ బ్యాక్‌ను కలెక్టర్లతో పంచుకుంటూ.. ‘‘ తిరుపతికి వెళ్లే దారిలో చెరువులన్నీ నీటితో నిండుగా కళకళలాడుతున్నాయి. ఆ నీటిని చూసిన ప్రజల్లో నూతనోత్సాహం వస్తోంది. నీటి వనరుల్ని సంరక్షించటంతోపాటు.. చెరువులు నీటితో నిండుగా ఉండేలా చూడాలి‘’ అని సీఎం సూచించారు. పుష్కలంగా నీరున్నందుకు నెల్లూరు జిల్లా కలెక్టర్‌కు కొత్త కష్టాలు వచ్చాయంటూ సీఎం చంద్రబాబు సదస్సులో నవ్వులు పూయించారు. ‘‘రాష్ట్రంలోని అన్ని చెరువులూ నింపాలి. అవసరమైతే మొబైల్ లిఫ్టు పంపులు ద్వారా చెరువులు నింపండి. వచ్చే ఏడాదికి రాష్ట్రంలోని నీటి వనరులు, రిజర్వాయర్లు 95శాతం నిండుగా ఉండాలి. అందుకు తగిన చర్యలపై కలెక్టర్లు శ్రద్ధ పెట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో మాతాశిశు మరణాల రేటు తక్కువగా నమోదయ్యేలా కార్యాచరణ చేపట్టాలని సీఎం సూచించారు. ప్రజారోగ్యం కాపాడేలా పౌల్ట్రీ సహా ఇతర మాంసపు ఉత్పత్తుల్లో గ్రోత్ ప్రమోటర్లను నియంత్రించాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉచిత విద్యుత్ పథకానికి 14,500 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం అవుతోందని తెలిపిన అధికారులు, దీనికి రూ.15 వేల కోట్ల వ్యయం చేస్తున్నట్టు వెల్లడిరచారు. ఆక్రమణలతో పాటు కాలుష్యానికి గురైన డ్రెయిన్లను కలెక్టర్లు క్లియర్ చేయించాలని సీఎం సూచించారు. విద్యుత్ బిల్లులు పెంచటం లేదని స్పష్టం చేస్తూ.. ఆక్వా రైతులు మాత్రం బిల్లులు చెల్లించేలా చూడాలని కలెక్టర్లకు సీఎం చంద్రబాబు సూచించారు.
డ్రెయిన్లపై ఆక్రమణలు లేకుండా, కాలుష్యం చేరకుండా కలెక్టర్లు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. ‘‘భారీ వర్షాల కారణంగా వరద ప్రవాహాలతో ప్రాంతాలు మునిగిపోయే పరిస్థితి తీసుకురావొద్దు. ఈస్ట్ కోస్ట్‌లో ఏపీని లాజిస్టిక్స్ హబ్‌గా తీర్చిదిద్దేలా చర్యలు చేపడతాం. హార్టికల్చర్ హబ్‌గా రాయలసీమ తయారవుతుంది. అంతర్జాతీయ మార్కెట్లకు కూడా ఉద్యాన ఉత్పత్తులు పంపాలి. ప్రొడక్టు పర్ఫెక్షన్ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఉత్పత్తులు తయారు కావాలి. ఇంధన కొనుగోలు వ్యయాన్ని గణనీయంగా తగ్గించేలా చర్యలు చేపడుతున్నాం. స్వచ్ఛాంధ్ర ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పరిశుభ్ర వాతావరణం రావాలి. ప్రతీ ఊరిలోనూ నెట్ జీరో కాన్సెప్టు రావాలి. కేంద్రం ఇచ్చే అవార్డులన్నీ ఏపీకి వచ్చేలా కృషి చేయండి. ఈనెల 28న అన్ని పాఠశాలల్లో ముస్తాబు కార్యక్రమం ప్రారంభింద్దాం. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సులో ర్యాంకింగ్ కూడా ఇస్తాం. స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ అనేది ముఖ్యమైన అంశంగా కలెక్టర్లు గుర్తుంచుకోవాలి’’ అని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
అగ్రిటెక్, లాజిస్టిక్స్, ఇంధన నిర్వహణ, ప్రొడక్ట్ పర్ఫెక్షన్, స్వచ్ఛాంధ్ర, డీప్‌టెక్, పాఠశాల, ఉన్నతవిద్య, మానవ వనరులకు నైపుణ్యం, ఉపాధి కల్పనపై ప్రజెంటేషన్‌ల అనంతరం ఆయా ఆంశాలపై జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికార్లు, మంత్రులకు సీపం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ‘‘భవిష్యత్తులో నైపుణ్యాభివృద్ధిదే కీలక భూమిక. సంప్రదాయ కోర్సులలాగానే స్కిల్ డెవలప్‌మెంట్‌లోనూ డిగ్రీలు కూడా పొందే అవకాశం ఉంటుంది. పరిశ్రమలు, టూరిజం, ఐటీ సహా వేర్వేరు శాఖలు ఎంతమంది యువతకు ఉద్యోగాలు కల్పించాయన్నది కీలకం. యువగళం ద్వారా 20లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చాం. ఇప్పటి వరకూ 4.5 లక్షలమందికి ఉద్యోగాలు కల్పించగలిగాం. డ్యాష్ బోర్డులో పేర్లతో సహా వివరాలు ఉంచండి. 2047 స్వర్ణాంధ్ర లక్ష్యసాధనలో ఈ పది సూత్రాల ఆధారంగా ముందుకు వెళ్తున్నాం. కుటుంబ సాధికారిత కల్పించేలా సమీకృత అభివృద్ధి లక్ష్యంగా పని చేయాలి. జనాభా నిర్వహణ అనేది మరో అజెండాగా కొనసాగాలి. ఫ్యామిలీ కార్డు ద్వారా ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు అందేవారి వివరాలను నమోదు చేసే అవకాశం ఉంటుంది. ఉగాదికి పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకువస్తాం. రాష్ట్రంలో వర్క్ ఫోర్సు పెరగాల్సి ఉంది. మాతాశిశు మరణాల రేటును జీరోకి తీసుకురావాలి. కేర్ అండ్ గ్రో యాప్ ద్వారా 6 ఏళ్ల లోపున్న పిల్లల్లో లోపాలను గుర్తించే ప్రక్రియ జరుగుతోంది. జీరో సూసైడ్స్ లక్ష్యంగా పని చేయాలి. రైతులు, విద్యార్ధులు, కుటుంబాలుకు కౌన్సిలింగ్ ఇవ్వండి. డ్రగ్స్‌లాగే టొబాకో ఫ్రీ అనే అంశంపై చైతన్యం కలిగించాలి’’ అని సీఎం చంద్రబాబు కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.











