- పీ-4 విధానం ద్వారా ఆర్థిక అసమానతలకు శాశ్వత విముక్తి
- హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఏపీ సాధనే నా అభిమతం, ఆకాంక్ష
- వికసిత్ భారత్ విధానాలను పాటిస్తే 2047 నాటికి మనమే టాప్
- ఆంధ్రా మెడికల్ కళాశాల సెంటినరీ భవన ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు
- ఎయిమ్స్‌కు దీటుగా సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా కేజీహెచ్‌ను తీర్చిదిద్దుతామని హామీ
- విజ్ఞానానికి సాంకేతిక తోడైతే వైద్యరంగంలో మరిన్ని విప్లవాలు సృష్టించవచ్చని ఉద్ఘాటన
విశాఖపట్టణం (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన విశాఖపట్టణమే స్వర్ణాంధ్ర సాధనలో గేమ్‌ఛేంజర్‌గా నిలుస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దేందుకు, నాలెడ్జ్ హబ్‌గా తయారు చేసేందుకు చిరునామాగా నిలిచిన విశాఖలో అభివృద్ధి కారకాలు అనేకం ఉన్నాయన్నారు. రెండు మూడేళ్లలో విశాఖపట్టణంలో పెను మార్పులు చూడనున్నారని, భోగాపురం ఎయిర్‌పోర్టు దాదాపు పూర్తయ్యిందని, అతి త్వరలోనే మెట్రో వస్తుందని, నిర్ణీత కాలంలోనే పూర్తవుతుందని పేర్కొన్నారు. విశాఖపట్టణంలోని ఆంధ్రా మెడికల్ కళాశాల సెంటినరీ భవన ప్రారంభోత్సవ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన రాష్ట్ర భవిష్యత్తు కోసం, సాంకేతిక విప్లవం కోసం సుదీర్ఘ ప్రసంగం చేశారు.
కార్యక్రమంలో భాగంగా ముందుగా రూ.50 కోట్లతో నిర్మించిన సెంటినరీ భవనాన్ని, పైలాన్‌ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అంబేద్కర్ ఆడిటోరియంను, డిజిటల్ లైబ్రరీ, విజ్ఞాన పరిశోధనా కేంద్రాలను రిమోట్ సాయంతో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన భవన సముదాయంలోని అన్ని విభాగాలను పరిశీలించారు. అనంతరం అంబేద్కర్ ఆడిటోరియంలో జరిగిన సదస్సులో పలు అంశాలపై ముఖ్యమంత్రి మాట్లాడారు. ‘‘అందరూ జన్మభూమి రుణం తీర్చుకోవాలనే సదుద్దేశంతో ఉండటం వల్ల ఆంధ్రా మెడికల్ కళాశాలలో అద్భుతమైన సెంటినరీ కట్టడం అందుబాటులోకి వచ్చింది. జన్మభూమి ఆదర్శంగా భవన నిర్మాణం జరగటం సంతోషదాయకం. దీనికి కృషి చేసిన ఆంధ్రా మెడికల్ కాలేజ్ వారికి అభినందనలు. ముందుకు వచ్చిన వెయ్యిమంది దాతలకు కృతజ్ఞతలు. భారతదేశంలోనే అత్యంత పురాతన కళాశాల్లో ఆంధ్రా మెడికల్ కాలేజీ ఒకటి కావటం విశేషం. ఉమ్మడి ఆంధ్రప్రదేశలో మొట్టమొదటిది. రేపటి తరానికి స్ఫూర్తిగా 1.4 ఎకరాల భూమిలో రూ.50 కోట్ల విరాళాలతో అద్భుతమైన కట్టడం నిర్మించారు. ఇది రాష్ట్రంలోని ఎన్నో సంఘటిత పనులకు స్ఫూర్తిగా నిలుస్తుంది. దీని ఆధారంగా గుంటూరు, కాకినాడ, కర్నూలు, విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీల్లో కొత్త అలుమ్నీ కట్టడాలు ప్రారంభమవుతున్నాయి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
ఎయిమ్స్‌కు దీటుగా కేజీహెచ్‌ను తీర్చిదిద్దుతాం
‘‘భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎయిమ్స్‌కు దీటుగా కేజీహెచ్‌ను అభివృద్ధి చేస్తాం. ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేశాను. త్వరలోనే ఆ పని మొదలవుతుంది. గతంలో ఏంఎసీకి మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తామని ఇవ్వలేదు. 1923లో ఆవిర్భవించిన ఆంధ్రా మెడికల్ కాలేజీ ఎందరో మహామహులను అందించింది. ఎప్పుడైనా ఎక్కడైనా పేసెంట్ సౌకర్యాల గురించి ఆలోచించి పనులు మొదలు పెడతాం. ఇక్కడ మాత్రం మెడికల్ విద్యార్థుల కోసం ఆలోచించి సెంటినరీ బిల్డింగ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని సాయంతో వారు అన్ని సౌకర్యాలు పొందవచ్చు. డిజిటల్ లైబ్రరీని, రీసెర్చ్ సెంటర్‌ను ఉపయోగించి భవిష్యత్తులో ఉత్తమస్థానాలకు ఎదగొచ్చు. వైద్య విద్యార్థులు బాగుంటే సమాజం బాగుంటుంది. ఏఎంసీ మిగతావాటికి స్ఫూర్తిగా నిలుస్తుంది’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు.
విశాఖకు ఉజ్వల భవిష్యత్తు..
‘‘రాష్ట్రంలోనే కీలకమైన విశాఖపట్టణానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. భవిష్యత్తులో కొత్తకొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి. రానున్న రెండు మూడేళ్లలో ఇక్కడ పెనుమార్పులు చోటుచేసుకుంటాయి. ఆర్థిక రాజధానిగా ఎదుగుతుంది. నాలెడ్జ్ హబ్‌గా మారుతుంది. గూగుల్, టాటా సహకారంతో, ఏఐ తోడుతో సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా మారుతుంది. ప్రశాంతతకు మారుపేరైన ఈ నగరంలో ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు’’ అని చంద్రబాబు అన్నారు.
పీ-4 ద్వారా ఆర్థిక అసమానతలకు శాశ్వత విముక్తి
‘‘పీ-4 విధానం ద్వారా ఆర్థిక అసమానతలు శాశ్వతంగా తొలగిపోతాయని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు. ధనవంతులు పేదవారిని ధనవంతులుగా మార్చే ప్రాజెక్టు ఇది. దీని ద్వారా బంగారు భవిష్యత్తు ప్రతి ఒక్కరికీ వస్తుంది. ప్రపంచంలోనే తెలుగు వారు నెం.1గా ఉంటారు. వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా అందరూ శ్రమిస్తే ఇది సాధ్యమవుతుంది. ప్రపంచంలోనే భారతదేశం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని, అది భవిష్యత్తులో 3వ స్థానానికి చేరుతుందని విశ్వవిస్తున్నాను. 2028నుంచి అత్యధిక గ్రోత్ రేట్ ఉన్న దేశంగా భారత్ నిలుస్తుంది. నేను 1998లో ఐటీ కోసం మాట్లాడాను. దానికి ఊతం పలుకుతూ చదువు, ఉద్యోగరంగాల్లో మహిళలకు 33 శాతం అవకాశం కల్పించాను. దాంతో ఈరోజు మహిళలు పురుషులుకంటే ఎక్కువగా సంపాదిస్తున్నారు. అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఒకప్పుడు ఇండియానుంచి బ్రెయిన్ డ్రెయిన్ అవుతుందని అందరూ అనేవారు.
నేడు ఆ పరిస్థితి బ్రెయిన్ గెయిన్ స్థితికి మారింది. ఏ చదువు చదివేవారికైనా ఐటీ డిగ్రీ ఉంటే వారి భవిష్యత్తులో ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. వైద్యరంగంలో విజ్ఞానానికి, సాంకేతిక తోడైతే విప్లవాలు జరుగుతాయి. దీనికి అనుగుణంగా ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో డేటా లేక్ తీసుకొచ్చాం. రాష్ట్రంలోని ప్రతి ఇంటినీ జియో ట్యాగింగ్ ద్వారా అనుసంధానం చేశాం. భవిష్యత్తులో ఏ పథకం అమలుకైనా, ఏ కార్యక్రమం చేపట్టడానికైనా అది దోహదపడుతుంది. కుప్పంలో ఏఐ సాయంతో సరికొత్త ప్రాజెక్టు చేపడుతున్నాం. అది విజయవంతం అయితే ప్రపంచానికి మన సాంకేతిక విజ్ఞానం మార్గదర్శిగా నిలుస్తుంది. ప్రతి ఒక్కరి అలవాట్లు మారాలి. ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా తయారవ్వాలి. వైద్య ఖర్చులు తగ్గే పరిస్థితి రావాలి. రియల్ టైం డేటా సాయంతో సరికొత్త ఆవిష్కరణలు చేపట్టాలి. టాప్ 10 రోగాలకు వాటితో పరిష్కారం చూపాలి’’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
వైద్యరంగాన్ని పటిష్టం చేస్తున్నాం…
‘‘రాష్ట్రంలో వైద్య రంగాన్ని పటిష్టం చేస్తున్నాం. దీనిలో భాగంగానే అనకాపల్లిలో నైపర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. విశాఖలో రూ.60 కోట్లతో లెవెల్-2 క్యాన్సర్ సెంటరను అందుబాటులోకి తీసుకొస్తాం. కేజీహెచ్‌ను సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా ఎయిమ్స్‌కు దీటుగా తీర్చిదిద్దుతాం. 1991 ఆర్థిక సంస్కరణల తర్వాత దేశంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. అలాగే ఇప్పుడు కూడా సాంకేతిక సాయంతో విప్లవాలు జరుగుతాయి. సుమారు వెయ్యిరకాల సేవలను ప్రజలకు సులువుగా అందించేందుకు వాట్సాప్ గవర్నెన్స్ అందుబాటులోకి తీసుకొచ్చాం. పీ-4 విధానం, స్వర్ణాంధ్ర`2047 వేదికలగా సంపద సృష్టిస్తాం. ప్రజలకు బంగారు భవిష్యత్తును అందిస్తాం. అంబేద్కర్, అబ్ధుల్ కలాం, ఎన్టీఆర్‌లాంటి మహనీయులు పాటించిన విధానాలు ఎందరికో స్ఫూర్తి నింపాయి. వారిని ఆదర్శంగా తీసుకొని స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనకు కృషి చేస్తాం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, వైద్యారోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్, హోం మంత్రి వంగలపూడి అనిత, ఎంపీ శ్రీభరత్, దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, ఇతర ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు, వెలగపూడి రామకృష్ణబాబు, ఎమ్మెల్సీ చిరంజీవిరావు, ఎన్టీఆర్ యూనివర్శిటీ వీసీ పి చంద్రశేఖర్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరక్టర్ డీఎస్వీఎల్ నరసింహం, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్, ఏఎంసీ ఛైర్మన్ టి రవిరాజు, ఏఎంసీ ప్రిన్సిపాల్ కేవీఎస్‌ఎం సంధ్యాదేవి, రవి వెంకటాచలం, బి దేవీమాధవి, కేజీహెచ్ సూపరింటెండెంట్ కె. శివానంద, పెదవీర్రాజు, ఎస్‌కెఈ అప్పారావు, శశిప్రభ, టి. రాధ తదితరులు పాల్గొన్నారు.