- ఆర్జెయుకేటీ ప్రొఫెసర్ గోపాలరాజుపై విద్యార్థి దాడికి ఖండన
అమరావతి (చైతన్యరథం): నూజివీడు ఆర్జెయుకేటీ ప్రొఫెసర్ గోపాలరాజుపై ఎం.టెక్ విద్యార్థి వినయ్ పురుషోత్తం దాడికి పాల్పడటాన్ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తీవ్రంగా ఖండిరచారు. విద్యార్థుల్లో క్రమశిక్షణా రాహిత్యాన్ని, హింసాప్రవృత్తిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఎం.టెక్ (ట్రాన్స్‌పోర్ట్) ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి వినయ్‌కి ఫస్ట్ సెమిస్టర్ లో సరిపడినంత హాజరు లేని కారణంగా.. నిబంధనల మేరకే అతడిని ప్రాక్టికల్ పరీక్షలకు అనుమతించలేదు. దీంతో ఆగ్రహించిన వినయ్.. ప్రొఫెసర్ గోపాలరాజుపై కత్తితో దాడి చేసి పారిపోయాడు. ఈ ఘటనపై మంత్రి లోకేష్ స్పందిస్తూ విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దడంలో గురువులది కీలక స్థానం అన్నారు. విద్యార్థి జీవితాన్ని పాడుచేయాలని ఏ అధ్యాపకుడూ భావించరన్నారు. ప్రస్తుతం నూజివీడు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గోపాలరాజు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ప్రొఫెసర్‌పై దాడికి పాల్పడిన వినయ్ పై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారని మంత్రి లోకేష్ తెలిపారు. కళాశాలల్లో ఇలాంటి హింసాత్మక ధోరణులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు.