- ప్రజలు బుద్ధిచెప్పినా మారని నైజం
- అభివృద్ధిని అడ్డుకునే పన్నాగం
- ఉనికి కోసం జనంలో భయాందోళనలు సృష్టించే వ్యూహం
- సైకో నేత దారిలో వైసీపీ మూకల ఉన్మాదం
- జగన్ పుట్టినరోజు పేరుతో జంతుబలులు, రక్తాభిషేకాలతో రెచ్చిపోయి రంకెలు
- కత్తులు, తల్వార్లతో స్వైర విహారం
- ఉన్మత్తమూకలపై ఎక్కడికక్కడ పోలీసు కేసులు
అమరావతి (చైతన్యరథం): రాజకీయంగా ఉనికి కోసం ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడాన్ని ఒక వ్యూహంగా వైసీపీ మార్చుకుంది. అధికారంలో ఉంటే పీకలు కోయడం, హింసాత్మక దాడులను ప్రోత్సహించిన జగన్.. అధికారం పోయాక కూడా అదే తరహాలో రప్పా రప్పా.. గంగమ్మ జాతరలో పొట్టేలు తల నరికినట్టు నరికితే తప్పేంటి అంటూ తన పార్టీ మూకలను రెచ్చగొడుతున్నారు. స్వయంగా అధినేతే హింసను, దాడులను ప్రోత్సహిస్తుండడంతో, వైసీపీ మూకలు గంజాయి మత్తులో మారణాయుధాలతో రాష్ట్రంలో స్వైర విహారం చేస్తున్నాయి.
వైసీపీ నేతల హింసోన్మాదం సమాజ ప్రశాంతతను, రాష్ట్ర భవిష్యత్తుకు ఆటంకంగా తయారయింది. వైసీపీ అనుసరిస్తున్న తీరు గమనిస్తే, అది కేవలం రాజకీయ విమర్శలకు పరిమితం కాకుండా, ఒక రకమైన సామాజిక ఉన్మాదాన్ని ప్రేరేపించేలా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
సోషల్ మీడియా వేదికల నుండి ప్రత్యక్ష దాడుల వరకు.. రప్పా రప్పా డైలాగుల నుండి కత్తులు,తల్వార్లు చూపిస్తూ చేసే హెచ్చరికల వరకు.. జంతు బలులతో రక్తాభిషేకాల వరకు.. ఇవన్నీ ఒక ప్రకడ్బందీ కుట్రలా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు బీహార్లో ఉండే అరాచక సంస్కృతిని నేడు ఆంధ్ర రాష్ట్రానికి వైసీపీ నేతలు తీసుకువస్తున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్రంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్పడ్డ వికృత చేష్టలు, అరాచకాలే ఇందుకు నిదర్శనం.
జగన్ బర్త్ డేను ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేసేలా వైసీపీ కార్యకర్తలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఒక చోట గర్భిణిని కాలితో తన్ని అరాచకం సృష్టించారు. బహిరంగ ప్రదేశాల్లో వేట కొడవళ్లను ప్రదర్శిస్తూ జంతు బలులు చేసి జగన్ చిత్రపటాలకు రక్తాభిషేకంతో ప్రజలను భయబ్రాంతులకు గురి చేశారు. ‘నువ్వు సృష్టించే విధ్వంసం చూడాలని ఉంది జగనన్నా’ అంటూ కత్తులతో కూడిన ఆయన చిత్రాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి భయానక వాతావరణం సృష్టించారు. వైసీపీ నేతలు సృష్టించిన ఈ అరాచకంపై వివిధ పోలీస్ స్టేషన్లల్లో ప్రజలు ఫిర్యాదులు చేశారు.
పోలీసుల చర్యలు
ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులతో వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. బహిరంగ ప్రదేశాల్లో కత్తుల ప్రదర్శన, జంతు బలి చేసి రక్తాభిషేకాలు చేసినవారిపై కేసులు నమోదు చేశారు. శ్రీసత్యసాయి జిల్లాలో బాణసంచా శబ్దాలతో తనకు ఇబ్బందిగా ఉందని చెప్పిన సంధ్యారాణి అనే గర్భిణిని మానవత్వం లేకుండా కాలితో తన్నిన వైసీపీ కార్యకర్త అజయ్ దేవాను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో పోలీసులు ట్రీట్ మెంట్ ఇచ్చి కదరి పట్టణ వీధుల్లో నడిపించుకుంటూ తీసుకెళ్లారు.
అనంతపురం జిల్లా కల్యాణదుర్గం, ఉరవకొండ, శింగనమల నియోజకవర్గాల్లో వైసీపీ కార్యకర్తలు గొర్రెల తలను నరికి, రక్తంతో జగన్ ఫ్లెక్సీకి అభిషేకం చేశారు. రాప్తాడు నియోజకవర్గంలో జగన్ ఫ్లెక్సీకి గొర్రెను బలిచ్చి వేడుకలు నిర్వహించారు.. గొర్రె రక్తాన్ని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ఫ్లెక్సీపై చల్లి ప్రజలను వైసీపీ కార్యకర్తలు ఉన్మాదంతో పండుగ చేసుకున్నారు.
ఈ ఘటనలో ఓ వైసీపీ సర్పంచ్ సహా 13మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి, ధర్మవరం నియోజకవర్గాల్లోనూ అదే ఉన్మాదంతో పుట్టిన రోజు వేడుకలు నిర్వహించి ప్రజలను భయాందోళనలకు గురిచేశారు.
తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం చోడవరంలోనూ వైసీపీ నేతలు రెచ్చిపోయారు. మేకను నరికి జగన్ ఫొటోకు రక్తాభిషేకం చేశారు.
మేక తలకాయను ఎగరేస్తూ వీధుల్లో వైసీపీ కార్యకర్తలవీరంగమాడారు. రప్పారప్పా అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఫ్లెక్సీలు ప్రదర్శించారు. ఆ తంతు మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది.. దీంతో పోలీసులు శనివారం ఉదయం చోడవరం గ్రామానికి చేరుకుని ఏడుగురు వైసీపీ నేతలను అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుండి నాటుసారా కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితులందరినీ జ్యుడీషియల్ రిమాండ్కు పంపే నేపథ్యంలో వీధుల్లో నడిపించుకుంటూ తీసుకెళ్లారు. ఫ్లెక్సీల ముందు మేకపోతుల్ని బలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ స్పష్టం చేశారు.
మేకపోతుల్ని బలి ఇచ్చే వీడియోలతో భయభ్రాంతులకు గురిచేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి పనులు చేసి యువత భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. అదే జిల్లా గోపాలపురంలోనూ వివాదస్పద వ్యాఖ్యలతో జగన్ చిత్రంతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీని తొలగించిన పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ తరహా వ్యవహారాలపై వైసీపీ శ్రేణులపై కఠిన చర్యలకు ఏపీ పోలీస్ శాఖ సిద్ధమవుతోంది. అయితే ఉన్మాదుల వెన్నులో వణుకు పుట్టించేలా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు.















