` మీడియాపై విమర్శలు సరికాదు
` అద్భుతంగా రాజధాని అమరావతి నిర్మాణం
` ఐదేళ్లు సెక్రటేరియట్‌కు రాకుండా ముఖం చాటేసిన జగన్
` మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విమర్శలు
నెల్లూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గత ఐదేళ్లలో ఎన్నో దురాగతాలు చేశారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణరెడ్డి విమర్శించారు. నెల్లూరులో గురువారం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ పలు కేసుల్లో ఏ 2గా ఉన్న వైసీపీ నాయకుడు, ఎంపీ విజయసాయి రెడ్డి ఏ 1గా మారేందుకు విశాఖపట్నంలో పలు చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేశారన్నారు. ఏ 2గా ఉంటే నామోషీగా భావించి ఏ 1 గా మారేందుకు అనేక తప్పులు చేశారని ఆనం ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందే ఏ 2 గురించి నేను చెప్పాను. ఆయన తండ్రి కూడా ఏ 2నే. ఆయన ఒక హత్య కేసులో ముద్దాయిగా ఉన్నారు. ఇలాంటి దుర్మార్గపు నాయకులు మనకు అవసరమా? ఐదేళ్లలో ఎన్నో దురాగతాలు చేశారు. నెల్లూరు ప్రజలు ఆయనను ఓడిరచి మంచి పని చేశారు. పాత్రికేయ సమావేశంలో తన మీద నిందలు వేసిన వారి గురించి మాట్లాడకుండా మీడియా గురించి బూతులు తిట్టటం ఏమిటని ఆనం ప్రశ్నించారు. ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్న మీడియా ప్రతినిధుల పట్ల ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయని విమర్శించారు. విజయ్ సాయి రెడ్డి విమర్శలను నిరసిస్తూ ఆయన నిర్వహించే సమావేశాలకు మీడియా ప్రతినిధులు వెళ్లకుండా ఉంటే మంచిదని ఆనం పేర్కొన్నారు. మంత్రి నారా లోకేష్, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ల గురించి గతంలో విజయసాయి ఎన్నో నీచమైన ట్వీట్లు వేశారు. అప్పుడు కుటుంబ విలువలు గుర్తుకు రాలేదా? శాంతి అనే ఉద్యోగి దేవదాయ శాఖలో సహాయ కమిషనర్‌గా ఉన్నారు. ఆమె ఇప్పటికే సస్పెన్షన్‌లో ఉన్నారు. 2019లో సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికయిన ఆమెకు విశాఖలో పోస్టింగ్ ఇచ్చారని మంత్రి ఆనం రామానారాయణ రెడ్డి తెలిపారు. ఆమెపై వచ్చిన ఆరోపణలపై కమిషనర్ స్థాయి అధికారులు విచారణ చేసి సస్పెండ్ చేశారు. ఆమెకు రాజకీయ నేతలతో సంబంధాలు ఉన్నాయి. విధి నిర్వహణలో అవినీతికి పాల్పడ్డారు. విజయవాడలో విల్లా కొనుక్కోవాలని కమిషనర్‌కు అనుమతి కోసం దరఖాస్తు చేశారు అందుకు కమిషనర్ అనుమతి ఇవ్వలేదు. అపార్ట్‌మెంట్ కొనుగోలుకు అనుమతించారు. విశాఖపట్నంలో విజయసాయిరెడ్డి చేసిన రెవెన్యూ దందాల్లో.. రెవెన్యూ న్యాయవాది సుభాష్, శాంతి పాత్ర ఉందని మాకు సమాచారం అంది. ప్రభుత్వ భూములతో పాటు దేవాదాయ శాఖ భూములను కూడా అక్రమంగా కొల్లగొట్టారని ఆరోపణలు ఉన్నాయి. వీటిపై కూడా విచారణ చేయిస్తున్నాం. దేవాదాయ శాఖ భూములను నిబంధనలకు విరుద్ధంగా 99 సంవత్సరాల లీజుకు కూడా ఇచ్చారు. నివేదికలు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమతితో తదుపరి చర్యలు తీసుకుంటామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు.
రాబోయే రెండేళ్లలో అద్భుతమైన రాజధాని
రాబోయే రెండు సంవత్సరాల్లో అద్భుతమైన రాజధానిగా అమరావతిని నిర్మిస్తాం. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో రాష్ట్రం అధోగతి పాలైందన్నారు. అన్ని వ్యవస్థల్లో అవినీతి చోటు చేస్తుందన్నారు. వాటిని వెలికితీసి శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నామని ఆనం తెలిపారు. గత ఐదేళ్లు కనీసం ఆంధ్రప్రదేశ్ కు రాజధాని కూడా లేదని, రాజధాని ఎక్కడ అని అడుగుతారన్న భయంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనీసం సెక్రటేరియట్ కి కూడా రాలేదన్నారు. ఆయన మంత్రివర్గ సహచరుల పరిస్థితి కూడా ఇదేవిధంగా తయారయిందన్నారు. అమరావతి నిర్మాణానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ కి 36 కోట్ల రూపాయలతో పనులను చేపడుతున్నామన్నారు. గత ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలను పెంచబోమని ఎన్నికల్లో హామీ ఇచ్చిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 15 సార్లు విద్యుత్ చార్జీలను పెంచిందని పేదలపై మోయలేని భారాలను మోపిందని ధ్వజమెత్తారు. ప్రజలకు తమ ఆస్తులపై హక్కులు కోల్పోయేలా ల్యాండ్ టైటాలింగ్ యాక్ట్ అనే భయంకరమైన చట్టాన్ని తీసుకొని వచ్చిందన్నారు. ఈ చట్టాన్ని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సహజ వనరులను యథేచ్ఛÛగా దోచుకున్నారని, ఇసుక, సిలికా, క్వార్ట్జ్.. ఇలా దేనినీ వదల లేదన్నారు.