గెలుపు మనదేనని టీడీపీ అగ్రనేత తొలిసారి ప్రకటించారు. ఫారిన్ టూర్ ముగించుకుని బుధవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్న తెదేపా అధినేత.. సార్వత్రిక ఎన్నికల జయాపజయాలపై స్పందించడం ఇదే తొలిసారి. పోలింగ్ పర్వం వరకూ పార్టీ శ్రేణుల కృషిని అభినందిస్తూనే.. కౌంటింగ్‌లో అప్రమత్తం కావాలన్నారు. పవన్‌కల్యాణ్ సంపూర్ణ సహకారం, కమలంతో పొత్తు `కూటమికి కలిసొచ్చిన విషయాలన్నారు. హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబును పార్టీ సీనియర్లు మర్యాద పూర్వకంగా కలుసుకుని.. ఆహ్వానం పలికారు.
- వైసీపీకి 35 సీట్లు కూడా రాకపోవచ్చు
- ఫ్రస్ట్రేషన్‌తో హింసకు దిగే అవకాశముంది
- కౌంటింగ్ రోజున అప్రత్తంగా ఉండాలి
- విదేశీ టూర్ ముగించి వచ్చిన చంద్రబాబు
- పార్టీ నేతలకు అగ్రనేత దిశానిర్దేశం
హైదరాబాద్ (చైతన్య రథం): పోలింగ్ అనంతరం విదేశీ పర్యటనేకు వెళ్లిన తెలుగుదేశం జాతీయాధ్యక్షుడు చంద్రబాబు బుధవారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకున్నారు. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన పార్టీ చీఫ్‌ను.. సీనియర్ నేతలు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎన్నికల తదనంతర పరిణామాలపై గంటన్నరపాటు నేతలు చర్చించారు. ఎలక్షనీరింగ్ బాగా చేశారని, నేతలు, కార్యకర్తలు శక్తికిమించి కష్టపడ్డారని చంద్రబాబు ఈ సందర్భంగా అభినందించారు. రాష్ట్రంలో మనమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నామని బాబు ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ అనంతరం గెలుపోటములపై టీడీపీ అగ్రనేత స్పందించడం ఇదే ప్రథమం. ‘పార్టీ శ్రేణుల పనితీరు పూర్తి సంతృప్తినిచ్చింది. పవన్‌కల్యాణ్ ఇచ్చిన మాటకు కట్టుబడి సంపూర్ణ సహకారం అందించారు. భాజపాతో పొత్తు కూడా మన గెలుపునకు బాటవేసింది. ఓటమి భయంతో వైసీపీ ఎన్నికల హింసకు పాల్పడిరది. దాడులకు ప్రణాళికలు రచించి.. తెదేపాపై విషప్రచారానికి దిగింది. మాచర్ల, తాడిపత్రి మాదిరిగానే రాష్ట్రమంతా హింసను ప్రేరేపించాలని చూశారు. వైసీపీ కుట్రలను ఎప్పటికప్పుడు దీటుగా ఎదుర్కొనడంతో వాళ్లకు భంగపాటు తప్పలేదు. కౌంటింగ్ రోజూ అల్లర్లు సృష్టించేందుకు వైసీపీ యత్నిస్తోంది. ఇప్పటి వరకూ పడిన కష్టం ఒకెత్తు. కౌంటింగ్ రోజున పడే కష్టం మరోఎత్తు. జూన్ 4, కౌంటింగ్ రోజున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. వైకాపా ఓటమిని అంగీకరించిందనేందుకు హింసవైపు మళ్లుతుండటమే పెద్ద ఉదాహరణ. పోలింగ్ సరళి చూస్తే వైకాపాకు 35 సీట్లు కూడా వచ్చేటట్టు లేవు’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.