- అలాంటి మృగాలు బయట తిరగడం సమాజానికి హానికరం
- బెయిల్ రాకుండా జైల్లోనే ఉంచాలి
- మదం తలకెక్కి దళిత యువకుడి కిడ్నాప్, బెదిరింపులు
- మాజీ మంత్రి కేఎస్ జవహర్ ధ్వజం
అమరావతి (చైతన్యరథం): అప్పట్లో తాడేపల్లిలోని తన సైకో బాస్‌ని సంతృప్తి పరిచేందుకే వల్లభనేని వంశీ గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేశాడని మాజీ మంత్రి కేఎస్ జవహర్ ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జవహర్ మాట్లాడుతూ…వంశీకి బెయిల్ ఇవ్వకుండా జైల్లోనే ఉంచాలన్నారు. ఆయనను బయటకు వదిలితే సమాజానికి మంచిదికాదు. అల్పబుద్ధివారికి అధికారమిస్తే పరిపాలన అలాగే ఉంటుంది. చెప్పు తినెడి కుక్క చెరుకు తీపి ఎరగనట్లు వల్లభనేని వంశీకి అవినీతి, అక్రమాలే తెలుసుగానీ, నీతి, నియమాలు తెలియవు. చెడ్డవారికి అధికారం ఇస్తే పరిపాలన ఏ విధంగా ఉంటుందో చెప్పేందుకు వల్లభనేని వంశీ అరాచకాలే నిదర్శనం. వంశీ తెలుగుదేశం పార్టీ నుండి వైసీపీలోకి వెళ్లినప్పటికీ, అతడిలోని టీడీపీ భావాజాలాన్ని జగన్ పూర్తిగా చెరిపేశాడు. వంశీ లాంటి దరిద్రులుంటే కులానికి కూడా చెడ్డపేరు వస్తుంది. వంశీ చేయని అరాచకాలు, కబ్జాలు, నేరాలు లేదు. సత్యవర్థన్ కిడ్నాప్ విషయంలోనే కాక వంశీ చేసిన లెక్కలేనన్ని నేరాలకు అతనిపై అనేక కేసులు పెట్టాల్సి వస్తుంది. నేరస్థులు వారు తీసుకున్న గోతిలో వారే పడతారనేందుకు సత్యవర్థన్‌ను కిడ్నాప్ చేయటం, బెదిరింపులకు గురిచేయడమే నిదర్శనం. సత్యవర్థన్ అనే వ్యక్తి గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తుండేవాడు. అతడి కళ్లముందే వంశీ తన అనుచరులతో టీడీపీ కార్యాలయంపై దాడి చేయించాడు. కార్లు, కంప్యూటర్లు ధ్వంసం చేసి విధ్వంసాన్ని సృష్టించాడు. దీనిపై ఫిర్యాదు చేసిన సత్యవర్థన్‌ను కిడ్నాప్ చేయించి, బెదిరించి ఫిర్యాదు వెనక్కు తీసుకుంటున్నట్లుగా అతడితో తప్పుడు వాంగ్యూలం ఇప్పించాడు. అతడి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో వంశీ పాపం పండి అరెస్టయి, జైలు ఊచలు లెక్కపెడుతున్నాడు. సత్యవర్థన్ ఒక దళితుడు. ఏమీ చేయలేనివాడు, అశక్తుడు. అలాంటి వ్యక్తిని కిడ్నాప్ చేసి, బలవంతంగా బెదిరించి ఎస్సీ, ఎస్టీ కోర్టు వద్దకు వచ్చి కేసు విత్ డ్రా చేసుకుంటే ఎవరూ ఏమి చేయలేరనే అహంభావంతోనే వంశీ ఈ నేరానికి పాల్పడ్డాడు. దళితులు అమాయకులైనా, వారి వద్ద ఏ శక్తులు లేకున్నా వాళ్లకు రక్షణ కవచంలా అంబేద్కర్ రాసిన రాజ్యంగం ఉంది. ఆ రాజ్యాంగమే వారికి రక్షాకవచంగా నిలుస్తుందని జవహర్ స్పష్టం చేశారు.
ఇన్ని వందల కోట్లు ఎక్కడివి?
తాడేపల్లిలోని తన సైకో బాస్‌ని సంతృప్తి చేసేందుకే వంశీ ఇంతటి విధ్వంసం సృష్టించాడు. గన్నవరంలో వంశీ ముఖం చూసి ఆయనకు ఎవరూ ఓట్లేయలేదు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాత్రమే వంశీని గెలిపించారు. టీడీపీ తనకు అన్యాయం చేయలేదని వంశీకి కూడా తెలుసు. గన్నవరం పార్టీ ఆఫీసుపై దాడి చేయడానికి కారణం జగన్ మెప్పు కోసమే. తల్లిలాంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేసింది జగన్‌ను సంతోషపెట్టడానికే. గన్నవరం నియోజకవర్గం తన జాగీరుగా భావించి వంశీ రెచ్చిపోయి దోపిడీలకు, దాడులకు పాల్పడ్డాడు. జగన్ రాష్ట్రాన్ని దోచుకుంటే… వంశీ గన్నవరాన్ని దోచుకున్నాడు. చివరికి విమానాశ్రయ భూముల్ని కూడా వదలలేదు. సెటిల్‌మెంట్ లు చేయడంలో వంశీ దిట్ట. గన్నవరం ప్రాంతంలో అపార్టుమెంట్లు కట్టిన వారి మధ్య వివాదాలు సృష్టించి, వాటి ద్వారా లబ్ది పొందే రకం. వంశీ నేడు ఇన్ని వందల కోట్లు ఎలా సంపాదించాడు, నిర్మాతగా సినిమాలు ఎలా తీశాడనే విషయం గన్నవరం చుట్టపక్కల ప్రజలందరికీ తెలుసు. జగన్.. వంశీకి పూర్తి అధికారాలిచ్చి వదిలేయడంతో విచ్చలవిడిగా వ్యవహరించాడు. వంశీని అరెస్టు చేయడం సమర్థనీయం. దళిత యువకుడు సత్యవర్థన్ కిడ్నాప్ వంశీ అరాచకానికి నిదర్శనం. ఒక దళితుడిని కిడ్నాప్ చేసి హత్య చేయడానికి ప్రయత్నించాడు. అతని పై సెక్షన్ 3 కేసు పెట్టాలని మాజీ మంత్రి కే ఎస్ జవహర్ డిమాండ్ చేశారు.