- అభివృద్ధే లక్ష్యంగా సాగునీటి ప్రాజెక్టుల పూర్తి
- రెండేళ్లలో రూపురేఖలు మార్చే ప్రయత్నం
- రూ.7803 కోట్లను ప్రాధాన్యతా క్రమంలో ఖర్చు చేస్తాం
- గత పాలకులు నీటి వ్యవస్థలను దెబ్బ తీశారు
- వాళ్లు చేసిన తప్పులకు మేం ఫైన్లు కట్టాం
- సాగునీటి ప్రాజెక్టులపై సీఎం సుదీర్ఘ ప్రసంగం
అమరావతి (చైతన్య రథం): ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని సాగునీటి ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తిచేసిన ప్రగతిపథాన నిలపడమే కూటమి ప్రభుత్వ సంకల్పంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించారు. రాష్ట్రంలో నీటి సమర్ధ నిర్వహణ అంశంపై శుక్రవారం అసెంబ్లీలో జరిగినచర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. “ఉత్తరాంధ్రలో రూ.185 కోట్లు ఖర్చు చేస్తే వంశధార ఫేజ్-2 స్టేజ్ 2 పనులు పూర్తవు తాయి. తోటపల్లి తారకరామ తీర్ధసాగర్, మహేంద్ర తనయ, హిర మండలం, వంశధార నాగావళి మద్దువలస, నాగావళి-చంపావతి, జంఝావతి, గండిగెడ్డ ప్రాజెక్టులకు రూ.2097కోట్లు వ్యయమవు తుంది. కొత్త ఆయకట్టు 1.25 లక్షల ఎకరాలకు నీరివ్వటంతోపాటు ఇప్పటికే ఉన్న 2 లక్షల ఎకరాలు స్థిరీకరణ జరుగుతుంది. రెండేళ్లలో వీటిని పూర్తి చేసి ఉత్తరాంధ్రకు న్యాయం చేస్తాం. రాయలసీమలో అప్పర్ పెన్నా, పేరూరు రిజర్వాయర్, భైరవానితిప్ప హంద్రీనీవానుంచి మడకశిర బ్రాంచి కెనాల్, అడవిపల్లి రిజర్వాయర్, నీవా బ్రాంచ్ కెనాల్, కల్యాణి డ్యామ్ పాటు గాలేరు నగరి ద్వారా కడప… రాజంపేట వరకూ నీళ్లు తీసుకెళ్తాం. మొత్తం రూ.7803 కోట్లను ప్రాధాన్యతా క్రమంలో ఖర్చు చేసి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. రాయలసీమకు నీళ్లిచ్చి రతనాలసీమగా మారుస్తాం” అని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
గత పాలకులు నీటి వ్యవస్థలను దెబ్బ తీశారు
“ఎత్తిపోతల ప్రాజెక్టులను ధ్వంసం చేసింది గత ప్రభుత్వం. 613 స్కీములు డిఫెక్ట్ అయ్యాయి. 6.5 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే పరిస్థితివున్నా ఇవ్వలేకపోయింది. ఎత్తిపోతల ప్రాజెక్టుల కింద 8.3 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. గతంలోనే 2.97 లక్షల ఎకరాలు స్థిరీకరించాం. రూ.725 కోట్లు వ్యయం చేసి ఎత్తిపోతల ప్రాజెక్టులను ఈ ఏడాదే ఆపరేషన్ లోకి తీసుకువచ్చి నీళ్లిస్తాం. 2019–24 మధ్య సాగునీటిరంగాన్ని ధ్వంసం చేశారు. కాలువలు, వరదగట్లు దెబ్బతిన్నాయి. పించ, అన్నమయ్యప్రాజెక్టులు కొట్టుకుపోయినా గత ప్రభుత్వం బాధితుల్ని పరామర్శించ లేదు. గుండ్లకమ్మ గేటు కొట్టుకుపోయింది. ఆ గేటును కూడా పెట్టలేకపోయారు. ప్రాజెక్టులను నిర్మించటం ఎంత ముఖ్యమో దాన్ని నిర్వహించటం కూడా అంతే ముఖ్యం. డ్యాములు, గేట్ల నిర్వహణకు ఓ మాన్యువల్తయారు చేశాం. దాని ప్రకారమే ప్రాజెక్టుల నిర్వహణ చేపట్టాం. కానీ గత పాలకులు ఐదేళ్లూ దాన్ని పక్కన పెట్టేశారు. ప్రాజెక్టులను ధ్వంసం చేశారు. తుంగభద్ర గేట్లు దెబ్బతిన్నాయి. దానిని పునరుద్దరిస్తున్నాం. శ్రీశైలం డ్యామ్లో స్పిల్ వే ప్రొటెక్షన్ కోసం రూ.204 కోట్లు, ధవళేశ్వరం బ్యారేజీ కోసం రూ.150 కోట్లు ఖర్చు చేస్తున్నాం. గుండ్లకమ్మ గేట్లు పూర్తి చేశాం. సోమశిల ప్రాజెక్టులో మరమ్మతులు కూడా వచ్చే సీజన్ నాటికి పూర్తిచేస్తాం” అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
వాళ్లు చేసిన తప్పులకు మేం ఫైన్లు కట్టాం
“విధ్వంసమైన రాజకీయాలు చేస్తూ ప్రాజెక్టులకు అడ్డం పడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు. బాధ్యతగా ప్రవర్తించాలి. చిత్తూరు జిల్లాలో త్రీ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు నిర్మిస్తామని రూ.2144 కోట్ల అంచనాతో ప్రాజెక్టు టేకప్ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రారంభించారని… ఎన్జీటీ జరిమానా వేసింది. వాళ్లు చేసిన తప్పుకు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి రూ.25 కోట్లు జరిమానా కట్టాల్సి వచ్చింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును గత ప్రభుత్వం చేపట్టింది. ఆ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లేవంటూ ఎన్జీటీ పనులు నిలిపేసింది. నిలిచిపోయిన ప్రాజెక్టు కోసం రూ.923 కోట్ల ఖర్చు పెట్టారు. వెలిగొండలో పనులు అసంపూర్తిగా ఉండగానే ప్రాజెక్టును జాతికి అంకితం చేసినట్టు డ్రామాలు ఆడారు. మేం దాన్ని పూర్తిచేస్తాం. రూ.2059 కోట్లను ఖర్చుచేసి వచ్చే ఏడాది జూలైనాటికి వెలిగొండ నుంచి ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం, ఎర్రకొండపాలెం తదితర ప్రాంతాలకు నీళ్లిస్తాం. వరికెపుడిశెల ప్రాజెక్టుకు త్వరితగతిన పూర్తిచేసేలా కార్యాచరణ రూపొందించాం.