కర్నూలు (చైతన్యరథం): కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాళ్ల రిజర్వ్ ఫారెస్ట్‌లో యురేనియం తవ్వకాలపై కొనసాగుతున్న ఆందోళనలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. కర్నూలులో సోమవారం ఏర్పాటు చేసిన కూటమి నేతల సమావేశంలో మంత్రి టీజీ భరత్‌తో కలిసి పాల్గొన్న నిమ్మల మాట్లాడుతూ త్వరలో జరగనున్న సాగునీటి సంఘాల ఎన్నికల్లో విజయం సాధించేందుకు కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. హంద్రీనీవా సుజల స్రవంతి (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్) కాల్వను విస్తరించనున్నామని, జిల్లాలోని వేదవతి, గుండ్రేవుల, ఆర్డీఎస్ కుడికాల్వ పనులను పూర్తి చేయటంపై దృష్టి సారిస్తామన్నారు. కర్నూలు నుంచి రాజధానికి నేరుగా రైళ్లు లేకపోవటం బాధాకరమన్నారు. జిల్లాలో వలసలు అధికంగా ఉన్నాయని, విద్యార్థుల చదువులు దెబ్బతినకుండా సీజనల్ హాస్టళ్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఉల్లి, టమాట రైతులను ఆదుకుంటామన్నారు. అనంతరం మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ కర్నూలుకు పరిశ్రమలు తీసుకొస్తామన్నారు. తద్వారా ఉపాధి, ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. మరో 20 ఏళ్లు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.
అంతకు ముందు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమీక్షా మండలి సమావేశం జరిగింది. ఈ సమావేవంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి.భరత్, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, పాణ్యం, ఎమ్మిగనూరు, పత్తికొండ, కోడుమూరు, ఆదోని, ఆలూరు ఎమ్మెల్యేలు గౌరు చరిత, జయనాగేశ్వర రెడ్డి, కె.ఈ.శ్యామ్ బాబు, బొగ్గుల దస్తగిరి, పార్థసారథి, విరూపాక్షి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ బిందు మాధవ్, జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య, స్టేట్ సివిల్ సప్లైస్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, టూరిజం డైరెక్టర్ ముంతాజ్, విజయ డైరీ చైర్మన్ ఎస్వీ జగన్ మోహన్ రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
అనంతరం కర్నూలు ఉల్లి మార్కెట్ యార్డ్‌ను పరిశీలిస్తున్న మంత్రులు నిమ్మల రామానాయుడు, టి.జి.భరత్ పరిశీలించారు. ఉల్లి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.