- పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై సీఎం ఆదేశం
- ప్రాజెక్టుల నిర్మాణ నాణ్యతలో రాజీ లేదు
- ప్రాధాన్యతలవారీగా ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం
- నిధులపై ఆర్థిక శాఖ రూట్‌మ్యాప్ సిద్ధం చేసుకోవాలి
- ప్రాజెక్టులు సుదీర్ఘకాలం ఎన్నికల హామీలు కాకూడదు
- ఇరిగేషన్ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం
అమరావతి (చైతన్య రథం): ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణ నాణ్యతపై రాజీ ప్రసక్తే ఉండకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టే క్రమంలో ప్రజాభద్రత ముఖ్యమనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రాధాన్యత క్రమంలో చేపట్టాల్సిన ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంపై శుక్రవారం అసెంబ్లీలోని తన ఛాంబర్లో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పోలవరం, వెలిగొండ, హంద్రీ-నీవా, పోలవరం-నల్లమల సాగర్లింక్, చింతలపూడి లిఫ్ట్, వరికపూడిశెల లిఫ్ట్, ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల ప్రగతిపై మంత్రి నిమ్మల రామానాయుడు, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో సీఎం సమావేశమయ్యారు. వివిధ ప్రాజెక్టులకు చేపట్టాల్సిన పునరావాస పనులపైనా చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… “రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణానికి ఎంతో ప్రాధాన్యమిస్తోంది. రకరకాల కారణాలతో రాష్ట్రంలో కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు సుదీర్ఘ కాలంపాటు ఎన్నికల హామీలుగా మిగిలిపోతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు శంకుస్థాపనలు చేసిన ప్రాజెక్టులు ఇంకా పూర్తి కాకపోవడం సరికాదు. ఇలాంటి వాటికి చెక్‌పెట్టాలి. ప్రాజెక్టులు కట్టాలనే డిమాండ్లు ఎన్నికల హామీలుగా మిగిలిపోకూడదు. ప్రజల అవసరాలను తీర్చేలా ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తి చేయాలి. అందుకే ప్రణాళికాబద్దంగా… ప్రాధాన్యతలను సిద్ధం చేసుకుని ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నాం.
పోలవరంసహా రాయలసీమ, పల్నాడు, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను ఓ క్రమపద్ధతిలో పూర్తిచేసేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్నాం. ఇరిగేషన్రంగానికి గతంలోనూ… ఇప్పుడు పెద్దపీట వేసి అవి పూర్యయ్యేలా చేసింది.. చేస్తోంది కూటమి ప్రభుత్వమే. ఇదే సమయంలో ప్రాజెక్టుల నిర్మాణాల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడే ప్రసక్తే ఉండకూడదు. ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తాను. ఉన్నతాధికారులు మొదలుకుని.. క్షేత్రస్థాయిలో ఉన్న సిబ్బంది ఏ ఒక్కరూ అలక్ష్యం వహించినా చర్యలు తప్పదు. ఉమ్మడి రాష్ట్రంగా నాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు… గత ప్రభుత్వ పాలనలోనూ ప్రాజెక్టుల నిర్మాణాల్లో నాణ్యత విషయంలో కాంప్రమైజ్ అయ్యేవారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఝంఝావతి రబ్బర్ డ్యాం కొట్టుకుపోయింది. గత ప్రభుత్వంలో కీలకమైన పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రం వాల్ దెబ్బతినేలా చేశారు. దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌కు రిపేర్లు చేసినా సరిపోతుందని నిపుణులు నివేదికలు ఇచ్చినా.. నాణ్యత విషయంలో, ప్రజాభద్రత విషయంలో రాజీ పడకూడదనే ఉద్దేశ్యంతోనే కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించాం” అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
ప్రతి అంశమూ కేంద్రం దృష్టికి తీసుకెళ్లండి
“పోలవరం నిర్మాణం విషయంలో కేంద్రంతో నిరంతరం టచ్‌లో ఉండాలి. పోలవరం నిర్మాణానికి సంబంధించిన ప్రతి అప్డేట్ కేంద్రంలోని సంబంధిత వ్యవస్థలకు ఎప్పటికప్పుడు చేర్చాల్సిందే. ప్రమాణాలు, నాణ్యత పాటించే విషయం సహా నివేదికల పరంగా, సాంకేతికాంశాల పరంగా, డాక్యుమెంటేషన్ పరంగా ఎలాంటి లోపాలు ఉండకూడదు… తేడాలు రాకూడదు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కేంద్రం సహా ఎవ్వరూ వేలెత్తి చూపే పరిస్థితి రాకూడదు. పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు అంతర్జాతీయ స్థాయీ నిపుణులు తరుచూ సందర్శనకు వచ్చేలా చూడండి. వీలు కాకుంటే వీడియో కాన్ఫరెన్సుల ద్వారానైనా వారి సలహాలను స్వీకరించండి. చారిత్రత్మాక నిర్మాణాలు చేపడుతున్నప్పుడు.. జీవనాడి లాంటి ప్రాజెక్టులను చేపడుతున్నప్పుడు అదే స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రమాణాలు పాటించే విషయంలో చాలా కచ్చితంగా ఉంటాను.
రాష్ట్ర ప్రభుత్వం టైం బౌండ్ పెట్టుకుని పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపడుతోందనే విషయాన్ని కేంద్రంలోని అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. ఇకపై పోలవరం ప్రాజెక్టుపై ప్రతి నెలా సమీక్షిస్తా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో అధికారులు, కాంట్రాక్టర్లు రిలాక్స్ కావడానికి వీల్లేదు. పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులు మేఘాద్రిగడ్డ వరకు పూర్తి కావాలి. రైట్ మెయిన్ కెనాల్ లో ఇంకా రూ. 200 కోట్ల మేర పనులు పూర్తి చేయాల్సి ఉంది. వీటిని కూడా ఈ సీజన్లో పూర్తి చేయాలి. డయాఫ్రం వాల్ నిర్మాణం ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలి. 41.15 మీటర్ల వరకు నీళ్లను నిలిపేందుకు అవసరమైన నిర్మాణ, పునరావాస పనులు కంప్లీట్ కావాలి. పునరావాసం విషయంలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే… వెంటనే పరిష్కరించుకోవాలి. దీనికి అవసరమైన నిధులు, పరిపాలనా అనుమతుల విషయంలో జాప్యం చేయవద్దు. పునరావాసం విషయంలో నిర్వాసితులతో నిరంతరం సంప్రదింపులు జరిపి సాఫీగా ఆర్ అండ్ ఆర్ పనులు చేపట్టేలా జాగ్రత్తలు తీసుకోవాలి” అని ముఖ్యమంత్రి ఆదేశించారు.
వెలిగొండ… ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల పనులు పరుగులు పెట్టాలి
“వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కావడానికి రూ. 2041 కోట్లు అవసరమవుతాయి. ఓవైపు ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపడుతూనే.. మరోవైపు పునరావాసం పైనా ఫోకస్ పెట్టాలి. దీనికి అవసరమైన మేరకు విడతల వారీగా నిధులను విడుదల అయ్యేలా ఆర్థిక శాఖ అధికారులతో ఇరిగేషన్ అధికారులు సమన్వయం చేసుకోవాలి. హంద్రీ-నీవా ఫేజ్-1 కెనాల్ వైడనింగ్ 92 శాతం పూర్తి అయింది. కుప్పం-పుంగనూరు కాల్వలను 85 శాతం కంప్లీట్ చేసుకున్నాం. మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలి. హంద్రీ-నీవా జలాలు మడకశిర వరకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలి. నీవా బ్రాంచ్ కెనాల్ ద్వారా చిత్తూరు వరకు నీటిని తీసుకెళ్లాల్సి ఉంటుంది. పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై కేంద్రంపై ఒత్తిడి పెంచాలి.
అనుమతులు సాధించాలి. వరికిపూడిశెల ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు వచ్చేస్తే పనులు మొదలు పెట్టండి. అలాగే ప్రాధాన్యత క్రమంలో చింతలపూడి లిఫ్ట్ పనులను పూర్తి చేయాలి. ఉత్తరాంధ్రలో చిన్న చిన్న ప్రాజెక్టులను కూడా పెండింగులో పెట్టేశారు. తక్కువ ఖర్చు పెడితే పూర్తయ్యే ప్రాజెక్టులను ముందుగా టేకప్ చేసే అంశాన్ని పరిశీలించండి. వంశాధార-నాగావళి, తోటపల్లి బ్యారేజ్, తారకరామ, మహేంద్ర తనయ ఆఫ్ షోర్, హీర మండలం, మద్దువలస, ఝంఝావతి, నాగావళి-చంపావతి లింక్ వంటి ప్రాజెక్టుల పనులను ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలి.. ఫలితం చూపెట్టాలి. ఏపీఎసఐడీసీ పరిధిలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల మరమ్మత్తులు, నిర్వహణ కోసం హ్యమ్ పద్దతిలో పనులు చేపట్టాలి. రాష్ట్రంలో ప్రాధాన్యత క్రమంలో చేపట్టే ప్రాజెక్టులకు నిధుల కొరత లేకుండా చూసుకోవాలి. ఈ మేరకు ఆర్థిక శాఖతో సమన్వయం చేసుకోవాలి. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిమిత్తం విడతల వారీగా నిధలు విడుదల చేసే విధంగా ఆర్థిక శాఖ రూట్ మ్యాప్ సిద్ధం చేసుకోవాలి” అని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశించారు.













