- ఇప్పటి వరకు 1.35 లక్షల దరఖాస్తుల స్వీకరణ
ఏలూరు (చైతన్యరథం): రెవెన్యూ సదస్సులకు కాలపరిమితి ఏమీ లేదని, రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం అయ్యే వరకు సదస్సులను నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని రెవెన్యూ శాఖ (భూపరిపాలన, సర్వే సెటిల్‌మెంట్, స్టాంపులు రిజిస్ట్రేషన్లు, విపత్తుల నిర్వహణ) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పీి సిసోడియా తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సుల ద్వారా 1.35 లక్షల దరఖాస్తులు వచ్చాయన్నారు. ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం పెదపాలపర్రు గ్రామంలో శుక్రవారం నిర్వహించిన కైకలూరు నియోజకవర్గ స్థాయి రెవెన్యూ సదస్సుకు సిసోడియా హాజరైన సిసోడియా మాట్లాడుతూ రెవెన్యూ పరమైన అంశాల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయిడు ఈ సదస్సుల నిర్వహణతో వాటికి పూర్తి స్థాయి పరిష్కారం చూపాలని అదేశించారన్నారు. వాస్తవ సరిస్దితులకు భిన్నంగా పలు చోట్ల భూములను 22 `ఎ లో పేర్కొన్న విషయం కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, వాటిని తప్పనిసరిగా సరిచేస్తామని సిసోడియా తెలిపారు. న్యాయ స్థానాల్లో ఉన్న అంశాలను రెవెన్యూ సదస్సులు పరిష్కరించబోవని సిసోడియా స్పష్టం చేసారు. లోపభూయిష్టమైన సర్వే కారణంగా పలు గ్రామాలలో తప్పులు దొర్లాయని, వాటిని సరిచేసేందుకు స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళుతున్నామని తెలిపారు. సదస్సులలో ఇచ్చే అర్జీలకు తప్పనిసరిగా
రసీదు తీసుకోవాలని, ఇందుకోసం ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేదని పేర్కొన్నారు.
కైకలూరు శాసన సభ్యుడు కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా ప్రభుత్వం నిర్వహిస్తున్న సదస్సులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. నియోజకవర్గంలోని వైవాక భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. సంవత్సరాల తరబడి శిస్తు చెల్లిస్తూ, అనుభవదారులుగా ఉన్నప్పటికీ వారు యజమానులు కాలేకపోతున్నారని వివరించారు. కోల్లేటి భూముల విషయంలో స్దానికుల ఆందోళనను గుర్తించాలన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పలువురు తమ సమస్యలను సిసోడియా దృష్టికి తీసుకువచ్చారు. గత ప్రభుత్వ కాలంలో చేపట్టిన రీసర్వే కారణంగా పలు భూములకు సంయిక్త ఎల్‌పీఎంలు జారీ చేసారని, ఫలితంగా భూ యజమానుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొందని ఆవేదన వక్తం చేశారు. గ్రామంలోని పట్టాభూములను గ్రామ కంఠం భూములతో కలిపి వేయటంతో ఇబ్బందులు వస్తున్నాయన్నారు. ఏలూరు జిల్లా సంయిక్త కలెక్టర్ ధాత్రి రెడ్డి, ఏలూరు ఆర్డ్డీఓ అంబరీష్, ముదినేపల్లి తాహసీల్దార్ సుబానీ, ఎంపీడీఓ వై రామకృష్ణ, ఏలూరు డిఐఓఎస్ టివివిఎస్ రమణ, మండల సర్వేసర్ రాజశేఖర్ రెడ్డి, గుడివాడ మార్కెట్ యార్డు మాజీ ఛైర్మన్ చళ్ళగుళ్ల శోభనాధ్రి చౌదరి, పెదపాలపర్రు గ్రామ సర్పంచ్ ఘంటా రాకేష్ కుమార్, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు