అమరావతి (చైతన్యరథం): భారతీయులుగా ఎట్టి పరిస్థితుల్లోనూ దేశమే అన్నిటికన్నా ముఖ్యమనే సిద్ధాంతంతో తామందరం కలిసికట్టుగా ఉంటామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం జరిగిన సర్వమత సమావేశానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. అనంతరం దీనిపై ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. రాజ్ భవన్‌లో గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ ఏర్పాటు చేసిన సర్వమత సమావేశంలో పాల్గొనే గౌరవం నాకు లభించింది. ఈ సమావేశంలో అన్ని మతాల పెద్దలు కలిసి తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లోనూ భారతదేశ ఐక్యతను హృదయపూర్వకంగా ఆవిష్కరించారు. ఎలాంటి కష్ట సమయాలనయినా అందరం ఒకటిగా నిలిచి బలంగా ఎదుర్కొనేందుకు ఈ ఐక్యత దోహదపడుతుంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన భారత సాయుధ దళాలకు అందరం కలిసి నివాళులర్పించాం. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరించుకున్నాం. అలాగే యుద్ధ కష్టాలను ధైర్యంగా ఎదుర్కొంటున్న మన సరిహద్దు రాష్ట్రాల పౌరుల త్యాగాలకు అభినందనలు తెలియజేశాం. ఏదేమైనా భారతీయులుగా ఎల్లప్పుడూ దేశమే ముందు అనేది మన నినాదం అని సీఎం చంద్రబాబు పోస్ట్ చేశారు.