కాకినాడ (చైతన్యరథం): కాకినాడ తీరంలో కాలుష్యకారక దుర్గంధం వెలువరిస్తున్న పరిశ్రమల్లో తనిఖీలు చేపట్టాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. వాకలపూడి ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న యూనివర్సల్ బయోఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుంచి కాలుష్యకారక దుర్గంధం వెలువడడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని రోజులుగా సంస్థ నుంచి ఘాటైన, దుర్గంధపూరిత వాయువులు విడుదల విషయంపై ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ, అటవీ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. పీసీబీ ఛైర్మన్ కృష్ణయ్య, పీసీబీ కాకినాడ రీజనల్ ఆఫీసర్ శంకరరావుతో ఫోన్లో మాట్లాడారు. యూనివర్సల్ బయోఫ్యూయల్స్ సంస్థ కాలుష్య నియంత్రణ నిబంధనలు పాటిస్తుందో.. లేదో పరిశీలించి తక్షణమే నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ప్రజలకు వాయు కాలుష్య సమస్యలు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు పరిశీలన చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ముడి పదార్థాలు వాడుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఫలితంగా ఘాటైన, దుర్గంధపూరిత వాయువులు వెలువడుతున్నాయని తేలింది. దీనిపై మరింత లోతుగా తనిఖీలు చేస్తున్నట్లు అధికారులు తెలియచేశారు.
ఆలివ్ రిడ్లీ తాబేళ్ల మరణంపై విచారణ
కాకినాడ బీచ్ రోడ్, ఏపీఐఐసీ, వాకలపూడి ప్రాంతాల్లో అరుదైన ఆలివ్ రిడ్లీ తాబేళ్ళు అత్యధిక సంఖ్యలో మరణిస్తున్న విషయమై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆలివ్ రిడ్లీ తాబేళ్ళ మరణానికి దారితీస్తున్న పరిస్థితులపై విచారణ జరిపి, కారకులపై చర్యలు చేపట్టాలని, వన్యప్రాణుల పరిరక్షణకు తీసుకోవలసిన చర్యలపై సమగ్ర అధ్యయనం చేయాలని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ చిరంజీవి చౌదరిని పవన్ ఆదేశించారు.