- నెల్లూరు రంగనాయకులపేటలోని శ్రీ వెంకటమ్మ పేరంటాలమ్మ ఆలయ పునర్నిర్మాణ పనులకు శ్రీకారం
- దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి మంత్రి నారాయణ భూమి పూజ
నెల్లూరు (చైతన్యరథం): నెల్లూరు రంగనాయకులపేటలో భక్తుల కొంగుబంగారమై విధాజిల్లుతున్న శ్రీ వెంకటమ్మ పేరంటాలమ్మ ఆలయ రూపురేఖలు మారనున్నాయని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. ఆలయంలో రూ.1.15 కోట్లతో అభివృద్ధి పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, టీడీపీ నేతలు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, ఆనం రంగమయూర్ రెడ్డి లతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి నారాయణ భూమి పూజ చేశారు. శ్రీ వెంకటమ్మ పేరంటాలమ్మ ఆలయంలో మూడంతస్తుల రాజగోపురం, మహామండపం, అర్చక స్వామి నివాసం, కార్యాలయ నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ముందుగా మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణరెడ్డిలకు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఆలయ మర్యాదలతో అర్చకులు, స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పేరంటాళ్ళమ్మను దర్శించి మంత్రులు, ఎంపీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ శ్రీ వెంకటమ్మ పేరంటాళ్ళమ్మ ఆలయం అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. కామన్ గుడ్ ఫండ్స్ ద్వారా ఆలయ అభివృద్ధి కోసం కోసం రూ.1.15 కోట్ల రూపాయలు కేటాయించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. 300 సంవత్సరాల పూర్వం ఉదయగిరి నవాబులు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయని తెలిపారు. వైద్యురాలిగా ప్రసిద్ధిగాంచి దేవతగా కొలవబడుతున్న పేరంటాళ్ళమ్మ తల్లికి మహిమాన్విత శక్తులున్నాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం అని చెప్పారు. ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించి మొక్కుకొంటే ఎలాంటి జబ్బయినా చిటికెలో నయం అయిపోతుందన్నది అందరి నమ్మకం అని మంత్రి తెలిపారు. ప్రాముఖ్యత ఉన్న ఈ ఆలయ అభివృద్ధి పనుల్లో తాము కూడా భాగస్వాములం కావడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. సిటీ నియోజకవర్గంలో నాలుగు దేవాలయాల్లో అభివృద్ధి పనులకు రూ.23.95 కోట్లు కేటాయించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.
అనంతరం దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ శ్రీ వెంకటమ్మ పేరంటాళ్ళమ్మ ఆలయం పురాతనమైనదన్నారు. మహిళలు ఎక్కువ సంఖ్యలో ఈ ఆలయానికి వస్తుంటారని తెలిపారు. ఈ ఆలయం వెనుకనే తాను నివాసం ఉంటానన్నారు. మహళా భక్తుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుండటంతో అభివృద్ధి చేయాలని నిర్ణయించామని తెలిపారు. తొమ్మిది నెలల్లో పనులు పూర్తి చేస్తామని మాటిచ్చారు. తనకు దేవాదాయశాఖ ప్రక్షాళన బాధ్యతను ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పగించారన్నారు. ఈ ప్రాంతంలో రామాలయ పునర్నిర్మాణ పనులకు త్వరలో శ్రీకారం చుడతామని తెలిపారు. రంగనాయకులపేటలో సత్రం స్థలం ఆక్రమణకు గురైందన్నారు. అన్యాక్రాంతమైన ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకొని పార్కు రోడ్డుకు కేటాయిస్తున్నామని స్పష్టం చేశారు. అన్ని ఆలయాలను ప్రక్షాళన చేసి పునర్నిర్మిస్తామన్నారు. నెల్లూరు నగరానికి అందరి సహకారంతో ఆధ్యాత్మిక శోభ తెస్తామని చెప్పారు. దేవాదాయశాఖ అందరి ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తుందన్నారు.
తదనంతరం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధిపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారన్నారు. పురాతన ఆలయాల పునర్నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారని తెలిపారు. 5 వేల పై చిలుకు గుడులకు ధూపదీప నైవేద్యాల కోసం పదివేల రూపాయల చొప్పున సీఎం చంద్రబాబు కేటాయించారన్నారు. సంక్షేమం, అభివృద్ధికి సమపాళ్లలో సీఎం ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. మంత్రి నారాయణ అభివృద్ధికి మరో పేరుగా నిలిచారన్నారు. నెల్లూరుకు ఇద్దరు సమర్థులైన మంత్రులు ఉండటం మన అదృష్టం అని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కొనియాడారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్‌తో పాటు టీడీపీ ముఖ్యనేతలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు












