- కూటమి ప్రభుత్వంలో జోరుగా గట్ల పటిష్టత పనులు
- మంత్రి రామానాయుడు వెల్లడి
- చించినాడలో రూ.8.93 కోట్లతో ఏటిగట్టు పనులకు శంకుస్థాపన
పాలకొల్లు (చైతన్యరథం): వైసీపీ ఐదేళ్ల అరాచక పాలనలో గోదావరి ఏటిగట్ల పటిష్టత గురించి పట్టించుకోలేదని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలం చించినాడ గ్రామంలో 8.93 కోట్లతో గోదావరి ఏటిగట్టు పటిష్టం చేసే పనులకు కూటమి నాయకులతో కలిసి ఆదివారం మంత్రి శంకుస్థాపన చేశారు. ముందుగా మంత్రి రామానాయుడుకు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి రామానాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో గోదావరి ఏటిగట్టు పనులకు రూ.17 కోట్లు నిధులు తీసుకువచ్చానని, ఇప్పటికే సగం పనులు పూర్తయ్యాయని మంత్రి రామానాయుడు తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వంలో మొదటిసారిగా ఎమ్మెల్యే అయినప్పుడు బూరుగుపల్లి వద్ద ఏటిగట్టు ప్రమాదకరంగా ఉంటే రూ.6 కోట్లు తీసుకువచ్చి గ్రోయిన్స్ నిర్మాణం చేపట్టామన్నారు. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో గోదావరికి వరదలు వచ్చినప్పుడు పరివాహక గ్రామాలకు చెందిన యువతతో కలిసి గోదావరి ఏటిగట్టుకు గండి పడకుండా రాత్రింబవళ్లు కాపలా కాసి కాపాడుకున్నామన్నారు. ఆనాడు మంత్రులు వచ్చారు… చూశారు వెళ్లారు.. కానీ ఒక్క రూపాయి నిధులు రాలేదన్నారు. చించినాడ ఏటిగట్టు వద్ద 70 సంవత్సరాల క్రితం దళితులకు ఇచ్చిన భూముల్లో మట్టిని వైసీపీ నాయకులు కొల్లగొడితే 15 రోజులు పాటు దళితులతో కలిసి పోరాటంలో పాల్గొన్నానని, ఒకరోజు రాత్రంతా ఏటిగట్టు వద్ద, మరొక రోజు రాత్రి దళిత వాడలో నిద్రించానని మంత్రి గుర్తు చేశారు.
ఆనాడు దళితులతో పాటు తనపై కూడా ఏడెనిమిది కేసులు పెట్టి ఇతర ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్‌లకు తిప్పి వేధించారన్నారు. నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దళితుల భూములకు ఆనలైన్‌్ చేసి విద్యుత్ సౌకర్యంతో పాటు అన్ని మౌలిక వసతులు కల్పించామన్నారు. కూటమి ప్రభుత్వంలో టీడీపీ, జనసేన బీజేపీ నాయకులు.. అంబేద్కర్ వారసులుగా పని చేస్తారని మంత్రి రామానాయుడు తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం దిశగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని అన్ని వర్గాల ప్రజలు ఆశీర్వదించాలని మంత్రి రామానాయుడు కోరారు. ఈ కార్యక్రమంలో చించినాడ సొసైటీ అధ్యక్షులు రుద్రరాజు సత్యనారాయణ రాజు, సర్పంచ్ రాజామణి, ఎంపీపీ ధనలక్ష్మి, కూటమి నాయకులు మామిడిశెట్టి పెద్దిరాజు, ఉన్నమట్ల కబర్ది, కొడవటి వరబాబు, బోనం నాని, ఆరిమిల్లి చిన్ని, బొప్పన హరికిషోర్, కడలి గోపి, పీతల శ్రీనివాస్, తాళ్ల నాగరాజు, రుద్రరాజు పెద్ద వర్మ, చిన్న వర్మ, ప్రసాద్ వర్మ, బోసు, డానియేలు, మల్లుల చిట్టయ్య, తదితరులు పాల్గొన్నారు.















