- స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకున్నాం, రైల్వే జోన్ తెచ్చుకున్నాం
- అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు నిధులు సాధించాం
- దళితులను చంపి డోర్ డెలివరీ చేసిందెవరో అందరికీ తెలుసు
- శాసనమండలిలో వైసీపీ సభ్యుల వ్యాఖ్యలకు లోకేష్ సమాధానం
అమరావతి (చైతన్యరథం): రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బేషరతుగా కేంద్రానికి మద్దతు ఇస్తున్నారని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై శాసనమండలిలో మంగళవారం ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి చేసిన వ్యాఖ్యలకు మంత్రి నారా లోకేష్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తంచేస్తూ… మేం పదవులు అడగలేదు, రాష్ట్రాన్ని కాపాడాలని మాత్రమే కోరామని స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు పరిరక్షణకు రూ.13వేల కోట్లు తెచ్చాం, స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకున్నాం, రైల్వే జోన్ తీసుకువచ్చాం, పోలవరం, అమరావతికి నిధులు తెచ్చాం, పోలవరాన్ని వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేస్తే నిధులు తెచ్చాం, ఇదీ మా చిత్తశుద్ధి. ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చింది, కేంద్ర ప్రభుత్వ సహకారం ఏపీకి చాలా అవసరం. మేం అన్ కండీషనల్ గా ఎన్‌డీఏలో చేరాం. ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం తీసుకురాలేని నిధులు మేం 9నెలల్లో తెచ్చాం. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషిచేస్తున్నామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 6.5లక్షల కోట ్ల పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు కుదుర్చుకున్నాం, ప్రాజెక్టులు గ్రౌండ్ అవుతున్నాయి. ఇప్పుడు పెట్టుబడులు పెడితే ఉద్యోగాలు వచ్చేసరికి రెండు, మూడు సంవత్సరాలు పడుతుంది. ఉద్యోగావకాశాలు కల్పించామని మాత్రమే మేం చెప్పాం, ఉద్యోగాలిచ్చామని ఇచ్చామని మేం చెప్పలేదని వివరణ ఇచ్చారు. దళితుల గొంతు నొక్కుతున్నారని వైసీపీ సభ్యులు చేసిన ఆరోపణలకు మంత్రి లోకేష్ తీవ్రంగా స్పందిస్తూ… దళితులపై దాడులు చేసింది ఎవరో, చంపి డోర్ డెలివరీలు చేసిన వారు ఎవరో ప్రజలందరికీ తెలుసునని లోకేష్ చురకలు అంటించారు.