అమరావతి (చైతన్యరథం): టీడీపీ కేంద్ర కార్యాలయంలో సిద్ధాంతి మాచిరాజు వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఆదివారం ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉగాది వేడుకల్లో పాల్గొన్న నేతలు మాట్లాడుతూ.. తెలుగు కొత్త సంవత్సరం ప్రారంభం ఉగాది నుండి కష్టాలు, కన్నీళ్లు, సమస్యలు దూరమై రాష్ట్ర ప్రజలు సుఖంగా ఉండాలని.. ఆరోగ్యవంతమైన జీవితాలతో ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ ముందుకు సాగాలని.. అలాగే ప్రజా సంక్షేమానికి ప్రజలకోసం అహర్నిశలు పనిచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్‌లకు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలను అందించి వారు నిత్యం ప్రజా సేవకు పాటుపడేలా ఆ దైవం ఆశీస్సులు అందించాలని ఆకాంక్షించారు. భారతీయ సాంప్రదాయం ప్రకారం చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణాల ద్వారా తెలుస్తోంది. తెలుగు ప్రజలకు ముఖ్య పండుగల్లో ఉగాది మొదటి పండుగ. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి కొత్తగా పనులకు శ్రీకారం చుడతారు. షడ్రుచుల సమ్మేళనం(తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు) అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తెలుగువారికి మహా ప్రసాదం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్టసుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, ఎమ్మెల్సీ ఆలపాటి రాంజేంద్రప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు, టీడీపీ సీనియర్ నాయకులు రమణ, బ్రాహ్మణ సాధికారసమితి కన్వీనర్ బుచ్చి రాంప్రసాద్, మీడియా కోఆర్డినేటర్ ధారపనేని నరేంద్రబాబు, ధామోదర్, తదితరులు పాల్గొన్నారు.