- సంస్కరణలతో కరెంటు ఛార్జీల తగ్గింపు
- విద్యుత్ భారాన్ని ప్రజలపై పడనివ్వం
- మంత్రి అచ్చెన్నాయుడు ఉద్ఘాటన
అమరావతి (చైతన్యరథం): విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై పడకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సుపరిపాలన అందిస్తూ ప్రజల మన్ననలను పొందుతోందన్నారు. ఆర్థిక పరిస్థితి సరిగా లేనప్పటికీ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలతో పాటు, ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తోంది. ఐదేళ్ల జగన్ రెడ్డి పాలనలో ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా రాష్ట్ర విద్యుత్ వ్యవస్థ అనిశ్చితి, ఆర్థిక ఒత్తిడి, గందరగోళం ఎదుర్కొంది. విద్యుత్ అనేది ప్రభుత్వానికి రాజకీయ అస్త్రం కాదు, ప్రజల జీవితాలతో ముడిపడిన కీలక మౌలిక రంగం. అలాంటి రంగాన్ని మూర్ఖపు నిర్ణయాలతో జగన్ అప్పులపాలు చేశారు. 2019లో చంద్రబాబు అధికారం నుంచి దిగిపోయే నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా నిలిపారు. కానీ జగన్ రెడ్డి విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తానని చెప్పి, తన ఐదేళ్ల పాలనలో 9 సార్లు ఛార్జీలు పెంచి దాదాపు రూ.32 వేల కోట్లు ప్రజలపై భారం మోపాడు. విద్యుత్ కోతలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేశాడు. కమీషన్ల కోసం అధిక ధరలతో విద్యుత్ కొనుగోలు చేసి వారి జేబులు నింపుకున్నారు. ఈ తప్పుడు నిర్ణయాలతో రాష్ట్ర విద్యుత్ వ్యవస్థను ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుని రూ.1.29 లక్షల కోట్లు అప్పులు మిగిల్చారని అచ్చెన్నాయుడు విమర్శించారు.
బాధ్యతాయుత పాలన, చారిత్రాత్మక నిర్ణయాలు
2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ హయాంలో నిర్వీర్యమైన విద్యుత్ వ్యవస్థను గాడిన పెట్టేందుకు పలు సంస్కరణలు చేపడుతోంది. ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచేదే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం రూ. వేల కోట్ల ట్రూ అప్ భారాన్ని ప్రభుత్వం భరిస్తోంది. 2019-2024 కాలానికి సంబంధించి రూ.4,498 కోట్లు ట్రూఅప్ ఛార్జీలు వసూలు చేయాలంటూ ఏపీఆర్సీ లేఖ రాసినా, ఈ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని సీఎం చంద్రబాబు చెప్పడం చారిత్రాత్మక నిర్ణయం. 1999లో ఏపీఈఆర్సీ ఏర్పాటైన నాటి నుంచి తొలిసారి ట్రూడౌన్ ఛార్జీలు నమోదు కావడం ఇదే తొలిసారి. ముఖ్యమంత్రి చేపడుతున్న విద్యుత్ సంస్కరణల ఫలితం ఇది. ట్రూడౌన్ అమలు ద్వారా యూనిట్కు 13 పైసలు తగ్గాయని మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు.
రైతులకు, వినియోగదారులకు నేరుగా లాభం
జగన్రెడ్డి పాలనలో అక్వా రైతులకు యూనిట్ రూ.3.50 వసూలు చేస్తే, కూటమి ప్రభుత్వం అధి కారంలోకి వచ్చిన తరువాత యూనిట్ రూ.1.50కు తగ్గించడం కీలక నిర్ణయం. గత ప్రభుత్వంలో రూ.5.19కు విద్యుత్ కొనుగోలు చేస్తే, ఇప్పుడు రూ.4.70కు కొనుగోలు చేసేవిధంగా చర్యలు తీసు కుంటోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా తక్కువ ధరకే విద్యుత్ను కొనుగోలు చేస్తూ, రిన్యూ వబుల్ ఎనర్జీకి ప్రాధాన్యతనిస్తోంది. సోలార్ పవర్ విద్యుత్ ఏర్పాటే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. సోలార్ పవర్ ప్రోత్సాహానికి ఎస్సీ, ఎస్టీలకు ఉచిత సోలార్ రూఫ్ టాప్లు, బీసీ వర్గాలకు కేంద్రం ఇస్తున్న సబ్సిడీపై అదనంగా రూ.20 వేల అధిక సబ్సిడీని కూటమి ప్రభుత్వం అందిస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలియజేశారు.















