- మంత్రి లోకేష్‌కు పలువురి వినతి
- టీడీపీ కేంద్ర కార్యాలయంలో సామాన్యులు, పార్టీ కార్యకర్తలను కలిసిన మంత్రి లోకేష్
- సమస్యలపై వినతిపత్రాల స్వీకరణ
- పరిష్కారానికి కృషిచేస్తామని హామీ
అమరావతి (చైతన్యరథం): టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం సామాన్యులు, పార్టీ కార్యకర్తల నుంచి రాష్ట్ర విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ వినతులు స్వీకరించి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పొలిట్‌బ్యూరో సమావేశం అనంతరం మంత్రి లోకేష్ కేంద్ర కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలను కలుసుకుని వారు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించారు.
అనారోగ్యంతో తన రెండో కుమారుడు, క్యాన్సర్ వ్యాధితో తన భార్య చనిపోయారని, కల్లుగీత కార్మికుడిగా జీవనం సాగిస్తున్న తనకు ఆర్థికసాయం చేసి ఆదుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా బలిజపేట మండలం, బర్లి గ్రామానికి చెందిన చోడి గణపతిరావు విజ్ఞప్తి చేశారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని తనపై భౌతికంగా దాడి చేశారని, విచారించి తగిన న్యాయం చేయడంతో పాటు ఉద్యోగ అవకాశం కల్పించాలని కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం బ్రాహ్మణపల్లికి చెందిన బి.గురవయ్య విజ్ఞప్తి చేశారు.
నెల్లూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో ఉద్యోగ అవకాశం కల్పించాలని మూలాపేట శివగిరి కాలనీకి చెందిన తురక శాంతమ్మ విజ్ఞప్తి చేశారు.
ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన తనకు ఎలాంటి ఆధారం లేదని, ఉద్యోగ అవకాశం కల్పించి ఆదుకోవాలని కొండేటి సుగణశేఖర్ కోరారు.
ఎలాంటి ఆధారం లేని తనకు వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని అనకాపల్లి జిల్లా గవరపాలెంకు చెందిన తోకల చల్లారావు విజ్ఞప్తి చేశారు.
ఆయా సమస్యలను పరిశీలించి త్వరితగతిన పరిష్కరిస్తామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు.