.గత ప్రభుత్వం అమలుచేసిన 18 సంక్షేమ పథకాలు రద్దు
.గిరిజనుల జీవనవిధానాన్ని దెబ్బతీస్తూ ఏజన్సీలో బాక్రయిట్ మైనింగ్
రాష్ట్రంలో జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక గిరిజనుల కోసం గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ అటకెక్కించి ఆదివాసీలకు తీరని ద్రోహం చేసింది. గత ప్రభుత్వం గిరిజనుల సంక్షేమం కోసం అమలుచేసిన 18 సంక్షేమ పథకాలను జగన్ రెడ్డి ప్రభుత్వం నిర్థాక్షిణ్యంగా రద్దుచేసింది. గిరిజనుల ద్రోహం జగన్ రెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డితోనే ప్రారంభమైంది. బయ్యారంలో 1.70లక్షల ఎకరాల అటవీ భూములను రాజశేఖర రెడ్డి తన అల్లుడికి కట్టబెట్టారు. విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ గనుల్ని జగన్ రెడ్డి బినామీ పెన్నా ప్రతాప్ రెడ్డికి కట్టబెట్టారు. తండ్రి.. సెజ్ ల పేరుతో గిరిజనుల అసైన్డ్ భూముల్ని రద్దు చేసి.. ప్రైవేట్ కంపెనీలకు అమ్ముకుంటే.. కొడుకు ఇళ్ల పట్టాల పేరుతో అసైన్డ్ భూముల్ని లాక్కుంటున్నారు. విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలను తెలుగుదేశం ప్రభుత్వం నిలిపివేస్తే.. జగన్ రెడ్డి లాటరైట్ పేరుతో రూ.15,000 కోట్ల విలువైన బాక్సైట్ తన బంధువు వై.వి.సుబ్బారెడ్డికి కట్టబెట్టారు. గిరిజనులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లేదా రూ.6000 అందిస్తామని హామీ ఇచ్చి.. గిరిజన తాండాల్లో ఉండేవారికే తప్ప మిగిలిన వారికి ఇచ్చేది లేదని మాట తప్పారు. గిరిజన తాండాలు, గూడెంలను పంచాయతీలుగా మారుస్తామన్న హామీపై నోరు తెరవడం మానేశారు. ప్రమాద వశాత్తు మరణిస్తే అందే రూ.5లక్షల బీమాను రద్దు చేశారు. ఇప్పటి వరకు ఒక్కరికీ అందించలేదు. తెలుగుదేశం హయాంలో మహిళల స్వయం ఉపాధి కోసం రూ.20వేలను పసుపు కుంకుమ ద్వారా పంపిణీ చేస్తే.. దాన్ని తప్పుబట్టి, అవహేళన చేసిన జగన్మోహన్ రెడ్డి.. 45 ఏళ్లకే పెన్షన్ అని హామీ ఇచ్చి మాట తప్పారు. నామినేటెడ్ పోస్టులు, పనుల్లో గిరిజనులకు అన్యాయం నామినేటెడ్ పనులు, పదవుల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని ఆర్భాటంగా ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి.. ఏడాది కాలంలో ఎన్ని నామినేటెడ్ పదవులు ఎస్టీలకు ఇచ్చారు.? నామినేటెడ్ పనులు ఎన్ని కల్పించారు.? 900కు పైగా సలహాదారులను నియమించుకున్న జగన్మోహన్ రెడ్డి ఎంత మంది ఎస్టీలకు స్థానం కల్పించారు.? ఆయా పదవుల కేటాయింపు సమయంలో ఎస్టీల రిజర్వేషన్ గుర్తుకు రాలేదా.?
జగన్ రెడ్డి రద్దుచేసిన గిరిజన పథకాలు
గిరిజన విద్యార్ధులకు విదేశాల్లో చదువెందుకని అంబేద్కర్ ఓవర్సీస్ విద్య పథకాన్ని రద్దుచేశారు. గిరిజన యువతకు ఉన్నత ఉద్యోగాలకు శిక్షణ ఇచ్చే ఎన్టీఆర్ విద్యోన్నతి పథకాన్ని రద్దు చేశారు. రెండేళ్లలో నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ ద్వారా ఒక్క గిరిజన విద్యార్ధికి కూడా శిక్షణ, ఉద్యోగావకాశాలు కల్పించలేదు. గిరిజన యువతులకు అందించే పెళ్ల కానుకను రూ.లక్షకు పెంచుతున్నట్లు ప్రకటించి.. రెండేళ్లలో ఒక్కరికీ ఇవ్వలేదు. 60% కేంద్రం నిధులతో ముడిపడి ఉన్న గిరిజనాభివృద్ధికి దోహదం చేసే ట్రైకార్ ను నిర్వీర్యం చేశారు. రెండేళ్లలో ఒక్క గిరిజన యువకుడికి కూడా రుణాలు మంజూరు చేయలేదు. స్వయం ఉపాధిని దెబ్బతీశారు.
టిడిపి హయాంలో ఎస్సీల సంక్షేమానికి భారీగా నిధులు
తెలుగుదేశం ప్రభుత్వం గిరిజనుల సంక్షేమం కోసం ఐదేళ్లలో రూ.14,210 కోట్లను కేటాయించి.. ఆస్తులతో కూడిన సంక్షేమాన్ని అమలు చేసి, బడ్జెట్ లో కేటాయించిన నిధుల్ని నూటికి నూరు శాతం ఖర్చు చేసి గిరిజనులకు మునుపెన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలను అందించడం జరిగింది. ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం 2013ను చట్టబద్దతతో కూడిన మార్గదర్శకాలను జారీ చేసి నోడల్ ఏజెన్సీలను ఏర్పాటు చేశాం. ఎస్టీ అభివృద్ధి ప్రణాళిక పర్యవేక్షణ కోసం ఆన్ లైన్ పోర్టల్ ఏర్పాటు చేసి వర్క్ మానిటరింగ్ సిస్టం ద్వారా నూటికి నూరు శాతం పనులను సకాలంలో పూర్తి చేశాం. 205 గ్రావిటీ నీటి పథకాలను పూర్తి చేసి 75వేల మంది గిరిజనులకు లాభం చేకూర్చాం. జగ్జీవన్ జ్యోతి పథకం కింద గిరిజనులకు 100 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించాం. గిరి పుత్రికా కల్యాణ పథకం ద్వారా ప్రతి గిరిజన యువతికి పెళ్లి పీటలపైనే రూ.50వేలు అందించాం. ఆహార శుద్ధి రంగంలో పెట్టుబడులు పెట్టే ఎస్టీలకు ఇచ్చే ప్రోత్సాహకాలలో 35%, మహిళా పారిశ్రామిక వేత్తలకు 45% రాయితీ కల్పించాం. ఇళ్ల నిర్మాణంలో లక్ష వరకు అధనపు సహాయం అందించాం. గిరిజన గ్రామ పంచాయతీల్లో సమాచార సదుపాయాలను మెరుగుపర్చడానికి రూ.90 కోట్లతో గిరిజన ప్రాంతాల్లో గిరినెట్ పథకం ద్వారా 184 మొబైల్ టవర్లను ఏర్పాటు చేశాం. 77 గిరిజన, సబ్ ప్లాన్ మండలాల్లోని 3.45 లక్షల మంది గర్భిణులకు, 7.40 లక్షల మంది బాలింతలకు గిరి గోరుముద్ద, 14.90 లక్షల మంది పిల్లలకు బాలామృతాన్ని 104 ఐసీడీఎస్ పరిధిలో పంపిణీ చేస్తే.. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక పూర్తిగా నిలిపివేశారు. 2014లో రాష్ట్రంలో మాతా శిశు మరణాలు ప్రతి వెయ్యికి 34గా ఉంటే.. 2019 నాటికి ఆ మరణాలను 12కి తగ్గించడం తెలుగుదేశం ప్రభుత్వ ఘనత కాదా.? రూ.500 కోట్లతో 7డి టెక్నాలజీ ద్వారా విశాఖపట్నంలో అల్లూరి సీతారామ రాజు మ్యూజియం పనులు చేపట్టాం. రూ.15 కోట్లతో లంబసింగిలో స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియానిక శ్రీకారం చుట్టాం. చిత్తూరులో నూతన ఐటీడీఏ ఏర్పాటు చేశాం. అరకు ఏజెన్సీ ప్రాంతంలో కాఫీ సాగు విస్తరణను లక్ష ఎకరాల నుండి 2లక్షల ఎకరాలకు పెంచేందుకు రూ.526 కోట్లు ఖర్చు చేశాం. అరకు కాఫీని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ సదుపాయం కల్పించాం. ఎస్టీలకు ఎలాంటి నష్టం లేకుండా వాల్మీకి, బోయ కులస్తులను చట్టబద్దంగా ఎస్టీల్లో చేర్చాం. దీపం పథకం కింద ట్క్రెబల్ ఎల్పిజి ప్యాకేజీ’’తో 73,054 ఎల్పిజి కనెక్షన్లు మంజూరు చేశాం.
గిరిజన విద్యార్ధులకు అండగా టీడీపీ
అంబేద్కర్ విదేశీ విద్య పథకం ద్వారా 947 మంది విద్యార్ధులకు రూ.10 లక్షల చొప్పున రూ.10.37 కోట్లు ఖర్చు చేశాం. ఎన్టీఆర్ విద్యోన్నతి ద్వారా సివిల్ సర్వీస్ పరీక్షలకు సిద్ధమయ్యే గిరిజన విద్యార్ధులకు శిక్షణ ఇచ్చేందుకు 5 జాతీయ స్థాయి శిక్షణా కేంద్రాలకు ఎంపిక చేసి, ఒక్కో విద్యార్ధికి రూ.2లక్షల వరకు ఖర్చు చేశాం. నైపుణ్యాభివృద్ధిలో 20వేల మంది ఎస్టీ విద్యార్ధులకు ప్రయోజనం కల్పించాం. జాతీయ క్రీడల్లో రాణించే విధంగా గిరిజన వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్లలో రూ.126 కోట్లతో క్రీడా సదుపాయాలు ఏర్పాటు చేశాం. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసి 5400 మంది గిరిజన విద్యార్ధులకు ప్రయోజనం కల్పించాం. ఒక్కో పాఠశాలకు రూ.12 కోట్లు కేటాయిస్తే.. నేడు జగన్ రెడ్డి నాడు నేడు పేరుతో రంగులేస్తూ హడావుడి చేస్తున్నారు. స్పెషల్ డీఎస్సీ నిర్వహించి 301 ఉపాధ్యాయ ఖాళీలను ఎస్టీలతో భర్తీ చేశాం. గిరిజన ప్రాంతాల్లోని టీచర్ పోస్టులను 100% గిరిజనులతోనే భర్తీ చేసేలా జీవో ఎం.ఎస్ నెం.3ని తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసింది. తాజాగా ఈ జీవోను సుప్రీం కోర్టు కొట్టేసినా.. జగన్ రెడ్డి ప్రభుత్వం కనీసం అప్పీల్ కు కూడా వెళ్లలేదు. శాసన సభలో తీర్మానం కూడా చేయలేదు.
రాష్ట్రంలో గిరిజనులు చైతన్యవంతులై జగన్ రెడ్డి చేస్తున్న మోసాన్ని గమనించి తమ గళాన్ని విన్పించకపోతే రాబోయేరోజుల్లో మరింత అన్యాయానికి గురయ్యే అవకాశముంది.
-గుమ్మడి ప్రభాకర్
టిడిపి నాలెడ్జి సెంటర్