అమరావతి (చైతన్యరథం): రాష్ట్రంలో దివ్యాంగుల ఫించన్ల వెరిఫికేషన్ ఎంతో పారదర్శకంగా జరుగుతోందని రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ, సెర్ప్, ఎన్‌ఆర్‌ఐ ఎంపవర్మెంట్ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్ర సచివాలయం పబ్లిసిటీ సెల్లో ఆయన గురువారం పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు ఎనిమిది లక్షల మంది దివ్యాంగులకు సామాజిక భద్రతా ఫించన్లు పంపిణీ చేస్తున్నామని, ఇందులో ఇప్పటి వరకూ 1.20 లక్షల ఫించన్ల వెరిఫికేషన్ పూర్తయినట్లు తెలిపారు. గతంలోని నియమ నిబంధనల ప్రకారమే ఈ ఫించన్ల వెరిఫికేషన్ జరుగుతోందన్నారు. అర్హులైన ఏ ఒక్కరికీ ఎటువంటి అన్యాయం జరుగబోదన్నారు. ఒక జోన్ లోని వైద్యులు మరో జోన్ లో ఈ వెరిఫికేషన్‌ను ఎంతో పారదర్శకంగా నిర్వహిస్తున్నారన్నారు. ఎంఎస్‌ఎంఈల సర్వే కూడా ముమ్మరంగా సాగుతోందని, ఇప్పటి వరకూ 50 శాతం మేర సర్వే పూర్తయిందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించిన తది గడువు మార్చి 15 కల్లా ఈ సర్వే పూర్తవుతుందని మంత్రి శీనివాస్ తెలిపారు.