- ఆన్‌లైన్‌లో అందుబాటులో బదిలీల నియంత్రణ ముసాయిదా చట్టం
- ఉపాధ్యాయులు.. సూచనలు, సలహాలు తెలియజేయాలి
- ఈ నెల 7 సాయంత్రం వరకు గడువు
- మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి
అమరావతి (చైతన్యరథం): ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా, వివాదాలకు తావు లేకుండా నిర్వహించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ టీచర్స్ ట్రాన్స్‌ఫర్ రెగ్యులేషన్ యాక్ట్`2025 తీసుకొస్తున్నామన్నారు. ఈ మేరకు ముసాయిదా చట్టం సిద్ధమయిందని, దానిని ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచామని, ఉపాధ్యాయులందరూ దానిని అధ్యయనం చేసి వారి అభిప్రాయాలు, సూచనలు తెలియజేయాలని మంత్రి లోకేష్ కోరారు. పారదర్శకమైన, న్యాయమైన బదిలీ ప్రక్రియకు కట్టుబడి ఉన్న తమ నిబద్ధతకు అనుగుణంగా కొత్త ముసాయిదా చట్టంపై ఉపాధ్యాయుల విలువైన అభిప్రాయాలను ఆహ్వానిస్తున్నామన్నారు. ఉపాధ్యాయుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ, అదే సమయంలో మన విద్యారంగాన్ని మరింత బలోపేతం చేసేలా 2024 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ అమలుకు తాము కట్టుబడి ఉన్నామనేందుకు ఇది నిదర్శనమన్నారు. ఉపాధ్యాయులందరూ cse.ap.gov.in/documents/DRAF లింక్‌లోకి వెళ్లి.. చట్టం ముసాయిదా పత్రాన్ని అధ్యయనం చేసి వారి సూచనలు, అభిప్రాయాలను ఈ నెల 7వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు draft.aptta2025@gmail.com కి పంపించాలని మంత్రి లోకేష్ కోరారు. ఉపాధ్యాయుల సూచనలు తమకు ముఖ్యమన్నారు. అందరం కలిసి ఉపాధ్యాయులు, విద్యార్థులకు ప్రయోజనకరమైన విద్యా విధానాన్ని రూపొందిద్దామని ఎక్స్ వేదికగా శనివారం మంత్రి లోకేష్ పిలుపు ఇచ్చారు.