- మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ
అమరావతి (చైతన్యరథం): పల్నాడు జిల్లా, ముప్పాళ్లలో జరిగిన ట్రాక్టర్ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో నలుగురు మహిళలు మృత్యువాత పడటంపై తీవ్రవిచారం వ్యక్తం చేశారు. పొలం పనులు ముగించుకుని ఇంటికి చేరుకునే సమయంలో ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని సీఎం భరోసా ఇచ్చారు.
ముప్పాళ్ల మండలం బొల్లవరం వద్ద ట్రాక్టర్ బోల్తాపడిన ప్రమాదంలో నలుగురు మహిళా కూలీలు మృతిచెందారు. చాగంటివారిపాలెంకు చెందిన 25 మంది మహిళా కూలీలు వ్యవసాయ పనుల నిమిత్తం బొల్లవరం గ్రామానికి ఆదివారం ఉదయం వెళ్లారు. ఎప్పటిలాగానే రోజంతా పని చేసిన కూలీలు సాయంత్రం సమయానికి ఇంటికి బయలుదేరారు. బొల్లవరంలో ట్రాక్టర్ ఎక్కి కొద్ది దూరం ప్రయాణించే సరికే మాదల మేజర్ కాలువ కట్టపై ప్రమాదవశాత్తూ వాహనం బోల్తాపడిరది. ఈ ప్రమాదంలో మధిర గంగమ్మ (55), మధిర సామ్రాజ్యం (50), చక్కెర మాధవి (30), తేనెపల్లి పద్మావతి (45) అనే నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన సత్తెనపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, కుటుంబసభ్యుల మరణవార్త విని బాధిత కుటుంబసభ్యులు ఆస్పత్రికి వద్దకు చేరుకుని బోరున విలపించారు. గ్రామానికి చెందిన నలుగురు ఒకేసారి మృతిచెందడంతో చాగంటివారిపాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి.