- సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గాలి
- ‘మార్గదర్శి-బంగారు కుటుంబం’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు
నూజివీడు/ ఆగిరిపల్లి (చైతన్య రథం): సమాజంలో ఉన్నతస్థాయిలో ఉన్న 10శాతం మంది అట్టడుగునున్న 20 శాతం పేదలను పైకి తీసుకొచ్చేందుకు ముందుకు రావాలని సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి పిలుపునిచ్చారు. పేద కుటుంబాల్లో వెలుగు తెచ్చేవరకు అండగా ఉంటానని, నేడు బంగారు కుటుంబానికి ఎంపికైన వారి పిల్లలకు సహకారం అందిస్తే.. రేపు మార్గదర్శుకులుగా తయారుతారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. సమాజంలో ప్రజలమధ్య ఆర్థిక అసమానతలు తగ్గాలని అభిప్రాయపడ్డారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లిలో జ్యోతిరావుపూలే జయంతి వేడుకల్లో పాల్గోన్న సీఎం చంద్రబాబు, అనంతరం బంగారు కటుంబం- మార్గదర్శి కార్యక్రమంలో మాట్లాడారు. పేదలను ఆదుకునేందుకు ముందుకొచ్చిన మార్గదర్శులను సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ…. ఆగిరిపల్లిలోని 206 బంగారు కుటుంబాలకు వారి మార్గదర్శులు అండగా ఉంటారన్నారు.
‘మొదటి దశలో రాష్ట్రంలోని 20 లక్షల కుటుంబాలను పేదరికం నుంచి తెచ్చేందుకు కృషి చేస్తున్నాం. పేదలను ఆదుకుని శాశ్వతంగా పైకి తీసుకొస్తే పూలేను గుర్తు పెట్టుకున్నట్లుగానే మార్గదర్శుకులను గుర్తుంచుకుంటారు. ఒకస్థాయి వరకు సొంతానికి, వ్యక్తిగతంగా కష్టపడతాం. తర్వాత మంచి పేరు కోసం కష్టపడతాం. అలాంటి వేదిక కోసమే ఈ మార్గదర్శి- బంగారు కుటుంబం కార్యక్రమం. మార్గదర్శకులు ఓట్లు కోసం రావడం లేదు. పేరు కోసం ముందుకు వస్తున్నారు. అంబేద్కర్, పూలే, జగ్జీవన్‌లాంటి మహానుభావుల జయంతి వేడుకులు నిర్వహించుకుంటూనే పీ`4 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం’ అని సీఎం చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు.
బంగారు కుటుంబాలకు ఎంపికైన వారిలో ఆగిరిపల్లి నివాసి ప్టారీ రేష్మ మాట్లాడుతూ.. తన భర్త డ్రైవర్‌గా పని చేస్తున్నారని, సొంతిల్లు లేకపోవడంతో అద్దె ఇంట్లో ఉంటున్నామన్నారు. తన ముగ్గరు పిల్లన్ని చదివించుకోవడానికి సాయం కోరుతున్నామని అన్నారు. ఆగిరిపల్లికే చెందిన బోనం లక్ష్మీదుర్గా మాట్లాడుతూ.. ‘నా భర్త బోన్ క్యాన్సర్‌తో మూడేళ్ల క్రితం చనిపోయారు. నాకు పింఛన్ కూడా రావడం లేదు. నాకు పాప, బాబు ఉన్నారు. సొంతిల్లు లేక తల్లిదండ్రులతో ఉంటున్నాను. పూట గడవడం కోసం కూలీ పనులకు వెళ్తున్నాను. జీవనోపాధి కల్పించాలని కోరుతున్నా’ అన్నారు. వెంటనే సీఎం చంద్రబాబు స్పందిస్తూ.. ‘వచ్చే నెల నుంచే మీకు పింఛను మంజూరు చేయడంతోపాటు 12 నెలల పింఛను కూడా ఇస్తాం. సొంతిల్లు కూడా కట్టించి ఉపాధి కల్పనకు చర్యలు తీసుకుంటా’మని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో మార్గదర్శి, నూజివీడు సీడ్స్ అధినేత ప్రభాకర్ మాట్లాడుతూ.. ‘మార్గదర్శి-బంగారు కుటుంబం చాలా మంచి కార్యక్రమం. దేశంలో ఎక్కడాలేని మంచి కార్యక్రమాలకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుడుతున్నారు. రాబోయే నాలుగేళ్లలో రూ.20 నుంచి రూ.25 కోట్ల వరకూ ఆగిరిపల్లిలోని పేదలకు ఖర్చు చేస్తాం. ఆగిరిపల్లితోపాటు తుక్కులూరు గ్రామంలోనూ కార్యక్రమాన్ని చేపడితే ముందుకొస్తా’మని ప్రకటించారు. మరో మార్గదర్శి, కుశలవ గ్రూప్‌నుంచి సిద్ధార్థ మాట్లాడుతూ.. చదువుకోవడానికి ఇబ్బంది పడేవారికి సాయం అందిస్తాం. ఇల్లులేని వారికి ప్రభుత్వం స్థలం కేటాయిస్తే ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. హ్యాపీ వ్యాపీ స్కూల్ అధినేత గౌతమ్ మాట్లాడుతూ.. ‘హ్యాపీవ్యాలీ స్కూల్‌ను మీరే ప్రారంభించారు. వంద కోట్లు అప్పు చేసి స్కూలు కట్టించాను.
ఆ అప్పంతా తీర్చాను. 300మంది విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తున్నాం. వారు మంచి జీవితాన్ని ప్రారంభించేదాకా బాధ్యత తీసుకుంటాం. మీ పిలుపుతో మరిన్ని కార్యక్రమాలు చేపడతా’మని ప్రకటించారు. నితిన్ సాయి కన్‌స్ట్రక్షన్ అధినేత నితిన్ కృష్ణ మాట్లాడుతూ.. ‘ఈ కార్యక్రమం ద్వారా మట్టిలో ఆణిముత్యాలను వెలికి తీసి ఉద్యోగాలిస్తా’మని హామీ ఇచ్చారు. మోడల్ డైరీ అధినేత పిన్నమనేని ధనప్రకాశ్ మాట్లాడుతూ.. హీల్ అనే పాఠశాల ద్వారా వెయ్యిమంది విద్యార్థులకు చదువు అందిస్తున్నామని, అనాథ పిల్లలను తీసుకుని చదివిస్తా’మని ప్రకటించారు. ఎన్‌ఆర్‌ఐ ఇంజనీరింగ్ కాలేజీ ఛైర్మన్ రావి వెంకటరావు మాట్లాడుతూ ‘నాకు మార్గదర్శి సీఎం చంద్రబాబు. చంద్రబాబు చెప్పి చేసేవన్నీ చూసి నేర్చుకున్నాం. 60మందితో ప్రారంభమైన మా కాలేజీలో నేడు 6వేల మందిదాకా ఉన్నారు. ఎక్కువమంది కటుంబాలను దత్తత తీసుకునేందుకు ప్రయత్నిస్తా’మని హామీ ఇచ్చారు.