అమరావతి (చైతన్యరథం): జూన్ 12ను రాష్ట్ర పునర్నిర్మాణ సంకల్ప దినంగా వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ అభివర్ణించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా మంత్రి ఈ వ్యాఖ్య చేశారు. గతేడాది ఇదే రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వ బాధ్యతల్ని చేపట్టిన కూటమి ప్రభుత్వం ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ నిర్వాకాలు, అనాలోచిత విధానాలతో అస్తవ్యస్తమైన నవ్యాంధ్రను తిరిగి పట్టాలెక్కించి ప్రజాహితం కోసం సమగ్ర సంక్షేమాభివృద్ధి దిశగా అహర్నిశలూ చిత్తశుద్ధితో కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర పునర్వికాసానికి పునరంకితమవుదామని మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపు ఇచ్చారు.
వైసిపి ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, అప్రజాస్వామిక పాలనతో విసిగి వేసారిన రాష్ట్ర ప్రజలు గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి అఖండ విజయాన్నిచ్చి తమపై మోపిన గురుతర బాధ్యతల్ని నిత్యం స్మరించుకుంటూ వారి ఆశయాలు, ఆకాంక్షల్ని సాకారం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సర్వశక్తులూ ఒడ్డుతోందని మంత్రి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ అండదండలు, ఆశీస్సులతో ప్రజలు కూటమి ప్రభుత్వంపై ఉంచిన నమ్మకాన్ని పూర్తిగా నిలబెట్టుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ దిశగా ఇప్పటికే పలు చర్యల్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలకు పూర్తి సహకారాన్ని అందించాలని రాష్ట్ర ప్రజానీకానికి మంత్రి సత్యకుమార్ యాదవ్ విజ్ఞప్తి చేశారు.