- జగన్, వైసీపీ ఎమ్మెల్యేల తీరుపై మంత్రి అచ్చెన్నాయుడు విమర్శ
- 11 స్థానాలతో ప్రతిపక్ష హోదా అడగటం హాస్యాస్పదం
- అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టే యత్నం
- ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలు
అమరావతి (చైతన్యరథం): అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకే జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారని వ్యవసాయమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. అసెంబ్లీ సమావేశాలకు ఇలా వచ్చి అలా వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యేలు, జగన్ తీరుపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. గవర్నర్ ప్రసంగం తరువాత సోమవారం సభ వాయిదా పడిన అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ హాజరు కోసమే వారంతా సభకు వచ్చారని తేటతెల్లమైందని వ్యాఖ్యానించారు. సభ్యత్వాలు పోతాయనే భయంతోనే వచ్చారని భావిస్తున్నామన్నారు. వైసీపీ ఎమ్మెల్యేల తీరు అటెండెన్స్ వేయించుకొని వెళ్లినట్లుంది. అవినీతి, అబద్ధాల పునాదులపై ఆ పార్టీ పుట్టింది. గతంలో చెప్పిన అవాస్తవాలనే మళ్లీ చెబుతున్నారు. సభకు వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడతారని భావించాం. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తామనడం ఎక్కడా చూడలేదు. అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారు. 11 స్థానాల్లో గెలిచి ప్రతిపక్ష హోదా అడగడం హాస్యాస్పదం. ఆ పార్టీలో సీనియర్ నాయకులు కూడా జగన్‌కు వత్తాసు పలకడం దురదృష్టకరమని అచ్చెన్నాయుడు తప్పుబట్టారు. ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప శాసనసభకు రామని చెప్పిన వైసీపీ ఆసలు రాజకీయ పార్టీయేనా అని ప్రశ్నించారు.
ప్రతిపక్ష హోదా స్పీకర్, సీఎం చంద్రబాబు ఇచ్చేది కాదని.. ప్రజలు ఇవ్వాలన్నారు. జగన్ వింత పోకడలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోందన్నారు. బొత్స సత్యనారాయణకు మండలిలో బలం వుందని అందుకే ప్రతిపక్ష హోదా ఇచ్చామని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. ప్రజలు వైసీపీని అసహ్యించుకుంటున్నారని, మరో 4 రోజులు పోతే సీఎం పదవి ఇస్తే తప్ప సభకు రానంటారేమోనని అచ్చెన్నాయడు ఎద్దేవా చేశారు. ప్రతిపక్షంగా సభకు వచ్చి అడిగితే స్పష్టంగా సమాధానం చెపుతామన్నారు. ఏ పార్టీ అయినా రాజ్యాంగానికి లోబడి ప్రవర్తించాలన్నారు. అవినీతి అక్రమాలతో పుట్టిన ఆ పార్టీకి అసత్యాలు చెప్పటం ఆలవాటు అయిపోయిందని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.