- బీసీ నేతను అక్కడ చూస్తుంటే గర్వంగా ఉంది
- యోధుడిగా ఎదిగిన మీ సేవలు సభకు అవసరం
- గత ప్రభుత్వంలో సభా మర్యాదలే కరవయ్యాయి
- అసెంబ్లీని వైసీపీ కౌరవ సభ స్థాయికి దిగజార్చింది
- మితిమీరిన అహంకారంతో విపక్షాన్ని హేళన చేశారు
- ఇప్పుడు, ప్రతిపక్ష హోదానూ దక్కించుకోలేకపోయారు
- ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ గౌరవసభకు వచ్చా
- పవన్ సాధించిన విజయం వైసీపీకి చెంప పెట్టు
- ఎక్కడ తగ్గాలో…ఎక్కడ గెలవాలో తెలిసిన వ్యక్తి పవన్
- 16వ శాసన సభలో సీపం చంద్రబాబు తొలి ప్రసంగం
అమరావతి (చైతన్యరథం): శాసనసభ సాంప్రదాయాలను వికృత పోకడలతో గత ప్రభుత్వం దెబ్బతీసిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. నాటి సభలో సమస్యలపై మాట్లాడటానికి ప్రతిపక్ష సభ్యులకు మైక్ ఇవ్వలేదని, దూషణలు, బూతులు, వెకిలి చేష్టలతో సభ మర్యాదను దెబ్బతీశారని దుయ్యబట్టారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే సభలో దాడికి పాల్పడటంతోపాటు నీచంగా మాట్లాడి వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో నేడు ప్రజలు తమకు ఘన విజయం అందించడంతోపాటు పెద్ద బాధ్యత అప్పగించారని, ప్రత్యర్థి పార్టీలకు చెందిన శాసననభ సభ్యులను ఎగతాళి చేసి అవమాన పర్చకూడదని సభలోని సభ్యులకు సూచించారు. శాసనసభ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన చింతకాయల అయ్యన్నపాత్రుడిని చంద్రబాబు అభినందించారు. అనంతరం స్పీకర్ స్థానం వరకూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు అచ్చెన్నాయుడు, సత్యకుమార్యాదవ్తో వెళ్లి అయ్యన్నపాత్రుడుని స్పీకర్ చైర్లో కూర్చోబెట్టారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు సభలో ప్రసంగించారు.
బీసీ నేతను స్పీకర్‌గా చూస్తుంటే సంతోషంగా ఉంది
‘‘తెలుగు రాష్ట్రాల్లో సీనియర్ ఎమ్మెల్యే, బీసీనేతగా గుర్తింపు ఉన్న మిమ్మల్ని నేడు శాసనసభ అధ్యక్ష పదవిలో చూడటం సంతోషంగా, గర్వంగా ఉంది. సభ్యులందరి ఆమోదంతో 16వ శాసనసభ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు అభినందనలు తెలుపుతున్నా. యువత రాజకీయాల్లోకి రావాలని నాడు ఎన్టీఆర్ ఇచ్చిన పిలుపుతో 23 ఏళ్ల వయసులో అయ్యన్నపాత్రుడు ఎమ్మెల్యేగా గెలిచారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, నాలుగు తడవులు మంత్రిగా తెలుగురాష్ట్రాలపై ప్రత్యేక ముద్ర వేశారు. ఏ పదవిచ్చినా దానికి వన్నె తెచ్చారు. నర్సిపట్నంలో టీడీపీ ఆవిర్భావం నుంచి ఆయనే పని చేస్తున్నారు. 16ఏళ్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనది. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా 10ఏళ్లపాటు పార్టీకి సేవలందించారు. అయ్యన్న దేనికీ రాజీపడని విలక్షణ నేత. ఇప్పటికీ ఆయన ఫైర్ బ్రాండ్‌గానే ఉన్నారు. కరుడుకట్టిన పసుపుయోధుడిగా ఆయనకు పేరుంది. నీతి, నిజాయితీ, నిబద్ధతను పుణికిపుచ్చుకున్నారు. ఉత్తరాంధ్ర, విశాఖ అభివృద్ధికి కృషి చేశారు. కానీ అయ్యన్నపాత్రుడు తన రాజకీయ జీవితంలో ఏనాడూ పడని ఇబ్బందులు గత ఐదేళ్లు అనుభవించారు. ఆయన ఇంటిపై పోలీసులు దాడులు చేశారు. అక్రమంగా 23కేసులు పెట్టారు. అయినా భయపడలేదు’ అని సీఎం చంద్రబాబు రాజకీయాలపట్ల అయ్యన్న అంకిత భావాన్ని ప్రశంసించారు.
అన్నట్టుగానే నేడు గౌరవ సభకు వచ్చాను
‘చట్టసభలకు రావడం అరుదైన అవకాశం. ఎన్నుకున్న ప్రజలకు ఏంచేయాలో గుర్తుపెట్టుకోవాలి. గెలిచి వచ్చిన మనందరిపై పవిత్రమైన బాధ్యత ఉంది. చట్టసభల్లో సభ్యుల ప్రవర్తన సరిగావుండాలి. మనం మాట్లాడే ప్రతి విషయాన్నీ రాష్ట్రం చూస్తుంది. ఆనాడు మేము 23మంది సభ్యులం. జనసేన, బీజేపీ సభ్యులు సభలో లేరు. ఇదే సభలో నన్నూ ఎంతో బాధపెట్టారు. నన్నూ, నా కుటుంబం గురించి ఇష్టానుసారం మాట్లాడారు. నిరసన వ్యక్తం చేసేందుకు మైక్ సైతం ఇవ్వలేదు. ఇది గౌరవ సభ కాదు. మీరు నాకు మైక్ కూడా ఇవ్వడం లేదని చెప్పాను. ‘‘నేను స్టేట్మెంట్ ఇవ్వాలనుకున్నా, మీరు మైక్ ఇవ్వలేదు. అయినా నాకు బాధలేదు. మళ్లీ చెపుతున్నా ముఖ్యమంత్రిగానే సభకు వస్తాను. ఇది కౌరవసభ. గౌరవ సభ కాదు. ఇలాంటి సభలో ఉండనని చెబుతున్నా. నా అవమానం ప్రజలు అర్ధం చేసుకుని నిండు మనసుతో ఆశీర్వదించాకే సభకు వస్తా’ అని చెప్పి 2022 నవంబర్ 19న సభనుండి బయటికొచ్చాను. ఇప్పుడు ప్రజలు, మీ అందరి ఆశీస్సులతో అసెంబ్లీలో సీఎంగా అడుగుపెట్టాను’ అని సీఎం చంద్రబాబు తెలిపారు.
ఏ మహిళకూ అవమానం జరగనివ్వను
‘నేను తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. నాకొచ్చినన్ని అవకాశాలు తెలుగు రాష్ట్రాల్లో ఎవరికీ రాలేదు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశాను. 15 ఏళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేశాను. తిరుపతిలో నాపై బాంబు దాడికి పాల్పడ్డారు. ఆరోజు కూడా నాకు కన్నీళ్లు రాలేదు. కానీ సభతో, రాజకీయాలతో సంబంధంలేని నా సతీమణిపై తప్పుగా మాట్లాడారు. రాష్ట్రంలో గౌరవంగా బతికే ప్రతి ఆడబిడ్డపై సోషల్ మీడియాలో నీచంగా పోస్టులు పెట్టారు. ఎంతోమంది ఆడబిడ్డలు ఆ బాధ తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నారు. అలాంటి వ్యక్తులు, నేతలు, పార్టీ రాష్ట్రానికి అరిష్టమని ప్రజలు భావించి మమ్మల్ని గెలిపించారు. గతంలో నాకు, రాష్ట్రంలోని మహిళలకు జరిగిన అవమానం మరెవరికీ జరగనివ్వను. నా జీవితాంతం ప్రజలకు రుణపడి ఉంటాను. మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగు గడ్డపై పుట్టి రుణం తీర్చుకుంటాను. ఎక్కడో అమెరికాలో ఉండేవాళ్లు వచ్చి మొన్నటి ఎన్నికల్లో ఓటేశారు. ఇతర రాష్ట్రాల్లో ఉపాథి కోసం వెళ్లిన పేదలు కూడా వచ్చి ఓటు వేశారు. ఏపీని కాపాడుకోవాలని ఎన్డీఏ ఇచ్చిన పిలుపుతో వచ్చారు. వారందరి రుణం తీర్చుకోవాలి. ఆ తరహా చర్చలకు, కార్యక్రమాలకు ఈ సభ వేదిక కావాలి’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
ప్రజలు ఇచ్చింది అధికారం కాదు… బాధ్యత
‘2019 ఎన్నికల్లో మాకు 23 సీట్లు వచ్చాయి. నాకు బాధేసింది. 2019లో 23వ తేదీన ఫలితాలు వస్తే…. 23 సీట్లు వచ్చాయని ఎగతాళి చేశారు. ఇప్పుడు కూటమికి 164 సీట్లొచ్చాయి. విడదీసి కూడితే 11 వస్తుంది. రాజధాని కోసం 1136 రోజులు అమరావతిలో ఆడబిడ్డలు ఉద్యమం చేశారు. ఆ నెంబర్లు కలుపుకున్నా 11 వస్తుంది. నేడు వైసీపీ గెలిచింది 11 చోట్లమాత్రమే. పవన్ కల్యాణ్‌ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు. ఆయన పార్టీ అభ్యర్థులు 21 సీట్లలో పోటీ చేస్తే 21 గెలిచారు. వైనాట్ 175 అంటూ అహంభావం ప్రదర్శించిన వారికి పజలు 11 సీట్లు ఇచ్చారు. ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ గెలవాలో అక్కడ గెలిచిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇది 16వ శాసనసభ. నా జీవితంలో ఎప్పుడూ చూడని విధంగా 15వ సభ జరిగింది. జరిగిన పరిణామాలతో అది కౌరవ సభగా మనం భావించాం. 16వ సభను అత్యున్నత సభగా మనం నిర్వహించాలి. 24 గంటలూ మనం ప్రజలతో ఉండాలి. ప్రజలకు జవాబుదారీతనంతో ఉండాలి. ప్రజలు మనకు అధికారం ఇవ్వడం కాదు… రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని ముఖ్యమైన బాధ్యత ఇచ్చారు’ అని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు.
రాజధాని కట్టాలి… పోలవరం పూర్తి చేయాలి
‘ప్రజా జీవితాన్ని మార్చే శక్తి ప్రభుత్వ విధానాలకు ఉంటుంది. ఆ విధానాలకు రూపకల్పన చేసేది మన చట్టసభలే. భారతదేశంలో పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు. వాటిని ఆదర్శంగా తీసుకుని ఉమ్మడి ఏపీలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. 25ఏళ్ల క్రితం తీసుకున్న నిర్ణయాల ప్రభావం మనకు కనపడుతోంది. హైదరాబాద్ నగరం బెస్ట్ సిటీగా ఉందంటే మనం తీసుకున్న నిర్ణయాలే కారణం. నేడు భారత్ ప్రపంచంలోనే 5వ ఆర్థిక వ్యవస్థగా ఉంది. మరో నాలుగైదేళ్లలో 3వ ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది. 2047 వికసిత భారత్ మన కల కావాలి. అందుకు అగుణంగా సభలో చర్చలు, నిర్ణయాలు, పాలసీలు రావాలి. సభలో దూషణలు, వెకిలిచేష్టలు లేకుండా హుందాగా ముందుకెళ్లాలి. 16 సభలు గమనిస్తే టంగుటూరి ప్రకాశం పంతులు, మెటూరి హనుమంతురావు, ఎంజీ రంగా, కాళేశ్వరరావు, కాసాని వెంకటరత్నంలాంటి వారు శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. ఎన్టీఆర్ చరిత్ర సృష్టించిన యుగ పురుషుడు. వారందరూ మనకు ఆదర్శం కావాలి. నేను కోరుకునేది ఒకటే… రాజ్యాంగస్పూర్తి నిలుస్తుందని, ప్రజాస్వామ్యాన్ని కాపాడతారని, ఈ సభ హుందాగా నడుస్తుందని నమ్ముతున్నాను. మనం రాజధాని కట్టుకోవాలి. పోలవరం పూర్తిచేసుకోవాలి. నదుల అనుసంధానం చేసుకోవాలి. పెట్టుబడులు ఆకర్షించాలి. యువతకు ఉద్యోగాలు రావాలి. బడుగులకు న్యాయం చేయాలి. ఈ లక్ష్యాల సాథన కోసం సభను సజావుగా నడిపించుకోవాలి. మీ ఆధ్వర్యంలో జరిగే సభ ద్వారా ఏపీ ప్రపంచంలో నెంబర్ వన్‌గా ఉండేందుకు, పేదరికంలేని రాష్ట్రంగా తయారు చేసేందుకు, ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు అడుగులు పడాలని, ఆ తరహా చర్చలు సాగానలి కోరుకుంటున్నాను. సభను సమర్థవంతంగా నడిపేందుకు మీకు దేవుడు శక్తినివ్వాలని, మంచి ఆరోగ్యం ప్రసాదించాలని దేవుడిని వేడుకుంటున్నాను’ అని సీఎం చంద్రబాబు నాయుడు 16వ శాసనసభలో తొలి ప్రసంగం చేశారు.