- రైల్వే మంత్రి అశ్వినీ వైష్టవ్ వెల్లడి
- అభివృద్ధికి కొత్త మార్గమంటూ చంద్రబాబు హర్షం
ఢిల్లీ (చైతన్య రథం): తిరుపతి-పాకాల-కాట్పాడి మధ్య 104 కిలోమీటర్లమేర డబ్లింగ్ పనులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రూ.1,332 కోట్లతో తిరుపతి-పాకాల-కాట్పాడి డబ్లింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రి వివరించారు. ‘‘తిరుపతి-పాకాల-కాట్పాడి డబ్లింగ్ పనులతో పర్యాటకంగా ఎంతో అభివృద్ధి జరిగేందుకు ఆస్కారం ఉంటుంది. లక్షల సంఖ్యలో పర్యాటకులు వస్తారు. తిరుపతి, శ్రీకాళహస్తి, చంద్రగిరి కోట తిరుపతి-పాకాల-కాట్పాడి డబ్లింగ్ ప్రాంతంలోనే ఉన్నాయి. తిరుపతి-వెల్లూరు మార్గం వైద్య, విద్యపరంగా ఎంతో కీలకం. తిరుపతి-పాకాల-కాట్పాడి డబ్లింగ్ పనులతో 400 గ్రామాల్లోని 14 లక్షలమంది జనాభాకు లబ్ది చేకూరుతుంది. 35 లక్షల పనిదినాలు కల్పించేందుకు అవకాశం ఉంటుంది. ఏడాదికి 4 మిలియన్ టన్నుల సరకు రవాణాకు అవకాశం ఉంటుంది’’ అని కేంద్ర మంత్రి వెల్లడిరచారు.
అభివృద్ధికి ఇది కొత్త మార్గం: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి-పాకాల-కాట్పాడి మధ్య 104 కిలోమీటర్లమేర డబ్లింగ్ పనులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. డబ్లింగ్ పనులు చేపట్టేందుకు రూ.1,332 కోట్లు కేటాయించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌కు రాష్ట్ర ప్రజల తరపున చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ‘‘డబ్లింగ్ పనులకు ఆమోదం తెలిపి రూ.1,332 కోట్లు కేటాయించినందుకు కృతజ్ఞతలు. ఈ ప్రాజెక్టు తిరుపతి, శ్రీకాళహస్తి, చంద్రగిరి కోటను అనుసంధానం చేసేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ప్రాంతాలను అనుసంధానం చేయడం ద్వారా వైద్యం, విద్యా రంగాల్లో వెల్లూరు, తిరుపతికి మరింత ప్రాధాన్యత వచ్చేందుకు అవకాశం ఉంటుంది. వ్యవసాయ ఆర్థిక వ్యవస్థనూ మెరుగుపరుస్తుంది. ఏపీలోని సిమెంట్, స్టీల్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల పురోగతిని మరింత వేగవంతం చేస్తుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో లైన్ కనెక్టివిటీలో నూతన శకానికి నాంది పలికినట్లు అవుతుంది’’ అని చంద్రబాబు ‘ఎక్స్’లో పేర్కొన్నారు.