అమరావతి : వైసిపి అరాచకాలను ప్రజామద్దతు కూడగట్టి ఎక్కడికక్కడ దీటుగా ఎదుర్కొనే వారికే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు కేటాయిస్తామని, పెద్దఎత్తున జనసమీకరణ చేస్తూ అధికార పార్టీతో ఢీ అంటే ఢీ అనేలా తలపడేవారినే అభ్యర్థులుగా ఎంపికచేస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టంచేశారు. కుప్పంతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అధికారపార్టీ దౌర్జన్యకాండ నేపథ్యంలో శుక్రవారం ఉదయం అధినేత టెలీకాన్ఫరెన్స్ ద్వారా కీలకనేతలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో అధికార పార్టీ దౌర్జన్యకాండ పెచ్చరిల్లిపోతున్న ప్రస్తుత తరుణంలో తనతో సహా పార్టీ ముఖ్యనేతలంతా ఎటువంటి త్యాగాలకైనా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలను కాపాడుకుంటూ వారిలో మనోస్థయిర్యం కల్పించేందుకు ఎందాకైనా వెళ్లాలన్నారు. పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు, అక్రమ అరెస్టులపై పెడుతున్న పోలీసులపై సాక్ష్యాధారాలు సేకరించా లని, అటువంటి వారిని న్యాయస్థానాల్లో శిక్షపడేలా చేసేందుకు పార్టీ న్యాయవిభాగం సిద్ధంగా ఉందన్నారు.ప్రజా విశ్వాసం కోల్పోయిన వైసిపి నేతలు దౌర్జన్యాలు, అక్రమా లతో మిగిలిన రెండేళ్లు కూడా తమ దోపిడీ పర్వాన్ని కొనసాగించి ఇల్లు చక్కబెట్టుకోవాలను కుంటున్నారు. వైసిపి దోపిడీ పాలనను ప్రశ్నించి ప్రజల హక్కులు, ప్రాణాలు, ఆస్తులు కాపాడుకునేలా చైతన్యవంతం చేయాలని తెలిపారు.కుప్పంలో అన్న క్యాంటీన్ విధ్వంసం వైసిపి రాక్షసపాలనకు అద్దంపడుతోందని, దీనిని ఫోకస్‌చేస్తూ జగన్‌రెడ్డి నిజస్వరూపాన్ని ప్రజలకు తెలియజేయాలన్నారు. నియోజక వర్గస్థాయిల్లో పార్టీ నేతలు తమ శక్తికొలది అన్న క్యాంటీన్లు ఏర్పాటుచేయాలని కోరారు. ముఖ్య మంత్రి జగన్‌రెడ్డికి సత్తా ఉంటే పేదల ఆకలి తీర్చడంలో పోటీపడాలని, రద్దుచేసిన క్యాంటీన్లను తిరిగి తెరవాలని ప్రజాక్షేత్రంలో గళమెత్తా లని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.