- ఈ సందడి చూస్తే సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్లుగా ఉంది
- సీఎం చంద్రబాబు ఆలోచనలతో ఏపీ మోడల్ విద్యావ్యవస్థ
- రాజకీయాలకు అతీతంగా విద్యావ్యవస్థను తీర్చిదిద్దుతాం
- విద్యార్థులకు చదువుతోపాటు నైతిక విలువలపై పాఠాలు
- మెగా పేరెంట్స్ ` టీచర్స్ సమావేశంలో మంత్రి లోకేష్
బాపట్ల (చైతన్యరథం): ఆరునెలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తిచేస్తామని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాం, దీనిని పారదర్శకంగా నిర్వహించబోతున్నామని పేర్కొన్నారు. మెగా పేరెంట్స్ ` టీచర్స్ మీటింగ్‌లో భాగంగా బాపట్ల మున్సిపల్ హైస్కూలులో శనివారం జరిగిన కార్యక్రమానికి మంత్రి లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… మెగా పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్ చూస్తుంటే సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్టుగా ఉందన్నారు. మిమ్మల్ని చూసిన తరువాత నాకు నా స్కూల్ డేస్ గుర్తు వచ్చాయి. చిన్నప్పుడు మా స్కూల్‌లో పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్ జరిగితే మా అమ్మ వచ్చేవారు. మా నాన్న అప్పటికే రాష్ట్రానికి టీచర్ (ముఖ్యమంత్రి) కాబట్టి నా స్కూల్‌కి రావడానికి ఆయనకి టైం ఉండేది కాదు. పిల్లల్లో నాకు దేవుడు కనిపిస్తాడు. పిల్లలంతా నా కొడుకు దేవాన్ష్‌లాగే అనిపిస్తారు. మా వాడు ఉండేది హైదరాబాద్.. నేనుండేది అమరావతి. వాడితో ఆడుకోవడం కూడా కుదరడం లేదు. ఎంత ఒత్తిడిలో ఉన్నా…ఎన్ని పనులు ఉన్నా..పిల్లలు కనిపిస్తే నేను ఆగిపోతాను. సరదాగా కాసేపు వాళ్లతో ఆడుకుంటాను. పిల్లల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యాశాఖ మంత్రిని కావడం నా అదృష్టం. ఏ వృత్తి చేపట్టిన వారైనా వారిని తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే. ఉపాధ్యాయులంటే నాకు ఎంతో గౌరవం. జాతిపిత మహాత్మాగాంధీ చెప్పినట్లు విద్య ద్వారానే సామాజిక మార్పు సాధ్యమవుతుందని మా ప్రభుత్వం బలంగా నమ్ముతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు విజనరీ ఆలోచనలతో మన విద్యా వ్యవస్థ దేశానికే ఆదర్శంగా ఉండేలా ఆంధ్ర మోడల్ తీసుకొస్తున్నామని మంత్రి లోకేష్ అన్నారు.
మెగా పీటీఎం ద్వారా బలమైన బంధం
మెగా పీటీఎం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, టీచర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు మధ్య బంధం బలపడుతుంది. ఒక వ్యవస్థ బాగుపడాలంటే…అందులో అందరూ భాగస్వామ్యం అవ్వాలి. విద్యా వ్యవస్థ ఆదర్శంగా ఉండాలంటే సమాజ భాగస్వామ్యం తప్పనిసరి అని సీఎం చంద్రబాబు చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాలు, సూచనలతో బడి భవిష్యత్తు కోసం చదివే పిల్లలు-వారి తల్లిదండ్రులు, చదువు చెప్పే ఉపాధ్యాయులు-మార్గనిర్దేశం చూపే హెడ్మాస్టర్లు, పాఠశాల యాజమాన్య కమిటీలు, దాతలు, పూర్వ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇదే లక్ష్యంతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం రాష్ట్రమంతా ఒకేరోజున పండగ వాతావరణంలో నిర్వహించుకుంటున్నామని మంత్రి లోకేష్ వివరించారు.
మన పేరెంట్ ` టీచర్ మీటింగ్ ఒక చరిత్ర
పేరెంట్-టీచర్ మీటింగులు అన్ని చోట్లా జరుగుతాయి. కానీ మన పేరెంట్-టీచర్ మీటింగ్ ఒక రికార్డు. రాష్ట్రమంతా ఒకేసారి వేలాది స్కూళ్లలో, లక్షలాది విద్యార్థులు-టీచర్లు-తల్లిదండ్రులు సమావేశం కావడం ఒక చరిత్ర. రాష్ట్ర వ్యాప్తంగా 45,094 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలలో ఒకేసారి నిర్వహిస్తున్నాం. ఇందులో 35 లక్షల మంది విద్యార్థులు, 71 లక్షల తల్లిదండ్రులు, 1,88,266 మంది ఉపాధ్యాయులు, 50 వేలకు పైగా ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారు. ఈ సమావేశాలతో బడితో తల్లితండ్రులకు ఆత్మీయ బంధం ఏర్పడుతుంది. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుంది. ఈ సమావేశం ద్వారా పాఠశాలల సమస్యలు తెలుస్తాయి. పిల్లలు ఎలా చదువుతున్నారో తల్లిదండ్రులకు తెలుస్తుంది. విద్యార్థులకు హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులు అందిస్తున్నాం. హెల్త్ డిపార్ట్మెంట్ సహకారంతో కొన్ని టెస్టులు చేసి ఆ రిపోర్ట్ కూడా పొందుపరుస్తున్నాం. దీని వల్ల విద్యార్థుల ఆరోగ్యం ఎలా ఉందో తల్లిదండ్రులు, టీచర్లకు తెలుస్తుంది. పిల్లల ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవడానికి దీనిద్వారా ఆస్కారమేర్పడుతుంది. విద్యా వ్యవస్థను గాడిలో పెట్టే బాధ్యతను ముఖ్యమంత్రి చంద్రబాబు నాపై పెట్టారు. విద్యాశాఖ అంటే ఎన్నో సవాళ్లతో కూడినది. అయినా ఛాలెంజ్‌గా తీసుకుని నిర్వహిస్తున్నాను. విద్యా వ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచాలని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.
మా ప్రభుత్వానికి రంగుల పిచ్చి లేదు
చంద్రబాబు నేతృత్వంలోని మా ప్రభుత్వానికి రంగులు – ఫొటోల పిచ్చి లేదు. నేను మంత్రి అయిన వెంటనే ఫొటోలు, రంగులు తీసేయమని ఆదేశాలు జారీ చేసాను. స్కూల్స్‌లో ఒక్క జాబ్ మేళాలు తప్ప ఇతర ఏ కార్యక్రమాలు నిర్వహించకూడదని నిర్ణయం తీసుకున్నాను. రాజకీయ కార్యక్రమాలకు పిల్లల్ని తీసుకొని వెళ్ళకూడదు అని గట్టిగా చెప్పాను. విద్యార్థులకు స్ఫూర్తి కలిగించేలా మన చరిత్రను, సంస్కృతిని గుర్తుచేసేలా విద్యారంగంలో విశేష సేవలందించిన వ్యక్తుల పేర్లను ప్రభుత్వ పథకాలకు పెట్టి వాటిని సమర్థవంతంగా ముందుకు తీసుకెళుతున్నాం. 1 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు రూ. 944 కోట్లతో ఉచితంగా ‘‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర స్టూడెంట్ కిట్స్’’ పంపిణీ చేశాం. ‘‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం’’ కింద లక్షలాది మంది విద్యార్థులకు రుచికరమైన, నాణ్యమైన, ఆయా ప్రాంతాల ఆహార అలవాట్లను గౌరవిస్తూ పౌష్టికాహారం అందిస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు.
బోధనేతర పనిభారాన్ని తొలగించాం
ఉపాధ్యాయులు చదువు మాత్రమే చెప్పాలి, మరుగుదొడ్లు, భోజనం ఫోటోలు తీయడం వారి బాధ్యత కాదు. దీనిపై ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. రాష్ట్రంలో టీచర్లు చదువు మాత్రమే చెప్పాలి ఇతర పనులు, పనికిమాలిన యాప్స్ తొలగించాలని నిర్ణయం తీసుకున్నాం. ఆంధ్రా మోడల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ రూపొందిస్తున్నాం. పిల్లలను పిడుగులుగా తయారు చేసే బాధ్యత నాది. కేజీ టూ పీజీ కరిక్యులం మారుస్తున్నాం. చదువుతో పాటు నైతిక విలువలు చాలా ముఖ్యం. మహిళల్ని గౌరవించడం చిన్న వయస్సు నుండే నేర్పించాలి. ముందు సమాజంలో మార్పు రావాలి. కొందరు చేతికి గాజులు వేసుకున్నావా అని మాట్లాడతారు, అమ్మాయిలా ఏడవకు అని అంటారు. ఈ మాటలు విన్న ప్రతిసారి నాకు బాధ వేస్తుంది. ఇవన్నీ పోవాలి. ఆడ, మగ సమానం అనే భావన కలిగేలా ప్రత్యేక పాఠ్యాంశాలు తీసుకొస్తాం. పిల్లల్లో నైతిక విలువలు పెంచడం కోసం నైతిక విలువల సలహాదారునిగా చాగంటి కోటేశ్వరరావుని నియమించాం. వారి మార్గదర్శకత్వంలో ప్రత్యేక పాఠాలు రూపొందిస్తాం. లైఫ్ స్కిల్స్, సివిక్ అవేర్నెస్, ఆటలు, పాటలు నేర్పించాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి లోకేష్ చెప్పారు.
మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి
విద్యార్థులు చదువుతో పాటు అన్ని విషయాల్లో నంబర్ 1గా ఉండాలనేది మన లక్ష్యం. విద్యార్థుల సామర్థ్యాలను తెలుసుకోవడానికి డిజిటల్ ల్యాబ్స్ ఏర్పాటు చెయ్యబోతున్నాం. స్టూడెంట్స్ లెర్నింగ్ అవుట్ కమ్స్‌పై దృష్టిపెట్టాం. అన్ని స్కూల్స్‌లో టేబుల్స్, లీక్ ప్రూఫ్ క్లాస్ రూమ్స్, తాగునీరు, మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నాం. గత ప్రభుత్వంలా అర్ధరాత్రి ఆత్మలతో మాట్లాడి నిర్ణయాలు తీసుకోము. విద్యాశాఖలో ఏ నిర్ణయం తీసుకున్నా.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సంఘాలతో చర్చించి మాత్రమే తీసుకుంటున్నాం. డ్రగ్స్, గంజాయికి బానిసలు కావడం వల్ల ఒక తరం మొత్తం నాశనం అయ్యే ప్రమాదం ఉంది. అందుకే డ్రగ్స్‌పై యుద్ధం చేస్తున్నాం. ఇందుకోసం క్యాబినెట్ సబ్‌కమిటీ, టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశాం. ప్రైవేట్ స్కూల్స్ టీచర్ల కంటే ప్రభుత్వ పాఠశాలల టీచర్లు బాగా పాఠాలు చెబుతారు. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకురావడం నా బాధ్యత. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రాబోయే నాలుగేళ్లలో అన్ని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తాం, ప్రభుత్వ పాఠశాలలను 4స్టార్ రేటింగ్‌కు తీసుకురావాలన్న సీఎం ఆదేశాలను పాటిస్తాం. మిషన్ మోడ్‌లో కార్యక్రమం చేపడుతున్నాం. ఇందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సహకారం అవసరం. విద్యార్థులు, తల్లితండ్రులు, టీచర్లే నా బ్రాండ్ అంబాసిడర్లు. దాతలు, పూర్వవిద్యార్థులు, స్వచ్ఛందసంస్థలు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు అంతా కలిసి పాఠశాలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు సహకరించాల్సిందిగా మంత్రి నారా లోకేష్ కోరారు.