- అనవసరమైన ఆరోపణలు వద్దు… వీసీలను బెదిరించామని నిరూపించండి
- ఆధారాలిస్తే విచారణ జరిపిస్తా
- గతంలో మాదిరి ఒకే వర్గానికి కట్టబెట్టలేదు
- విద్యావేత్తలనే వీసీలుగా నియమించాం
- ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆరోపణలపై మంత్రి నారా లోకేష్ కౌంటర్
అమరావతి (చైతన్యరథం): విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్లను బెదిరింపులకు గురిచేశారంటూ వైసీపీ ఎమ్మెల్సీ చేసిన ఆరోపణలపై శాసనమండలిలో మంగళవారం విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ తీవ్రస్థాయిలో ప్రతిస్పందించారు. 19మంది వైస్ చాన్సలర్లలో ఒకేసారి 17మంది వీసీలను బలవంతంగా రాజీనామా చేయించారని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి లోకేష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తూ… వైస్ చాన్సలర్లను మేం బెదిరించడం ఏమిటని ప్రశ్నించారు. వీసీలను బెదిరించి రాజీనామాలు చేయించామని ఆధారాలు ఇవ్వండి, ఇప్పుడే విచారణకు ఆదేశిస్తా, అనవసరమైన ఆరోపణలు చేయడం కాదు, ఆరోపణలు నిరూపించాలని మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు. గవర్నర్ ఆధ్వర్యంలో యూనివర్సిటీలు నడుస్తాయి. ఎవరు బెదిరించారో చెప్పమనండి. గతంలో ఏపీపీఎస్‌సీ చైర్మన్‌ను రూంలోకి వెళ్లకుండా తాళం వేశారు. మీరా మాట్లాడేది? మీ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. వీసీలు తప్పుచేశారు కనుకే రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఎవరు బెదిరించారో చెప్పండి, నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఏపీపీఎస్‌సీ చైర్మన్ ఎందుకు రాజీనామా చేశారో చెప్పండి. వీసీ పదవులకు కోసం 500 మంది దరఖాస్తు చేశారు, గత ప్రభుత్వం మాదిరి వీసీ పోస్టులను ఒకేవర్గానికి కట్టుబట్టలేదు. సామాజిక న్యాయం చేశాం. విద్యావేత్తలకు వీసీలుగా నియమించాం. గతంలో ఏపీపీఎస్‌సీ చైర్మన్ రూమ్‌కి తాళాలు వేశారు, బెదిరించడం, భయపెట్టడం, బయటకు పంపడం మీ అలవాటు, గతంలో ముఖ్యమంత్రి సభలకు మీలా మేం స్కూలు పిల్లలను పంపలేదని మంత్రి లోకేష్ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. పరదాలు కట్టుకొని తిరగడం, తీర్పులు చెప్పిన జడ్జిల భార్యలపై పోస్టులు పెట్టడం మీ వాళ్లకు అలవాటు, ఈ కేసులో ఇప్పటికే కొందరు జైలులో ఉన్నారని మంత్రి లోకేష్ గుర్తుచేశారు.