హైదరాబాద్: రాజకీయాల్లో ప్రమాణాలు తగ్గిపోతున్నాయని, దీన్ని సరిదిద్దాల్సిన కర్తవ్యం మనందరిదని మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. ఏ రంగంలో అయినా విలువలు పాటించడం ముఖ్యమని చెప్పారు. అసెంబ్లీ, పార్లమెంట్‌లో జరిగే గొడవలు ప్రజల్లో ఆందోళన కల్గిస్తున్నాయని, నీతి, నిజాయితీ లేని వారికి, ప్రజలను రెచ్చగొట్టి గెలిచే వారికి గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందని అన్నారు. తన జీవితంలో అవార్డులు, సన్మానాలు పెద్దగా తీసుకోలేదని అన్నారు. పద్మవిభూషణ్ పురస్కారం ఇస్తున్నట్లు కేంద్రం చెబితే ప్రధాని మోదీపై గౌరవంతో అంగీకరించానని చెప్పారు. పద్మ అవార్డులకు ఎంపికైన తెలుగు వారిని తెలంగాణ ప్రభుత్వం ఆదివారం శిల్పకళావేదికలో సన్మానించింది. పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపికైన వెంకయ్యనాయుడు, చిరంజీవితోపాటు పద్మ శ్రీ అవార్డులు అందుకున్న వారిని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు సన్మానించారు.
ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ పద్మా పురస్కారాలకు ఎంపికలో కొత్త విధానం కనిపిస్తోందని, గుర్తింపు పొందని వ్యక్తులకు అది లభించేలా పద్మ అవార్డులు ప్రకటించారని, మట్టిలో మాణిక్యాలను గుర్తించి ఈ పురస్కారాలు ఇవ్వడం గొప్ప విషయమని అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులు విలువలు పాటించాలి. తెలుగు కళామతల్లికి ఎన్టీఆర్, ఏఎన్నార్ రెండు కళ్లు.. చిరంజీవి మూడో కన్ను. పట్టుదల, కృషి ఉంటే ఏదైనా సాధ్యమే. ప్రేక్షకుల్ని అలరించేం దుకు శ్రమించడం ఒకెత్తు అయితే… అస భ్యత, అశ్లీలం, హింసకు తావివ్వకుండా ఇంతకాలం నటించడం మరో ఎత్తు. ఈ విషయంలో చిరంజీవిని ఇతరులు ఆద ర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. బ్లడ్ బ్యాంక్ స్థాపించి, నిరంతరంగా సేవలు అందించడం అభినందించ దగ్గ విషయం. ఇష్టపడే పనిని కష్ట పడి చేస్తే నష్టంఉండదు. ఇందుకు ఆయన జీవితమే ఓ ఉదాహరణ’’ అని పేర్కొన్నారు.పద్మా అవార్డు గ్రహీతలను సన్మానించిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని ఆయన అభినందించారు.
వెంకయ్య వాగ్ధాటికి అభిమానిని: చిరంజీవి
రాజకీయాల్లో వెంకయ్యనాయుడు నిజమైన రాజనీతిజ్ఞుడని చిరంజీవి కొనియాడారు. వాజ్‌పేయి అంతటి హుందాతనం ఆయనలో ఉందన్నారు. వెంకయ్య వాగ్ధాటికి తాను పెద్ద అభిమాననని, చిన్నప్పటి నుండి తమకు ఆయన స్ఫూర్తిని అన్నారు. రాజకీయాల్లో రానురాను దుర్భాషలు ఎక్కువయిపోతు న్నాయని, నోరుజారి వ్యక్తిగత విమర్శలు చేసే వారికి బుద్దిచెప్పే శక్తి ప్రజలకే ఉందన్నారు. చిరంజీవి మాట్లాడుతూ ‘‘పద్మవిభూషణ్ పురస్కారం వచ్చాక వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు, అభిమానులు ప్రశంసలు కురిపిస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ మనసారా ఆశీర్వదిస్తుంటే ఈ జన్మకిది చాలు అనిపిస్తోంది. మా అమ్మానాన్నల పుణ్యఫలం నాకు సంక్రమించింది. ప్రభుత్వం వెంటనే స్పందించి పద్మ అవార్డులకు ఎంపికైన వారిని సన్మానించాలనే ఆలోచన చేయడం బహుశా ఇదే మొదటిసారి. ఇందుకు సీఎం, మంత్రులకు ధన్యవాదాలు. దీంతో కళలు, కళాకారులకు ప్రోత్సాహం అందించినట్లవు తుంది’’ అని పేర్కొన్నారు.