- సొంత కార్యకర్తలను కలుసుకునేందుకు వీఐపీ పాసులా
- జగన్ తీరుపై మంత్రి లోకేష్ వ్యంగ్యాస్త్రాలు
అమరావతి (చైతన్యరథం): తన సొంత నియోజకవర్గం పులివెందుల పర్యటనలో వైసీపీ కార్యకర్తలు తనను కలుసుకునేందుకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ వీఐపీ పాసులు జారీ చేయడంపై మంత్రి లోకేష్ ఎక్స్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘ఓరి నీ పాసుగాల! సినిమా ఫంక్షన్లకు వీఐపీ పాసులు విన్నాం గానీ.. సొంత నియోజకవర్గంలో సొంత పార్టీ కార్యకర్తలను కలవడానికి వీఐపీ పాసులు ఏందయ్యా? ఎప్పుడూ వినలే..! చూడలే..!’’ అంటూ జగన్ తీరును ఎండగట్టారు.
ఇటీవల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత జగన్ తన సొంత నియోజకవర్గం పులివెందులకు సోమవారం మొదటిసారి వచ్చారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలను కలవడానికి వీఐపీ పాసులు జారీ చేయించారు. ఈ పరిణామం పలువురిని విస్మయానికి గురిచేసింది. తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు జగన్ పులివెందుల వచ్చారు. కొందరు కార్యకర్తలను మాత్రమే మాజీ ముఖ్యమంత్రి కలుసుకున్నారు. పాసులున్న వ్యక్తులనే భద్రతా సిబ్బంది అనుమతించడం, గతంలో ఎన్నడూలేని విధంగా కొత్త పద్ధతిని ప్రవేశపెట్టడంపై ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు కంగుతిన్నారు. భద్రతా సిబ్బందితో పలువురు వాగ్వాదానికి దిగారు.