అమరావతి (చైతన్య రథం) రాష్ట్ర యువతకు ఉగాది పండుగ గొప్ప కానుకగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం హర్షణీయమని వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. మంత్రి నారా లోకేష్ విడుదల చేసిన 10,060 పోస్టులతో కూడిన జాబ్ క్యాలెండర్ నిరుద్యోగ యువతకు కొత్త ఆశలను నింపిందన్నారు. ఇది నిరుద్యోగులకు నిజమైన ఉగాది పండుగగా మారిందన్నారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీనీ మంత్రి లోకేష్ కచ్చితంగా అమలు చేస్తుండటం అభినందనీయమని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఒకవైపు పరిశ్రమలను రాష్ట్రానికి ఆకర్షిస్తూ, మరోవైపు యువతకు పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు కల్పించడం జరుగుతోందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండేళ్లలో సుమారు 30 వేల ప్రభుత్వోద్యోగాలు భర్తీ చేయడం ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జాబ్ క్యాలెండర్ పేరిట యువతను మోసం చేశారని, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పాలనలో నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కమిషన్ల కోసం పరిశ్రమలను రాష్ట్రంనుంచి వెళ్లగొట్టడంవల్ల యువత భవిష్యత్ దెబ్బతిన్నదన్నారు. ప్రస్తుతం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్లో విద్య, పోలీస్ తదితర కీలక శాఖలకు ప్రాధాన్యమివ్వడం జరిగిందని, మెగా డీఎస్సీ ద్వారా వేలాది ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు తెలిపారు. గ్రూప్-1, గ్రూప్-2, హోం, విద్యాశాఖల్లో షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్లు విడుదల చేసి, నిర్దేశిత సమయంలోనే నియామకాలు పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇప్పటినుంచే ప్రిపరేషన్ ప్రారంభించాలని, తమ లక్ష్య సాధనకు కృషి చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. యువత ఆకాంక్షలను నెరవేర్చడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి అచ్చెన్న పేర్కొన్నారు.















