అమరావతి (చైతన్య రథం): ‘ఒక హామీ నెరవేర్చితే ఏదో నా బాధ్యత తీరిపోయినట్టు కాదు. భారం దించుకున్నట్టు అంతకంటే కాదు. లక్షలాది బతుకులకు అది వెలుగుదారి కావాలనే నా ఆశయం నెరవేరుతుందనే ఆనందమిది’ అని ఐటీ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. చేనేత కళాకారులకు 200 యూనిట్లు, పవర్‌లూమ్‌కు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వాలనే ప్రతిపాదనకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన మంత్రిమండలి ఆమోదముద్ర వేయడం సంతోషాన్నిచ్చిందని వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే నేనిచ్చిన మాటను మంత్రిమండలి కార్యరూపంలో పెట్టడం ఎన్డీఏ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికలకు కొద్దిరోజుల ముందే మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి తక్కువ ఓట్లతో ఓడిపోయాను. అయినా నియోజకవర్గాన్ని వీడిపోలేదు.
ఆరోజునుంచి నియోజకవర్గంలో ప్రజల్లో ఒకడిగా మారాను. మంగళగిరిలో చేనేత కళాకారుల కుటుంబాలు ఎక్కువ. వారి ఇళ్లకు, పని ప్రదేశాలకు వెళ్లేటప్పుడు అందమైన వస్త్రాలను నేసేవారి జీవితాలలో కష్టాలను చూశాను. యువగళం పాదయాత్రలో ధర్మవరం, వెంకటగిరి చేనేతల సమస్యలు విన్నాను. రాష్ట్రవ్యాప్తంగా చేనేతలందరూ పడుతున్న ఇబ్బందులు కళ్లారా చూశాక చేనేతలకు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చాను. మాట నిలబెట్టుకుని చేనేతలకు చేదోడుగా నిలిచామన్నారు. నేను ఎక్కడికి వెళ్లినా.. ఏ అతిథిని కలిసినా మంగళగిరి చేనేత కళాకారులు నేసిన శాలువాతోనే సత్కరిస్తాను. చేనేత వస్త్రాలకు విస్తృత మార్కెటింగ్ కల్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నానని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.