- సీ ప్లేన్ డెమో లాంచ్ గొప్ప ప్రయోగం
- రాష్ట్ర రూపురేఖలను మారుస్తుందని విశ్వసిస్తున్నా
- కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్‌నాయుడు
అమరావతి (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్‌లో సీ ప్లేన్ డెమో లాంచ్‌తో నూతన అధ్యాయం ప్రారంభమైందని కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. చంద్రబాబు హయాంలో ఎన్నో విశిష్ట కార్యక్రమాలు జరుగుతుంటాయని.. తాజాగా నిర్వహించిన సీ ప్లేన్ లాంచ్ కూడా అలాంటిదేనన్నారు. సీ ప్లేన్ లాంచ్ కార్యక్రమం కేవలం ఆంధ్రప్రదేశ్ రూపురేఖలనే కాకుండా భారతదేశ రూపురేఖలను మార్చుతుందన్న విశ్వాసం ప్రకటించారు. సీ ప్లేన్ ఆపరేషన్స్ ప్రపంచంలో అనేక దేశాల్లో జరుగుతున్నాయని.. మన దేశంలోనూ గతంలో ఓ ప్రయత్నం జరిగిందన్నారు. కోవిడ్ వంటి కొన్ని కారణాల వల్ల అందులో జాప్యం జరిగిందన్నారు. రాష్ట్రంలో సీ ప్లేన్ రంగం అభివృద్ధికి మంచి పొటన్షియల్ ఉందని, ప్రధాని సైతం ఈ రంగంపై ప్రత్యేక దృషి ్టపెట్టారన్నారు. అన్ని కోణాలను స్పృశించి భారతదేశాన్ని పౌర విమానయాన రంగాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లనున్నట్టు స్పష్టం చేశారు. గైడ్‌లైన్స్ మార్చి ఈ కార్యక్రమానికి నాంది పలికామన్నారు.
ఇదే పున్నమి ఘాట్‌లో డ్రోన్ షోను ఘనంగా నిర్వహించి అయిదు గిన్నిస్ రికార్డులను సాధించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ చంద్రుడు హయాంలో ఎప్పుడూ నిండు పున్నమేనని సీఎంను కొనియాడారు. ఎక్కడ వాటర్ ఉంటే అక్కడ సీ ప్లేన్‌ను ల్యాండ్ చేయొచ్చు.. టేకాఫ్ చేయొచ్చని.. చాలా చిన్న దేశమైన మాల్దీవుల్లో సుమారు 110 సీ ప్లేన్స్ నడుస్తున్నాయని.. వీటిలో ఏడాదికి 5 లక్షలమంది ప్రయాణిస్తున్నారని వివరించారు. మరి భారతదేశంలో స్లీ ప్లేన్ రంగానికి ఉన్న పొటన్షియల్‌ను వెలికితీసి ఎక్కడో ఒక దగ్గర ముందడుగు పడాలి. ఆ అడుగు చంద్రబాబు హయాంలో పడిరదన్నారు. ఉడాన్ కార్యక్రమానికి సీ ప్లేన్‌ను జోడిస్తే ఎన్నో రూట్లు ఏర్పడ్డాయని వివరించారు. చంద్రబాబు మార్గదర్శనంతో భవిష్యత్తులో మరిన్ని మార్గాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కేంద్రంనుంచి పూర్తి సహకారం రాష్ట్ర సీ ప్లేన్ రంగానికి అందుతుందని పేర్కొన్నారు. ఎయిర్‌పోర్టు నిర్మించాలంటే పెద్దఎత్తున భూమి కావాలి. అదే సీ ప్లేన్‌కు అయితే ఎలాంటి విమానాశ్రయం అవసరం లేదని.. తీరప్రాంతం లేదంటే నదులు వంటివి ఉంటే చాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను లాజిస్టిక్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు చంద్రబాబు పనిచేస్తున్నారని.. ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు తోడుగా నిలబడి.. అన్ని రకాలుగా అభివృద్ధి సాధించేందుకు పూర్తి సహాయసహకారాలు అందిస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు.
పర్యాటకులకు మెరుగైన మౌలిక వసతులు: జనార్ధన్ రెడ్డి
రోడ్లు, భవనాల మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ అమరావతి వేదికగా నిర్వహించిన డ్రోన్ సదస్సు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో నమోదవడంతో మన రాష్ట్రం దేశంలోనే గుర్తింపు పొందిందన్నారు. పలు నూతన ఆవిష్కరణలకు వేదికగా నేడు మన రాష్ట్రం నాంది పలుకుతుందన్నారు. విమానరంగం, పర్యాటకరంగాలని మరింత ప్రోత్సహించే విధంగా పర్యాటకులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా ముందుకు వెళ్తున్నామన్నారు. పర్యాటకరంగ అభివృద్ధితోపాటు ఉపాధి పెంచడం, నూతన విమానాశ్రయాలు నిర్మించడం, ఆధునీకరణ వంటి అనేక కార్యక్రమాలను తమ శాఖ తరపున నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాకు మెరుగైన కనెక్టివిటీ పెంచడం తద్వారా పర్యాటక రంగంలో రాష్ట్రాన్ని దేశంలోనే ఉత్తమ పర్యాటక రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యాటక, విమానయాన రంగాల అభివృద్ధికి అందిస్తున్న తోడ్పాటు, చొరవతో రాష్ట్రంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం 5వేల కోట్ల పెట్టుబడితో ముఖ్యమైన ప్రాజెక్ట్ ఆవిష్కృతం కానుందన్నారు. రాష్ట్రంలో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి విమానాశ్రయాలతో పాటు దేశీయంగా రాజమండ్రి కడప, కర్నూలు విమానాశ్రయాలు ద్వారా ప్రయాణికులకు సేవలందిస్తున్నామన్నారు. సీ ప్లేన్ ద్వారా కీలక పర్యాటక ప్రదేశాలను అనుసంధానిస్తామని మంత్రి వెల్లడిరచారు.
మరిన్ని సీ ప్లేన్‌లకు ప్రణాళికలు: కందుల దుర్గేష్
ముఖ్యమంత్రి చంద్రబాబు కీర్తి కిరీటంలో సీ ప్లేన్ ప్రారంభోత్సవ మరో కలికితురాయిగా పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ అభివర్ణించారు. జలమార్గం ద్వారా ఆకాశమార్గంలో పయనించే సీప్లేన్ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవటం సంతోషకరమన్నారు. పర్యాటకులకు మధురానుభూతి కలిగించే సీ ప్లేన్లు త్వరలోనే మరిన్ని ప్రాంతాల్లో ప్రవేశ పెట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. టూరిజం సర్క్యూట్ల ద్వారా రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధికి కృషి చేస్తున్నట్టు మంత్రి దుర్గేష్ తెలిపారు. దేవాలయ దర్శనంతో పాటు ప్రకృతి సౌందర్యంలో ప్రయాణికుడు విహరించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి వెల్లడిరచారు. గడిచిన ఐదేళ్లలో పర్యాటక రంగాన్ని సమూలంగా నాశనం చేసిన దుర్మార్గ ప్రభుత్వాన్ని చూశామని, ఇప్పుడు పర్యాటక రంగాన్ని పట్టాలెక్కించేందుకు, పర్యాటక రంగంలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు, అద్భుతమైన ప్రగతిని చూపించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషిని చూస్తున్నామన్నారు. సీ ప్లేన్ కార్యక్రమాన్ని వయబుల్ చేసుకునేందుకు రాబోయే రోజుల్లో ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. అరకు వ్యాలీ, శ్రీశైలం, తిరుపతి, నదీతీర సమీపంలోని రాజమహేంద్రవరం, కోనసీమలాంటి ప్రాంతాల్లో నీటిమీద ప్రయాణించే సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. చుట్టుపక్కలఉండే పచ్చని పర్యాటకాన్ని పర్యాటకులు అనుభూతి చెందేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని మంత్రి వివరించారు.