- విదేశాల్లో నర్సింగ్ జాబ్ చేయాలనేది మా కల
- అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సాకారం చేసుకున్నాం
- ఆడపిల్లలకు చదువు ఎందుకు అని అందరూ హేళన చేశారు
- ఇప్పుడు ఫారిన్ వెళ్తుంటే మా తల్లిదండ్రులు చాలా గర్వపడుతున్నారు
- పేద కుటుంబం నుంచి వచ్చి అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగం పొందడం ఆనందంగా ఉంది
- సీడాప్ శిక్షణతో జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాలు పొందిన యువత మనోగతం
ఉండవల్లి (చైతన్యరథం): విదేశాల్లో నర్సింగ్ జాబ్ చేయాలనేది తమ కల అని, జర్మన్ భాషపై సీడాప్ అందించిన శిక్షణను సద్వినియోగం చేసుకుని తమ కలలను సాకారం చేసుకున్నామని జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాలు పొందిన యువత తమ మనోగతాన్ని వెల్లడిరచారు. ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా గ్రామీణ యువతకు ఇదో గోల్డెన్ అవకాశం అని చెప్పారు. ఉండవల్లి నివాసంలో శనివారం జరిగిన కార్యక్రమంలో జర్మనీలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులను మంత్రి నారా లోకేష్ అభినందించారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురైన పలువురు యువత కృతజ్ఞతాపూర్వకంగా మాట్లాడారు.
1. ప్రతి ఒక్కరికి ఇదో గోల్డెన్ అవకాశం
మైలారి వినోదిని (కపాడిపాలెం, నెల్లూరు జిల్లా)
నేను బీఎస్సీ నర్సింగ్ చదివాను. విజయవాడ భవానీపురంలోని సీడాప్, ఐఈఎస్ శిక్షణా కేంద్రంలో 8 నెలల పాటు జర్మన్ భాషపై బీ 2 లెవల్ వరకు శిక్షణ అందించారు. మాది దిగువ మధ్యతరగతి కుటుంబం. రూపాయి ఖర్చు లేకుండా మాకు ఉచితంగా శిక్షణ అందించడంతో పాటు ఉచితంగా హాస్టల్ సౌకర్యం, ఆహార వసతి కూడా కల్పించారు. నెలకు రూ.2.70 లక్షల ప్యాకేజీతో జర్మనీలో నర్సింగ్ ఉద్యోగ అవకాశం కల్పించారు. ఇందుకోసం ఆదివారం నేను జర్మనీ వెళ్తున్నాను. నాకు చాలా సంతోషంగా, ఉద్విగ్నంగా ఉంది. ప్రతి ఒక్కరికి ఇదో గోల్డెన్ అవకాశం. సీడాప్, ఐఈఎస్ కార్యక్రమం వల్ల చాలా మంది ప్రేరణ పొందుతారు. నాకు ఈ అవకాశం కల్పించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కి, సీడాప్, ఐఈస్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
2. ఇలాంటి అవకాశం వస్తుందని కలలో కూడా ఊహించలేదు
లాం దివ్య (చిన్నఅవుటపల్లి, కృష్ణా జిల్లా)
శోభనాద్రి సిద్ధార్థ నర్సింగ్ కాలేజీలో 2018-2023 మధ్య బీఎస్సీ నర్సింగ్ చదివాను. పిన్నమనేని ఆసుపత్రిలో ఏడాదిపాటు నర్స్‌గా పనిచేశాను. సీడాప్, నైపుణ్య విభాగం ద్వారా నర్సింగ్ చేసిన వారికి ఉచితంగా జర్మన్ భాషపై శిక్షణ, ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నారని దినపత్రికలో వార్త చూసి భవానీపురంలోని శిక్షణా కేంద్రానికి దరఖాస్తు చేశాను. ఇక్కడ దాదాపు 10 నెలల పాటు ఉచితంగా శిక్షణ అందించారు. శిక్షణా కాలంలో ఉచితంగా వసతి, భోజన సౌకర్యం, పుస్తకాలు అందించారు. ఈ నెల 22వ తేదీన నేను జర్మనీ వెళ్తున్నాను. నాకు నెలకు రూ.2.70 లక్షల ప్యాకేజీతో నర్సింగ్ ఉద్యోగ అవకాశం కల్పించారు. శిక్షణా కేంద్రంలో సిబ్బంది మాకు చాలా మద్దతుగా నిలిచారు. ట్రైనింగ్ కూడా చాలా బాగా జరిగింది. శిక్షణా కాలాన్ని రెండు నెలల వరకు పొడిగించి జర్మన్ భాషపై బీ 2 స్థాయి వరకు మమ్మల్ని సిద్ధం చేశారు. మా నాన్న రైతు. మేం ఐదుగురం అక్కాచెల్లెళ్లం. నేను చివరి అమ్మాయిని. ఆడపిల్లలకు చదువు ఎందుకు అని అందరూ హేళన చేశారు. ఇప్పుడు నేను ఫారిన్ వెళ్తుంటే.. మా నాన్న చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఇలాంటి అవకాశం వస్తుందని కలలో కూడా ఊహించలేదు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇందుకు మంత్రి నారా లోకేష్‌కి, సీడాప్‌కు ధన్యవాదాలు.
3. విదేశాల్లో నర్సింగ్ జాబ్ చేయాలనేది నా కల
కనికె లోకేష్ (కల్లూరు, కర్నూలు జిల్లా)
నేను ఎల్వీటీజీ కాలేజీలో బీఎస్సీ నర్సింగ్ చదివాను. కర్నూలు విజయ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిలో నర్సుగా చేశాను. సీడాప్, ఐఈఎస్ ఆధ్వర్యంలో మాకు భవానీపురంలోని ట్రైనింగ్ సెంటర్‌లో ఏడాది పాటు జర్మన్ భాషపై ఉచిత శిక్షణ అందించారు. ఈ నెల 22వ తేదీన నేను జర్మనీ వెళ్తున్నాను. ఇది మాకో గోల్డెన్ ఆపర్చ్యూనిటీ. విదేశాల్లో నర్సింగ్ జాబ్ చేయాలనేది నా కల. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నా కలను సాకారం చేసుకున్నాను. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ని కలవడం చాలా సంతోషంగా ఉంది. మా నాన్న కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇలాంటి శిక్షణ కార్యక్రమాలను కొనసాగించి గ్రామీణ యువతకు అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నాను.
4. చాలా ఆనందంగా ఉంది
దెబ్బె శివరాజు (బోగోలు, కర్నూలు జిల్లా)
సీడాప్, ఐఈఎస్ సహకారంతో దాదాపు ఏడాది పాటు నేను జర్మన్ భాష నేర్చుకున్నాను. ట్రైనర్ శ్రీనిధి మాకు చాలా మద్దతుగా నిలిచారు. ఈ నెల 22వ తేదీన నర్సింగ్ జాబ్ చేసేందుకు జర్మనీ వెళ్తున్నాను. నాకా చాలా ఎగ్జైట్‌మెంట్‌గా ఉంది. పేద కుటుంబం నుంచి అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగం పొందడం చాలా ఆనందంగా ఉంది. మా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి నన్ను చదివించారు. వారికి ఉన్నతమైన జీవితం అందించేందుకు నేను జర్మనీ వెళ్తున్నాను. మంత్రి నారా లోకేష్‌ని కలవడం చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. ఈ అవకాశం కల్పించిన మంత్రి లోకేష్‌కి, సీడాప్‌కు కృతజ్ఞతలు. భవిష్యత్ లో నాలాంటి పేద విద్యార్థులు విదేశాల్లో ఉద్యోగాలు పొందేందుకు, వారి ఉన్నతమైన కలలను సాకారం చేసుకునేందుకు మార్గదర్శకంగా ఉంటాను. మన దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు వచ్చేలా కృషిచేస్తాను.