అమరావతి (చైతన్య రథం): రాయలసీమ ప్రాంతానికి నీళ్లిచ్చి రైతన్నలకు మంచి చేసే కార్యక్రమంలో కలిగే సంతోషం ఎప్పుడూ ప్రత్యేకమేనని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఈమేరకు గురువారం ఎక్స్ వేదికపై పోస్టు పెడుతూ.. ‘మనసుకు చాలా సంతోషంగా, సంతృప్తిగా ఉంది. రాయలసీమకు జీవనాడి హంద్రీనీవా ప్రధాన కాల్వ విస్తరణ పనులు శరవేగంగా చేశాం. మొదటి ఫేజ్ పూర్తిచేసి మల్యాల పంపింగ్ స్టేషన్‌నుంచి నీటిని విడుదల చేశాం. హంద్రీనీవా ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 2200 క్యూసెక్కుల నుంచి 3850 క్యూసెక్కులకు పెంచడం వల్ల సీమ రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుంది. రికార్డుస్థాయిలో ఈ పనులు పూర్తిచేయడంలో భాగస్వాములు అయిన ప్రతి ఒక్కరికీ అభినందనలు, ధన్యవాదాలు. ఇదే స్ఫూర్తితో త్వరలోనే పేజ్`2 పనులు పూర్తి చేద్దాం. నాలుగు ఉమ్మడి జిల్లాల్లో 5 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీటిని అందించే ప్రాజెక్టును పూర్తి చేస్తాం. నీళ్లిస్తే రైతులు బంగారం పండిస్తారు. సంపద సృష్టికి మూలమైన జలాన్ని ప్రతి ఎకరాకూ అందిచాలనే సంకల్పాన్ని అందరి దీవెనలతో సహకారంతో నేరవేరుస్తాం. రైతన్నల సాగునీటి కష్టాలు తీర్చి వారి జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తాం’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.