- వైసీపీ మాజీ జెడ్పీటీసీపై గ్రీవెన్స్‌లో ఫిర్యాదు
- గత ప్రభుత్వంలో వారసత్వ భూమి కబ్జా
- డ్వాక్రా మహిళల సాగు భూమిపై మాజీ సర్పంచ్ కన్ను
- న్యాయం చేయాలని ప్రజావినతుల్లో బాధితుల గోడు
- అర్జీలు స్వీకరించిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి, సత్తిబాబు
మంగళగిరి(చైతన్యరథం): టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో గుంటూరు జిల్లా నల్లపాడుకు చెందిన చెందిన బాలకృష్ణ తన సమస్యను వివరిస్తూ వినతిపత్రం ఇచ్చాడు. తమకు జీతం ఇవ్వకుండా వైసీపీ నాయకుడు ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఫిర్యాదు చేశారు. తాను, తన భార్య గత మూడేళ్లుగా ఒక వైసీపీ మాజీ జెడ్పీటీసీ వద్ద పని చేశాం. తమకు రావాల్సిన జీతాలను ఇవ్వకుండా అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు. ఇదే సమయంలో ఏడేళ్ల కుమారుడికి బ్లడ్ క్యాన్సర్ రావడంతో చికిత్స అందించడానికి కష్టాలు ఎదుర్కొన్నాం. చివరికి తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయాడు జిల్లా పోలీసు అధికారులను ఆశ్రయించినా న్యాయం జరగలేదు. వారిపై చర్యలు తీసుకుని తమ సమస్యను పరిష్కరించాలని నేతలు మహిళా, శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఏపీ శెట్టి బలిజ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్తిబాబుకు అర్జీ ఇచ్చి అభ్యర్థించాడు.
గత ప్రభుత్వంలో భూమి ఆక్రమించారు..
పల్నాడు జిల్లా మాచర్ల మండలం రాయవరం గ్రామానికి చెందిన కామిశెట్టి చెన్నకేశవరావు గ్రీవెన్స్‌లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమ గ్రామంలోని సర్వే నెం. 363లో 2.50 ఎకరాల భూమి తమ పూర్వీకుల నుండి 1995 నుంచి తనకు వారసత్వంగా సంక్రమించింది. ఈ భూమిని సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నానని, 2009లో తన భార్య కామిశెట్టి లక్ష్మీ నర్సమ్మ పేరుమీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. ఈ భూమిని మాచర్ల సొసైటీ బ్యాంక్, అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తనఖా పెట్టి రుణాలు పొందినట్లు, వాటికి సంబంధించిన అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెప్పారు. 2022 వరకు ఆస్తి తన భార్య పేరుమీదే ఉన్నట్లు రికార్డులు ఉన్నప్పటికీ, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కొందరు వ్యక్తులు అధికారుల అండతో కామిశెట్టి హైమావతి పేరుమీద 1.50 ఎకరాలు అక్రమంగా నమోదు చేయించారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో తన భార్య పేరుమీద కేవలం 1.00 ఎకరం మాత్రమే చూపుతుంది. వారిపై చర్యలు తీసుకుని తమ భూమి సమస్యను పరిష్కరించాలని కోరాడు.
వైసీపీ నాయకుడి భూ ఆక్రమణ యత్నం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మండలం పెద్దపట్టపుపాలెం గ్రామానికి చెందిన సునీత, తిరుపతమ్మ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమ గ్రామంలో 1998వ సంవత్సరంలో నందమ్మపాలెం కాలువ ఇవతల భాగంలో ఉన్న పోరంబోకు భూమిని డ్వాక్రా గ్రూపు మహిళలమంతా కలిసి దాదాపుగా రూ.20 లక్షలు ఖర్చు చేసి చదును చేసి సాగుబడి భూమిగా మార్చుకున్నాం. పొదుపు గ్రూపుల పేర్లపై పట్టాలు మంజూరు చేస్తామని అధికారులు చెప్పారు. 13 డ్వాక్రా గ్రూపులకు చెందిన 40-50 మంది సభ్యులకు మాత్రమే పట్టాలు మంజూరయ్యాయి. దానికి సంబంధించినగా మాకు జన్మభూమి పథకం రిజిస్టర్ నెం.7/06/06/98, అలాగే సర్వే నెంబర్లు 457-5, 369 కేటాయించినట్లు సమాచారం అందించారు. ఈ పరిస్థితుల్లో అప్పటి మాజీ సర్పంచ్, ప్రస్తుత వైసీపీ నేత బినామీల పేర్లపై ఈ భూములను అక్రమంగా ఆక్రమించుకున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతానికి పోర్టు రావడంతో భూమి విలువ పెరిగిన నేపథ్యంలో తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి అక్రమంగా పట్టాలు మంజూరు చేయించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.
వైసీపీ నేతల అండతో దౌర్జన్యం
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం అహోబిలం గ్రామానికి చెందిన కుమ్మిర బాలుడు గ్రీవెన్స్‌లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తమ గ్రామంలో తమకు చట్టబద్ధంగా వచ్చిన ఇంటి, వ్యవసాయ భూమిపై హక్కులు ఉన్నప్పటికీ దాయాదులు రాజకీయ బలాన్ని అడ్డుపెట్టుకు ని వైసీపీ గుండాలతో కలిసి దాడులకు పాల్పడి భయభ్రాంతులకు గురి చేసి అక్రమంగా ఆక్రమణకు దిగారు. ఇంటిని కూల్చివేయడం వల్ల కుటుంబం నిరాశ్రయ స్థితికి చేరిందని పొలాన్ని కోల్పోవడంతో జీవనోపాధి పూర్తిగా దెబ్బతింది. ఈ ఘటనపై సంబంధిత అధికారులను, పోలీసులను పలుమార్లు ఆశ్రయించినా సరైన న్యాయం జరగలేదు. వారిపై చర్యలు తీసుకుని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.
నిషేధిత జాబితాలో భూమి
కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లి గ్రామానికి చెందిన కోటేశ్వరి గ్రీవెన్స్‌లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తమ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్లు 192/1, 192/9లో మొత్తం 3.09 ఎకరాలు భూమి తమ కుటుంబానికి చట్టబద్ధంగా ఉంది. ఈ భూమి తమ అమ్మాయికి పసుపు కుంకుమ కింద ఇచ్చారు. అయితే ఆన్‌లైన్ “మీ భూమి” వెబ్‌సైట్‌లో భూమి వివరాలు పరిశీలించగా ఈ భూమి నిషేధిత జాబితాలో ఉన్నట్లు చూపిస్తోంది.. దీనివల్ల తమ భూమికి సంబంధించిన హక్కులు వినియోగించుకోవడంలో రికార్డులు పొందడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనిపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదు. కావునా తమయందు దయవుంచి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.
మస్కట్‌లో చిక్కుకుపోయిన మహిళ
తిరుపతి జిల్లా చిట్వేలి మండలం కేవీఆరఆర్ పురం గ్రామానికి చెందిన దిలీప్‌కుమార్ గ్రీవెన్స్‌లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తమ అమ్మ గౌరవమ్మ జీవనోపాధి నిమిత్తం దాదాపు ఒక సంవత్సరం క్రితం మస్కట్‌కు వెళ్లినప్పటికీ అక్కడి ఏజెంట్లు ఆమెకు మెడికల్ పరీక్షలు, సివిల్ ఐడి వంటి తప్పనిసరి ప్రక్రియలు పూర్తి చేయకుండా మోసం చేశారు. అంతేకాకుండా ఆమె పాస్‌పోర్టును కూడా ఏజెంట్లు తీసుకుని ఇవ్వకుండా నిర్బంధించారు. ప్రస్తుతం ఆమె అత్యంత అసహాయ స్థితిలో మస్కట్‌లోని భారతీయ దౌత్య కార్యాలయం వద్ద ఆశ్రయం పొందుతున్నప్పటికీ అవసరమైన పత్రాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు మానవతా దృక్పథంతో స్పందించి స్వదేశానికి తీసుకువచ్చే ఏర్పాట్లు చేయాలని కోరాడు















