- అసైన్డ్ భూములను వెంచర్లేసి అమ్మేస్తున్నారు
- అసైన్డ్ భూములిచ్చింది వ్యవసాయం కోసం..
- 596 జీవోకింద ఫ్రీహోల్డ్ అయ్యాకే సాగుచేయాలి
- కానీ, ఉత్తరాంధ్రలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతోంది
- సీఎస్‌పై ఆరోపణలకు కట్టుబడే ఉన్నా..
- అప్పన్నస్వామి మీద ప్రమాణానికైనా సిద్ధం
- బినామీల ఆస్తులతో బహిరంగ చర్చకు సిద్ధమా?
- భారీ కుంభకోణంపై లోతైన దర్యాప్తు జరగాలి
- మళ్లీ విరుచుకుపడిన జనసేన నేత మూర్తియాదవ్
అమరావతి (చైతన్య రథం): ఏపీ సీఎస్ జవహర్‌రెడ్డిపై జనసేన నేత మూర్తియాదవ్ గురువారం మరోసారి సంచలన అభియోగాలే చేశారు. జవహర్‌రెడ్డి తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌గా పని చేసిన కాలం నుంచీ ఎవరెవరు బినామీలుగా ఉన్నారో వాళ్ల పేర్లను బయటపెడుతూ.. భూకుంభకోణం విషయంలో ఇప్పటికీ తన ఆరోపణలకు కట్టుబడే ఉన్నానని మీడియా సమావేశంలో ప్రకటించారు. దీనిపై ఎలాంటి విచారణలకైనా తాను సిద్ధమేనని, అప్పన్నస్వామి మీద ప్రమాణం చేయడానికైనా తాను రెడీ అన్నారు. జనసేన నేత మూర్తియాదవ్ వరుసగా చేస్తోన్న ఆరోపణలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. ఆయన చేస్తున్న ఆరోపణలపై సీఎస్ కార్యాలయం ఇప్పటికే నోటీసులు కూడా పంపించింది. అయితే మూర్తియాదవ్ ఏమాత్రం తగ్గకుండా సీఎస్‌పై గురువారం మరోసారి తీవ్ర విమర్శలే గుప్పించారు. జనసేన కార్యాయలంలో మీడియాతో మాట్లాడుతూ..
సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తరాంధ్ర జిల్లాల్లో 596 జీవోను సాకుగా చేసుకొని బినామీల ద్వారా వందల ఎకరాల భూములు కాజేశారనే ఆరోపణలను రుజువు చేసేందుకు తాను సిద్ధమన్నారు. సీఎస్ లీగల్ నోటీసులకు భయపడేదే లేదని స్పష్టం చేశారు. అన్నవరం సమీపంలోని ఏ1 హోటల్ అధినేత చోడ్రాజు సత్య కృష్ణంరాజు, విశాఖకు చెందిన రియల్టర్ పేరిచర్ల శ్రీనివాసరాజు జవహర్ రెడ్డికి బినామీలుగా వ్యవహరించారన్నారు. సూర్రెడ్డి త్రిలోక్.. జవహర్‌రెడ్డి వ్యవహరాలకు బ్రోకర్ అన్నారు.
వందల కోట్ల లావాదేవీలు, వందల ఎకరాల వ్యవహారాలు చోడ్రాజు సత్య కృష్ణంరాజుతో జవహర్‌రెడ్డి చేయడంవల్లే గతనెల 17న కృష్ణంరాజు క్యాన్సర్‌తో మరణిస్తే జవహర్‌రెడ్డి ఆఘమేఘాల మీద అన్నవరం వచ్చారని మూర్తియాదవ్ వివరించారు. కృష్టంరాజు చనిపోయిన రోజు కుటుంబం మీద ఎటువంటి సానుభూతి చూపకపోగా, లావాదేవీలకు సంబంధించిన అంశాలపై తీవ్ర వత్తిడి తెచ్చారని ఆరోపించారు. జవహర్‌రెడ్డి వేధింపులనుంచి రాజు కుటుంబానికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
ఎర్రదిబ్బల కబ్జా పాపం జవహర్‌దే..
విశాఖలోని చారిత్రక ఎర్రమట్టిదిబ్బల ప్రాంతానికి డీ పట్టాలిచ్చి కాజేసిన వ్యక్తి జవహరేనని దుయ్యబట్టారు. విశాఖ రియల్టర్ పేరిచర్ల శ్రీనివాస రాజు ద్వారా ఎర్రదిబ్బలున్న నిడిగట్టు, నేరెళ్లవలస ప్రాంతాల్లో వంద ఎకరాల డీ పట్టాలను అమాయక దళితులనుంచి బలవంతంగా అగ్రిమెంట్లు చేయించుకొన్నారని ఆరోపించారు.
విశాఖ ఆంధ్రా వర్శిటీలో పనిచేసిన మంత్రి మేరుగు నాగర్జునకు ఇందులో కొన్ని భూములకు అగ్రిమెంట్లు ఉండడంతో.. రెండువర్గాలూ దళితుల పొట్టగొట్టి సెటిల్ చేసుకొన్నారని ఆరోపించారు. ఈ భూముల విలువే వందల కోట్లు ఉంటుందని లెక్కజెప్పారు.
బినామీ ఆస్తులు ఇవే…
సీఎస్ జవహర్ రెడ్డి, సత్య కృష్ణంరాజులు విశాఖలో తమకు బినామీ అయిన శ్రీనివాసరాజు వద్ద కోట్లలో పెట్టుబడులు పెట్టారని మూర్తియాదవ్ గుట్టువిప్పారు. కాపులుప్పాడ సర్వే నెంబర్ 16, 39లో కృష్ణంరాజు, శ్రీనివాసులు వేసిన 45 ఎకరాల లేఅవుట్ ఇందులో ఒకటన్నారు. కొమ్మాది చైతన్య కళాశాల సమీపంలో రెండు ఎకరాల భూమి, ఎండాడలో పది వేల గజాల భూమి జవహర్‌రెడ్డికి చెందినవేనని, ఆయన బినామీల ఆధీనంలో ఉన్నాయని మూర్తియాదవ్ ఆరోపించారు. భోగాపురం విమానాశ్రయం చుట్టూ, ఆనందపురం, భీమిలి, పద్మనాభం, పూసపాటిరేగ మండలాల్లో వందల ఎకరాలు డీ పట్టా భూములను జవహర్‌రెడ్డి తన అధికార బలంతో కైంకర్యం చేశారని ధ్వజమెత్తారు.
ఈసీలు, సర్టిఫైడ్ కాపీల సైట్ తెరవాలి..
జవహర్‌రెడ్డి వేల కోట్ల భూదందా బయటపెట్టగానే రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ‘ఐజీఆర్‌ఎస్’ సైట్‌ను బ్లాక్ చేసిందని మూర్తియాదవ్ ఆరోపించారు. న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని పదే పదే ప్రకటనలు చేసిన జవహర్‌రెడ్డి, తన నిజాయితీపట్ల అంత నమ్మకం, ధైర్యముంటే.. రాష్ట్ర పరిపాలనా విభాగాధిపతి హోదాలో ముందు ఈసీలు, సర్టిఫైడ్ కాపీలు కనిపించే వెబ్సైట్‌ను తెరిపించాలని మూర్తియాదవ్ సవాల్ చేశారు. ఇప్పుడు సైట్ అప్డేట్‌లు ఏమీలేవని, కేవలం జవహర్‌రెడ్డి తన భాగోతం బటయపడకుండా ఉండేందుకే సైట్‌ను బ్లాక్ చేయించారని ధ్వజమెత్తారు.
ముందు.. జీవోను రద్దు చేయాలి
రాజ్యంగ స్పూర్తిని దెబ్బతీస్తూ.. దళితుల చేతుల్లోని భూములను సంపన్నవర్గాలకు బదలాయించే 1977 చట్టానికి విరుద్ధమైన జీవో 596ను తక్షణం రద్దు చేయాలని మూర్తియాదవ్ డిమాండు చేశారు. దళితుల సంక్షేమం దృష్ట్యా.. జీవో కింద సాగిన లావాదేవీలను అబయన్స్‌లో పెట్టాని కోరారు. దళితులు, బీసీ జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు ప్రభుత్వం కేటాయించిన భూమిని వ్యవసాయ అవసరాలకే వాడాలని, అందుకు విరుద్ధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారలకు భూములు బదిలీ అవుతుంటే.. జవహర్‌రెడ్డి నేతృత్వంలోని అధికారులు చూస్తూ ఎలా ఊరుకున్నారని ప్రశ్నించారు. ఈ భూ కుంభకోణం దేశంలోనే అతి పెద్దదని, సీఎస్ జవహర్‌రెడ్డి ఇందుకు సూత్రధారి అని ఆరోపించారు. వెంటనే సీఎస్ పదవి నుంచి జవహర్‌ను తప్పిస్తూ ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని, భూ కుంభకోణం నిగ్గుతేల్చేందుకు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని మూర్తియాదవ్ డిమాండ్ చేశారు.