- ఏపీలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం
- అభివృద్ధి, సంక్షేమానికి సీఎం చంద్రబాబు రోల్‌మోడల్
- ఏపీ అభివృద్ధిపై చంద్రబాబు పూర్తి ఫోకస్ పెట్టారు
- భాగస్వామ్య సదస్సు విజయవంతం కావాలి
- ఏపీ కృషికి తగిన పెట్టుబడులు వరదవ్వాలి
- సీఐఐ సదస్సు ప్రారంభోత్సవంలో రాధాకృష్ణన్
- భాగస్వామ్య సదస్సును ప్రారంభించిన ఉపరాష్ట్రపతి
- ఏపీలో ప్రతీ బిడ్డా అదృష్టవంతుడు: కేంద్రమంత్రి పీయూష్
విశాఖపట్నం (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందకు ఇదే సరైన సమయమని భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ప్రకటించారు. భాగస్వామ్య సదస్సు విజయవంతం కావాలని… పెట్టుబడులు వరదలా రావాలని ఆకాంక్షించారు. విశాఖపట్నంలో శుక్రవారంనుంచి రెండు రోజులపాటు జరగనున్న 30 సీఐఐ భాగస్వామ్య సదస్సును ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖకు చేరుకున్న ఉప రాష్ట్రపతికి, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రి నారా లోకేష్ సహా వివిధ మంత్రులు, ఉన్నతాధికారులు భారీగా స్వాగతం పలికారు. అలాగే ఆంధ్రా యూనివర్శిటీ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న సదస్సు ప్రాగంణానికి చేరుకున్న ఉప రాష్ట్రపతికి ముఖ్యమంత్రి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఉప రాష్ట్రపతిని అల్పాహార విందుకు ఆహ్వానించారు. ఈ విందులో కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, రామ్మోహన్నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్‌తోపాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు.
అనంతరం సభా ప్రాంగణంలోని ప్లీనరీ హాల్లో నిర్వహించిన భాగస్వామ్య సదస్సు ప్రారంభోత్సవ సభలో ఉప రాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ మాట్లాడుతూ… ‘‘ప్రధాని మోదీ నేతృత్వంలో ఆర్ధికంగా సుసంపన్నమైన దేశంగా భారత్ ఎదుగుతోంది. సంపద సృష్టిస్తేనే ప్రపంచంలో పేదరిక నిర్మూలన సాధ్యమవుతుంది. ఏపీలో సుపరిపాలన, అత్యుత్తమ విధానాలనే సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఆచరిస్తోంది. అభివృద్ధికి -సంక్షేమానికి సీఎం చంద్రబాబు నాయుడు రోల్ మోడల్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు హైదరాబాద్‌ను గ్లోబల్ ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఏపీని అభివృద్ధి చేయడానికి అంతే శ్రద్ధ చూపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు సాధించడానికి చంద్రబాబు పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులను ఒప్పిస్తున్నారు. విశాఖలో నిర్వహిస్తున్న పెట్టుబడుల సదస్సు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను. దేశం, రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి పనిచేస్తున్నాయి. జీఎస్టీ సంస్కరణలు, మౌలిక సదుపాయాల కల్పనవంటివి దేశాభివృద్ధి దోహదం చేస్తున్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్, బ్లూ, అగ్రి ఎకనామీ ఇలా వేర్వేరురంగాల్లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఏపీలో ఉన్నాయి. ఈ-గవర్నెన్సు, డిజిటల్ ఇన్ ఫ్రా ద్వారా వేగంగా సేవలు అందుతున్నాయి. టెక్నాలజీ నాలెడ్జి డ్రివెన్ ఎకానమీ సాధించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయి. దేశంలోనూ, ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఇప్పుడు అనుకూల సమయం. దీన్ని పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలి. వచ్చే రెండు మూడేళ్లలో 3వ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా భారత్ నిలుస్తుంది. అలాగే అతిపెద్ద స్టార్టప్ ఎకో సిస్టంగానూ భారత్ ఎదుగుతుంది. 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పాదనతో ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధిస్తాం. ప్రతీ దేశంతోనూ భారత్ మైత్రినే కోరుకుంటుంది. అంతా కలిసి ఎదుగుదాం అనే భావన భారతదేశానిది. ఇతరులకు నష్టం కలిగించటం కాదు, ప్రయోజనం కల్పించటం ద్వారా అభివృద్ధి సాధించాలనేది భారత్ నినాదం’’ అని ఉప రాష్ట్రపతి అన్నారు. అనంతరం రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తూ… ‘‘30వ సీఐఐ భాగస్వామ్య సదస్సుకు 8వసారి ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యం ఇస్తోంది. దేశ విదేశాలకు చెందిన ప్రతినిధులు హాజరైన సదస్సు ప్రపంచ వాణిజ్యాన్ని ప్రతిబింబిస్తోంది. ప్యూచర్ రెడీ ఇన్నోవేషన్ రాష్ట్రంగా ఏపీని ముఖ్యమంత్రి చంద్రబాబు తీర్చిదిద్దుతున్నారు. సదస్సు ద్వారా ప్రతీ ఆలోచనా, ప్రతీ పెట్టుబడి భవిష్యత్ తరాలకు సంపదగా మారాలని కోరుతున్నాను’’ అని ఏపీ గవర్నర్ ఆకాంక్షించారు.
ఏపీలో పుట్టిన ప్రతి బిడ్డా అదృష్టవంతుడే: పీయూష్
ప్రారంభోత్సవ సదస్సులో పాల్గొన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ… ‘‘ఏపీ అభివృద్ధి గురించి మాత్రమే కాదు, యావత్ భారతదేశం అభివృద్ధి గురించి సీఎం చంద్రబాబు ఆలోచిస్తారు. విజనరీ సీఎం చంద్రబాబు ఉన్న ఏపీలో పుట్టిన ప్రతీ బిడ్డా అదృష్టవంతుడే… వారి భవిష్యత్ అంతా ఉజ్వలమైనదే. గ్లోబల్ ట్రేడ్ గేట్‌వేగా విశాఖ నిలుస్తోంది. స్టీల్ ఉత్పత్తి, ఆక్వా రంగాల్లో ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. 2047 స్వర్ణాంధ్ర విజన్‌తో ఏపీ సాంకేతికంగా, ఆర్ధికంగా బలోపేతం అవుతుంది. 2047నాటికి సుసంపన్నమైన దేశంగా భారత్ అవతరిస్తుంది. టెక్నాలజీ ద్వారా ఈ సుసంపన్నతను సాధిస్తాం. టెక్నాలజీ డెమొక్రటైజేషన్ అనే విధానాన్ని పాటిస్తూ అందరికీ దానిని చేరువ చేస్తున్నాం. భారత్ తెచ్చిన డిజిటల్ పేమెంట్ విధానం ఇప్పుడు చాలా దేశాలు అనుసరిస్తున్నాయి. 30 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులతో సెమీ కండక్టర్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నాం. 104 శాటిలైట్లను ఒకేసారి అంతరిక్షంలోకి పంపిన దేశంగా సాంకేతికతను ప్రజలకు దగ్గర చేస్తున్నాం. 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుని ఆ దిశగా పనిచేస్తున్నాం. ఇంజినీరింగ్ నైపుణ్యాలు ఉన్న భారత యువత ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తున్నారు. కోవిడ్ సమయంలో 110 దేశాలకు వ్యాక్సిన్ సరఫరా చేసి భారతీయ భావన వసుధైక కుటుంబం అనే విషయాన్ని నిరూపించాం. స్వేచ్ఛా వాణిజ్యం కోసం వివిధ దేశాలతో ఒప్పందాలు చేసుకుని దానికి అనుగుణంగా వాణిజ్య బంధాలను బలోపేతం చేస్తున్నాం. డిజిటల్ ట్రాన్ఫర్మేషన్ దిశగా, జీఎస్టీ సంస్కరణలతో ప్రజలందరికీ ఆర్ధిక అభివృద్ధి దిశగా పయనిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా భిన్నమైన పరిస్థితులు ఉన్నా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పెద్దఎత్తున భారత్ ఆకర్షిస్తూనే ఉంది. అత్యంత పారదర్శకమైన విధానంలో వాణిజ్యం ఉండాలని మేం కోరుకుంటున్నాం. సీఐఐ సదస్సులతో సరికొత్త పెట్టుబడులు, ఆలోచనలు, ఆవిష్కరణలు రావటం అభినందనీయం. వాణిజ్య ప్రదర్శనలకు, ఎగ్జిబిషన్లు, సదస్సులకు వీలుగా ఢల్లీిలో భారత్ మండపం ఉన్నట్టే ఆంధ్రా మండపం నిర్మించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. బీహార్ ఎన్నికల ఫలితాలు కూడా వచ్చాయి. ప్రధాని మోదీపై ప్రజలు విశ్వాసం ఉంచారు అనడానికి ఈ ఫలితాలే నిదర్శనం. ప్రధాని మోదీపై నమ్మకం ఉంచి, ఎన్డీఏకు పట్టం కడుతున్న బీహార్ ప్రజలకు ధన్యవాదాలు తెలియచేస్తున్నా’’ అని కేంద్ర మంత్రి పీయూష్ పేర్కొన్నారు.
అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ ఏపీ: కేంద్రమంత్రులు కింజరాపు, పెమ్మసాని
సదస్సులో పాల్గొన్న కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ వంటి వారు ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని వివరించారు. అలాగే ఏపీ పారిశ్రామికవేత్తలకు ఎలాంటి అనువైన వాతావరణం కల్పిస్తుందోననే అంశాలను వెల్లడిరచారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు వంటి విజనరీ లీడర్ల నేతృత్వంలో భారతదేశం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా ముందడుగు వేస్తున్నాయన్నారు. గత కొన్ని నెలలుగా ఏపీలో కీలకమైన మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతోందని వివరించారు. పోర్టులు, ఎయిర్ పోర్టులు అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం అవుతున్నాయని.. ప్రస్తుతం ఏడు ఆపరేషన్ ఎయిర్ పోర్టులుంటే కొత్తగా మరో 7 ఎయిర్ పోర్టులు నిర్మాణం చేస్తామని… ఏరోస్పేస్, ఎయిర్ క్రాఫ్ట్ తయారీని కూడా ఏపీకి తీసుకువస్తామని రామ్మోహన్ నాయుడు చెప్పారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ… పారిశ్రామిక యూనిట్ల ఏర్పాటుతో పాటు… అతిపెద్ద మార్కెట్‌కు పారిశ్రామికవేత్తలను, కంపెనీలను చేరువ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని వివరించారు. వివిధ రంగాల్లోని పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ నమ్మకమైన భాగస్వామిగా ఉంటుందన్నారు. అగ్రికల్చర్ నుంచి ఏరో స్పేస్ వరకూ వివిధ రంగాల్లో పెట్టుబడులు, యూనిట్లు ఏపీకి వస్తున్నాయని పెమ్మసాని స్పష్టం చేశారు.













